అమ్మకానికి మరో పేరు

ABN , First Publish Date - 2021-08-24T08:37:18+05:30 IST

ఇది అమ్మకం ఎంత మాత్రం కాదు, ఆస్తుల్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం మాత్రమే అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ప్రణాళిక ప్రకటించారు...

అమ్మకానికి మరో పేరు

ఇది అమ్మకం ఎంత మాత్రం కాదు, ఆస్తుల్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం మాత్రమే అంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) ప్రణాళిక ప్రకటించారు. రాబోయే నాలుగేళ్ళ కాలంలో ఆరులక్షలకోట్లు సమీకరించడం లక్ష్యంగా, అత్యంత కీలకమైన రంగాల్లోని ఆస్తిపాస్తులను కేంద్రం ఇందుకు ఎంచుకున్నది. విద్యుత్‌, రోడ్లు, రైళ్ళు, విమానాశ్రయాలు, క్రీడామైదానాలు ఇలా అవీ ఇవీ అని కాకుండా దాదాపు అన్ని రంగాల ఆస్తులూ ఇందులో ఉన్నాయి.


ఆస్తులపై యాజమాన్యహక్కులు ప్రభుత్వానికే ఉంటాయనీ, నిర్దేశిత కాలం తర్వాత సదరు ప్రైవేటు భాగస్వామి వాటిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం తప్పనిసరి అని కూడా ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. వినియోగంలో లేని లేదా గరిష్టంగా వినియోగించుకోని ఆస్తులను మాత్రమే ఇందుకు ఎంపికచేశామన్నారు. మొన్నటి బడ్జెట్‌లోనే ఆర్థికమంత్రి ఈ పథకాన్ని ప్రస్తావించినా, బహుశా దాని లోతుపాతులు, పరమార్థాలు సరిగా చెవికెక్కనందుకో ఏమో విపక్షాలనుంచి బలమైన ఎదురుదాడి లేకపోయింది. ఇప్పుడు కొందరు ఆర్థికవేత్తలు మాత్రం ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి కలిగే ప్రయోజనంపై అనుమానాలు వ్యక్తంచేస్తుంటే, దీనివెనుక కనిపించని మాయ ఏదో ఉన్నదని మరికొందరి వాదన. ఆస్తులను అమ్మేది లేదు, తిరిగి కచ్చితంగా వెనక్కుతీసుకుంటామని నిర్మల చెబుతున్నా అత్యధికులకు ఆ నమ్మకం కలగడం లేదు. 


ఒక ఆస్తిని సుదీర్ఘకాలం అనుభవించేందుకు వీలుగా అధికారాలు పొంది, దానిని అభివృద్ధి చేసిన తరువాత, ప్రభుత్వం ఇచ్చినదానిని వెనక్కు ఇచ్చేయడం జరిగే పనేనా? అన్నది ప్రశ్న. సర్వసాధారణంగా ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు చేతుల్లోకి పోవడమే తప్ప తిరిగి రావడం కనిపించదు. పైగా, గరిష్టస్థాయిలో సద్వినియోగం చేసే క్రమంలో సదరు ప్రైవేటు యజమాని బ్యాంకు రుణాలు తీసుకుంటాడు, పెట్టుబడులు పెడతాడు. ప్రభుత్వానికి ఎంతో కొంత ముట్టచెబుతూ, వాటిని మరింత విలువైన ఆస్తిపాస్తులుగా మార్చి, ఎక్కువే పిండుకుంటాడు. ఆ తరువాత కూడా వాటిని తిరిగి అప్పగించడానికి కాక, అనుభవించడానికే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం వంటి అందమైన పేర్లు పెట్టిన పథకాల్లో అంతిమంగా జరిగేది ప్రైవేటుకు ప్రభుత్వం తన వాటాలు వదిలేయడమే. అభివృద్ధి–నిర్వహణ– బదిలీ అనే మూడుదశల్లో ఆఖరుది ఏ ప్రాజెక్టులోనూ కనిపించదు. 


యాభై అరవైయేళ్ళపాటు ఒక ప్రాజెక్టునుంచి ప్రైవేటుపెట్టుబడిదారుడు లాభాన్ని పూర్తిగా జుర్రుకున్నాక కూడా ప్రభుత్వం ఆ ప్రాజెక్టును తీసుకోవడం సర్వసాధారణంగా జరగదు. కార్పొరేట్లకూ, కుబేరులకూ ప్రజల ఆస్తులను అప్పగించడానికి ప్రభుత్వాల దగ్గర చాలా మార్గాలుంటాయి, నేతల దగ్గర సామాన్యుడికి అర్థంకాని ఆర్థికపరిభాష ఉంటుంది. వేలకోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, వాటి నిర్వహణ ప్రైవేటువ్యక్తులకు అప్పగించడం, ప్రైవేటురంగం వినియోగదారులను దోచేయడం ఎప్పటినుంచో జరుగుతున్న విన్యాసమే. ఈ వనరుల గరిష్టస్థాయి వినియోగం ద్వారా సమకూరినదానిని కూడా తిరిగి మౌలిక సదుపాయాల కల్పనకే వెచ్చిస్తామని అంటున్నారు. ఇదో విషవలయం. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులను పద్దుపుస్తకాల్లోంచి చెరిపేస్తున్న పాలకులు ప్రభుత్వరంగ ఆస్తుల గరిష్టవినియోగానికి మాత్రం సిద్ధపడుతున్నారు. ఈ తరహా ప్రతిపాదనల్లో అటు ప్రజలూ ఇటు ప్రభుత్వమూ ప్రయోజనం పొందాలి కానీ, అత్యధిక లబ్ధి పొందుతున్నది మాత్రం వేరొకరు. ‘దీపం’ అని పేరుపెట్టుకొన్న పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం అంతిమంగా చేస్తున్నదల్లా వాటిని అప్పగించడమో, అమ్మేయడమో. కరోనా కాలంలోనూ అన్ని అవాంతరాలనూ దాటి పది ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆ విభాగం కార్యదర్శి ఇటీవలే పారిశ్రామికవేత్తల సదస్సులో చెప్పుకొస్తూ ఈ ఆరులక్షలకోట్ల ఎన్‌ఎంపీని కూడా ఘనంగా ప్రస్తావించారు. ప్రజల ఆస్తులు ఎక్కడికీ పోవు, బడాపారిశ్రామికవేత్తల చేతుల్లో మెరుపునూ, విలువనూ సంతరించుకొని మళ్ళీ వెనక్కువచ్చేస్తాయన్న పాలకుల పలుకులు ఎందుకో నమ్మశక్యంగా లేవు.

Updated Date - 2021-08-24T08:37:18+05:30 IST