సాయుధ పోరాటం తరహాలో మరో ఉద్యమం తప్పదు

ABN , First Publish Date - 2022-05-18T05:09:23+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలనను

సాయుధ పోరాటం తరహాలో మరో ఉద్యమం తప్పదు
ఆమనగల్లులో మాట్లాడుతున్న మల్లు రవి

  • నియంతృత్వ కేసీఆర్‌ పాలనను అంతమొందించాలి 
  • కాంగ్రె్‌సతోనే రైతురాజ్యం సాధ్యం
  • రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు 
  • 21 నుంచి జూన్‌ 21వరకు కాంగ్రెస్‌ రైతు రచ్చబండ 
  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి 


ఆమనగల్లు, మే 17: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలనను అంతమొందించేందుకు నాటి తెలంగాణ సాయుధ పోరాట తరహాలో ఉద్యమించక తప్పదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మండ్లీ రాములు, కాంగ్రెస్‌ పార్టీ కడ్తాల మండల అధ్యక్షుడు యాట నర్సింహలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లు రవి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తూ నియంతపాలన కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాల విధానాలతో అన్నివర్గాల ప్రజలు వేదనకు గురవుతున్నారని ఆయన అన్నారు. హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. ఖాళీగా ఉన్న అధ్యాపకుల, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడంలేదని అన్నారు. కొత్తగా ఏర్పాటుచేసిన ప్రైవేట్‌ యూనివర్సిటీలలో విద్యార్థులకు రిజర్వేషన్లు లేకుండా చేశారని మల్లు రవి ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరోఉద్యమం చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. కాంగ్రె్‌సతోనే రైతురాజ్యం సాధ్యమని అందుకే వరంగల్‌లో కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందని మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌కు రాష్ట్రంలో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఎక్కడ చూసినా రైతు డిక్లరేషన్‌ పైనే చర్చ జరుగుతోందన్నారు. సోనియా, రాహుల్‌ ఆదేశాలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందంటే అది కచ్చితంగా అమలు అవుతుందని రైతులకు తెలుసని అన్నారు.  కేసీఆర్‌ సర్కార్‌ ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తోందని మల్లు మండిపడ్డారు. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రతి పౌరుడికి తెలియజెప్పేందుకు గ్రామాల వారీగా ఈనెల 21నుంచి రైతు రచ్చబండ కార్యక్రమం ద్వారా వివరిస్తామన్నారు. ఇందుకోసం ప్రతి 30గ్రామాలకు ఒక ఇన్‌చార్జిని నియమించడానికి టీపీసీసీ సమావేశం నిర్ణయించినట్లు మల్లు రవి చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో  బ్లాక్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఎంఏ ఖలీల్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కృష్ణనాయక్‌, నాయకులు కొప్పు రాఘవేందర్‌, వస్పుల శ్రీకాంత్‌, మహేశ్‌, ఫరీద్‌, అలీం, రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.  



Updated Date - 2022-05-18T05:09:23+05:30 IST