మరో ఉద్యమం

ABN , First Publish Date - 2022-05-23T08:21:12+05:30 IST

రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

మరో ఉద్యమం

  • ఎమ్మెస్పీకి రాజ్యాంగ రక్షణ కోసం దేశవ్యాప్త పోరాటం
  • అన్నదాతలకు మేమంతా అండగా ఉంటాం
  • రైతులు గర్జిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి
  • కేంద్రం కర్షకుల రక్తాన్ని పీల్చమంటోంది
  • అన్నదాతల సంక్షేమం వారికి నచ్చట్లేదు 
  • దేశద్రోహులు, ఖలిస్థానీలంటూ నిందలేశారు
  • చండీగఢ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు
  • గల్వాన్‌ అమర జవాన్లు, రైతు ఆందోళనల్లో
  • మరణించిన వారి కుటుంబాలకు పరిహారం
  • ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలతో కలిసి అందజేత
  • రైతుల్ని స్టేడియాల్లో బంధించాలనుకున్నారు
  • మేం ఒప్పుకోలేదని కేంద్రానికి కోపం: కేజ్రీ


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రైతులు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతులు పండించే పంటలకు కల్పించే కనీస మద్దతు ధరకు రాజ్యాంగ రక్షణ ఉండాలన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరకు రాజ్యాంగ రక్షణపై హామీ ఇచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలన్నారు. ఈ ఐక్యతను దేశవ్యాప్తంగా రైతు నేతలు సాధిస్తే రాజ్యాంగ రక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. రైతుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో మరణించిన రైతుల కుటుంబ సభ్యులకు, గల్వాన్‌ లోయలో చైనా సైనికుల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని ఆదివారం చండీగఢ్‌లో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘ఇది సంతోషించదగ్గ సందర్భం కాదు. దుఃఖభరితమైన విషయం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇంకా ఇలాంటి సభను ఏర్పాటు చేసుకోవడం దురదృష్టకరం. దేశం ఎందుకు ఇలా ఉందన్నదానిపై చింతించాలి. దేశంలో ప్రతిదానికీ ఎంతో కష్టపడాల్సివస్తోంది. దీని మూలం ఎక్కడ ఉందన్న అంశంపై చర్చ జరగాలి’’ అని అన్నారు. దేశంలో అనేక సమస్యలుఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రజలు పోరాడటం, మరణించడం, అమరులు కావాల్సి రావడం జరుగుతోందన్నారు.



అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం..

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతుల ఉద్యమంలో అమరులైన వారిని వెనక్కి తీసుకురాలేమని, కానీ.. దేశం మొత్తం వారి కుటుంబాలకు అండగా ఉందని చెప్పేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, తెలంగాణలో తాము కూడా అనేక పనులు చేస్తున్నామని అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతాంగం దుఃఖస్థితిలో ఉండేది. ఒక్క రోజులో 10-20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి బాధలు ఎవరూ వినేవారు కాదు. కానీ, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్తు సమస్యను పరిష్కరించాం. సాగుకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్తు అందిస్తున్నాం’’ అని కేసీఆర్‌ వివరించారు. నేడు ఢిల్లీలో మన నెత్తిమీద కూర్చున్న కేంద్ర సర్కారు.. వ్యవసాయ మోటారు కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటోందని, రైతుల రక్తాన్ని పీల్చాలంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసుకున్నా సరే తాము మాత్రం మీటర్లు పెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించానని చెప్పారు. రైతుల కోసం రాష్ట్రాలు ఏదైనా మంచి చేస్తే కేంద్రానికి నచ్చడంలేదన్నారు. సాగు చట్టాల రద్దు కోసం పోరాటం చేసిన రైతులపై అనేక ఆరోపణలు చేశారని, ఖలిస్థానీలని, దేశద్రోహులని నిందలు వేశారని అన్నారు. ఇలాంటి ఆందోళనలు కొనసాగాలని, కేవలం పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ నుంచి కాకుండా మొత్తం దేశం నుంచి జరగాలని పేర్కొన్నారు.

 

భగత్‌సింగ్‌కు జన్మనిచ్చిన నేల పంజాబ్‌..

స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన భగత్‌సింగ్‌కు జన్మనిచ్చిన పంజాబ్‌ గొప్ప నేల అని కేసీఆర్‌ కొనియాడారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్న పంజాబ్‌.. ఆ తర్వాత తీవ్ర కరవులో హరిత విప్లవం సాధించి దేశం ఆకలి తీర్చిందన్నారు. ఈ రెండు సంఘటనలు పంజాబ్‌ గురించి దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. సాగు చట్టాల రద్దు కోసం రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వారిని నిర్బంధించడానికి ఢిల్లీలోని స్టేడియాలను జైళ్లుగా మార్చాలని కేంద్రం ప్రయత్నించిందన్నారు. అందుకు తాము అంగీకరించకపోవడంతో తమపై కేంద్రానికి ఆగ్రహం కలిగిందని చెప్పారు. అయినా తాము రైతులకు అండగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, సంతో్‌షకుమార్‌, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.  


కేసీఆర్‌ కళ్లలో నీళ్లు చూశాను

‘‘గల్వాన్‌లో అమరులైన నలుగురు పంజాబ్‌ జవాన్లకు, కిసాన్‌ ఆందోళనలో మృతి చెందిన 712 మంది రైతు కుటుంబాలకు పరిహారం మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిహారం ఇవ్వడం హర్షణీయం. ఆయన స్వయంగా రైతు. అన్నదాతల సమస్యలు ఆయనకు బాగా తెలుసు. రైతుల దుస్థితిపై అనేకసార్లు కేసీఆర్‌ కళ్లలో నీళ్లు చూశాను. రైతు రాజు అయితేనే భారత అభివృద్ధి సాధ్యమని ఆయన నమ్ముతారు. రైతుల అభివృద్ధికి తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నాం’’ అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. 


కేజ్రీవాల్‌తో సుదీర్ఘ చర్చలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదివారం ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిపారు. కేజ్రీవాల్‌ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో మధ్యాహ్న భోజనానికి వెళ్లిన కేసీఆర్‌.. సుమారు రెండు గంటలపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలు వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం ఇద్దరు సీఎంలు చండీగఢ్‌ బయలుదేరి వెళ్లారు. 


మనం చెమటోడ్చి ప్రపంచానికి అన్నం పెడుతున్నాం. న్యాయం పొందడం మన హక్కు. ఇలాంటి ఆందోళనలు చేసే పరిస్థితి రాకూడదంటే.. పాలకులను మార్చాలి. అధికారం మన వల్లనే వస్తోంది. అధికారంలోకి  తేవడం, దించడం మన చేతుల్లోనే ఉంది.

- రైతులను ఉద్దేశించి కేసీఆర్‌

Updated Date - 2022-05-23T08:21:12+05:30 IST