రెవెన్యూకు మరో ఝలక్‌

ABN , First Publish Date - 2021-06-20T04:58:58+05:30 IST

రెవెన్యూ అధికారుల మెడకు..

రెవెన్యూకు మరో ఝలక్‌
కోర్టు కేసులో ఉన్న స్థలంలో నిర్మాణాలు కూలుస్తున్న దృశ్యం

పల్లా శ్రీనివాస్‌ భూమి అనుకొని వేరే స్థలంలో కూల్చివేతలు

అందులో పరిశ్రమ నడుపుతున్న ప్రైవేటు వ్యక్తులు

తమ హక్కు పత్రాలు చూపించినా అధికారులు పెడచెవిన పెట్టారంటూ కోర్టులో కేసు

జేసీ, తహసీల్దార్‌, ఏపీఐఐసీలకు నోటీసులు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ అధికారుల మెడకు కోర్టు కేసులు చుట్టుకుంటున్నాయి. ముందువెనుకా చూడకుండా అధికార పార్టీ ఆదేశాలను అమలుచేస్తున్నందుకు వ్యక్తిగతంగా అధికారులు కోర్టు కేసులు ఎదుర్కొనాల్సి వస్తోంది. తెలుగుదేశం నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక ప్రాంతంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ ఈ నెల 13వ తేదీన రెవెన్యూ అధికారులు పలుచోట్ల ప్రహరీలు, నిర్మాణాలు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిని పల్లా తీవ్రంగా ఖండించారు. ఆ భూములు తన స్వాధీనంలో లేవని, ప్రభుత్వ రికార్డుల్లో కూడా చెరువులుగా వున్నాయని పేర్కొన్నారు. ఇదిలావుంటే..పల్లా శ్రీనివాస్‌ భూములు అనుకొని రెవెన్యూ అధికారులు తుంగ్లాం సర్వే నంబర్‌ 29/1లో 5.42 ఎకరాల్లోకి వెళ్లి అక్కడి ప్రహరీ కూల్చివేశారు. దాని యజమానులు హక్కుపత్రాలు చూపిస్తున్నా పట్టించుకోలేదు. ఆ స్థలంలో వారు నడుపుతున్న పరిశ్రమకు వెళ్లకుండా అడ్డంగా రోడ్డును కూడా తవ్వేశారు. 


ఏడేళ్ల క్రితమే ఇంటెరిమ్‌ ఆర్డర్‌

ఇక్కడ విషయం ఏమింటే...ఆ సర్వే నంబరులో రెవెన్యూకు భూమి లేదు. కానీ సర్వేయర్‌, మండలాధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు వెళ్లి అక్కడి ప్రహరీ కూల్చి, ఇతర సదుపాయాలకు భంగం కలిగించారు. ఆ సర్వే నంబర్‌లో పి.అజయ్‌కుమార్‌, పి.అమర్‌చంద్‌, పి.సునితాదేవి అనే వారు 5.42 ఎకరాలు కొనుక్కొని పరిశ్రమ పెట్టుకొని నడుపుతున్నారు. ఆ భూమి పల్లా శ్రీనివాసరావు ఆక్రమించుకున్నదిగా భావించి, ఆయన లీజుకు ఇచ్చారని భ్రమించి అధికారులు కూల్చివేశారు. అయితే ఆ భూమిని రైల్వే లైను కోసం తాము సేకరించామని స్టీల్‌ప్లాంటు అధికారులు ఏడేళ్ల క్రితం (2014) స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ ముగ్గురు హైకోర్టులో రిట్‌ పిటిషిన్‌(8598) వేసి ఇంటెరిమ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు.


ఆ స్థలంలో ఆస్తులకు ఎటువంటి భంగం కలిగించకూడదని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. స్టీల్‌ప్లాంటుకు, వారికి మధ్య కేసు నడుస్తోంది. ఈ నెల 13న రెవెన్యూ అధికారులు అది తమ భూమి అని, పల్లా శ్రీనివాసరావు ఆక్రమించుకుని లీజుకు ఇచ్చారని ఆరోపిస్తూ కూల్చేశారు. దాంతో బాధితులు మరోసారి కోర్టుకు వెళ్లారు. జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, గాజువాక తహసీల్దార్‌ లోకేశ్‌, ఏపీఐసీసీ అధికారి శామ్యూల్‌ తదితరులపై వ్యక్తిగత కేసులు వేశారు. ఆ మేరకు కోర్టు వారికి నోటీసులు జారీచేసింది. ఆ భూముల్లో నిర్మాణాలు ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలని ఆదేశించింది. దీనిపై రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అది రెవెన్యూ భూమి అనుకునే వెళ్లామని, కోర్టు వివాదం వుందని తెలియదని జేసీకి తహసీల్దార్‌ చెప్పినట్టు తెలిసింది. సర్వేయర్‌ సమాచారం ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పినట్టు తెలిసింది. అయుతే బాధితులు వ్యక్తిగతంగా కేసులు వేయడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మధ్యలో తాము నలిగిపోతున్నామని వాపోతున్నారు. 

Updated Date - 2021-06-20T04:58:58+05:30 IST