జిల్లాకు మరో మెడికల్‌ కళాశాల

ABN , First Publish Date - 2020-05-26T10:41:19+05:30 IST

నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో కొత్తగా ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

జిల్లాకు మరో మెడికల్‌ కళాశాల

తాడేపల్లిగూడెం లేదా  నరసాపురంలలో ఏర్పాటు

వారంలో ప్రభుత్వ నిర్ణయం

 వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని


నరసాపురం, మే 25 : నరసాపురం పార్లమెంట్‌ పరిధిలో కొత్తగా ఒక మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. సోమవారం ఎమ్మెల్యే ప్రసాదరాజు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని లిఖితపూడి,తాడేపల్లిగూడెం ప్రాంతంలోని విమానాశ్రయ భూముల్ని పరిశీలించామన్నారు. ఈ రెండింటిలో ఎక్కడ ఏర్పాటు చేయబోయేది వారంలో ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. దీన్ని ప్రక్షాళన చేసి మారుమాల ప్రాంత ప్రజలకు సైతం కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.


దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్ని ఆధునికీకరిస్తామని చెప్పారు. ఖాళీగా వున్న డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. ఎటువంటి వైరస్‌లు వచ్చినా వాటికి స్థానికంగానే మెరుగైన  వైద్యమందే విధంగా ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు. లిఖితపూడిలో మెడికల్‌ కాలేజీకి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి రుస్తుంబాద ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్థికి రూ.13 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 


స్టీమర్‌రోడ్‌లో మధ్యస్థంగా నిలిచిన నర్సింగ్‌ కళాశాలను పరిశీలించి పనులు పూర్తికి రూ.1.50 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, జేసీ హిమాన్ష్‌ శుక్లా, సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు కవురు శ్రీనివాస్‌, యడ్ల తాతాజీ ఉన్నారు.

Updated Date - 2020-05-26T10:41:19+05:30 IST