సకల జనుల తెలంగాణకై మరో ‘మహాసంగ్రామం’

ABN , First Publish Date - 2022-08-02T06:03:44+05:30 IST

మహాసంగ్రామానికి మరోసారి సిద్ధంకండి. సకల జనులు, సబ్బండ వర్గాలు కలలుగన్న సుభిక్షమైన తెలంగాణ కోసం, నీళ్లు నిధులు నియమకాలతో విలసిల్లే ప్రజా తెలంగాణ కోసం...

సకల జనుల తెలంగాణకై మరో ‘మహాసంగ్రామం’

మహాసంగ్రామానికి మరోసారి సిద్ధంకండి. సకల జనులు, సబ్బండ వర్గాలు కలలుగన్న సుభిక్షమైన తెలంగాణ కోసం, నీళ్లు నిధులు నియమకాలతో విలసిల్లే ప్రజా తెలంగాణ కోసం, అవినీతి, నియంతృత్వాలతో పెచ్చుమీరుతున్న కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించటం కోసం సాగుతున్న ఈ ప్రజా సంగ్రామ పాదయాత్ర మూడో విడత ప్రారంభం కాబోతున్నది.


భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద మొదలైన మొదటి విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర 36 రోజులపాటు 438 కిలోమీటర్లు కొనసాగి హుస్నాబాద్‌లో విజయవంతంగా ముగిసింది. జోగులాంబ అమ్మవారి ఆలయంవద్ద ప్రారంభమైన రెండో విడత పాదయాత్ర 31 రోజుల పాటు 387 కిలోమీటర్లు కొనసాగి, విజయవంతంగా తుక్కుగూడకు చేరుకుంది. ఇప్పుడు మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రారంభమై, 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్లు కొనసాగి హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ముగిస్తుంది. ఈ మూడో విడత పాదయాత్రకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ చరిత్రతో ముడిపడిన ప్రదేశాలు, తెలంగాణ సంస్కృతినీ వారసత్వాన్నీ చాటి చెప్పే గ్రామాలు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరులు నడయాడిన నేలలపై నడుస్తూ ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది.


యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో స్వామి వారి ఆశీస్సులు తీసుకొని, రాష్ట్ర బీజేపీ రథసారథి బండి సంజయ్‌ కుమార్‌ పార్టీ శ్రేణులతో కలిసి మూడోవిడత ప్రజాసంగ్రామ పాదయాత్రకు స్వీకారం చుడుతున్నారు. అక్కడి నుంచి యాత్ర చాళుక్యుల వైభవానికి, తెలంగాణ చారిత్రక పోరాటాలకు సాక్ష్యంగా నిలిచిన భువనగిరి కోటకు చేరుకుంటుంది. తర్వాత చేనేత కళానైపుణ్యంతో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచం పటంలో నిలిపిన పోచంపల్లికి, అక్కడి నుంచి చిన్న కొండూరుకు చేరుకుంటుంది. మంత్రి పదవికి రాజీనామా చేసి మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన నిఖార్సయిన తెలంగాణవాది కొండా లక్ష్మణ్‌బాపూజీ శాసనసభకు ప్రాతినిథ్యం వహిం చింది ఈ చిన్నకొండూరు నుంచే. అక్కడి నుంచి తెలంగాణ గడ్డ మీద జలియన్‌ వాలాబాగ్‌ లాంటి ఉదంతానికి సాక్ష్యంగా నిలిచిన చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లికి చేరుకుంటుంది. ఇక్కడే రజ్వీ అనుచరుడైన సయ్యద్‌ మక్బూల్‌ గ్రూపు రజాకారులు 200 మంది అమాయకులను ఊచకోత కోసి మసీదు పక్కన బావిలో సమాధి చేశారు.  


తదనంతరం, మలిదశ ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతైన అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి స్వగ్రామం మోత్కూరు మండలంలోని పొడిచేడుకు చేరుకుంటుంది పాదయాత్ర. అక్కడి నుంచి తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ దొర అరచకాలకు ఎదురు తిరిగి పోరు సాగించిన ఇస్నూరు చేరుకుంటం. అక్కడి నుంచి జనగాం జిల్లాలోని పాలకుర్తి చేరుకొని, శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుంటాం. అక్కడి నుంచి గోల్కొండ కోటపై మొగలుల పెత్తనాన్ని ధిక్కరించిన బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ పుట్టిన స్థలం ఖిలాషాపూర్‌ పోతం. తర్వాత ఐనవోలు మల్లన్నను దర్శించుకుంటం. ఆ తర్వాత కాకతీయుల వారసత్వ సంపద వరంగల్లులో వేయిస్థంభాల గుడి మీదుగా వెళ్లి భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసినంక మూడో విడత పాదయాత్ర ముగుస్తది.


ఇట్లా మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 125 గ్రామాల మీదుగా ప్రజాసంగ్రామ పాదయాత్ర కొనసాగుతది. ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే ‘క్విట్‌ ఇండియా డే’, ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాలు జరుగుతయ్‌. 


ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల తర్వాత ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కలల్ని కల్లలు చేసింది. ఈ ఎనిమిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. మన పొలాలకు నీళ్లు రాలే. మన డబ్బా ఇండ్లు డబులు బెడ్రూం కాలే. మన ఊరికి నిధులు రాలే. మన రైతుల అప్పులు తీరలే. ఆస్పత్రికి పోతే ఖర్చుల కష్టాలు తగ్గలే. బడి ఫీజుల బాధలు తప్పలే. ఏ దిక్కు నుంచి చూసినా... తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. కొత్త రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికీ మేలు జరగలే. కేసీఆర్‌ పాలనలో జనం అరిగోసలు పడుతున్నరు. వారికి భరోసా ఇచ్చి వారి తరఫున కొట్లాడటానికి బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర సాగిస్తున్నది.


తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తమని దళితులను మోసం చేసిన్రు. బీసీలను విద్య పరంగా, అర్థికంగా దెబ్బ తీసిన్రు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమైంది. రైతులకు రుణమాఫీ లేదు, ఉచిత ఎరువుల హామీ అమలుకే నోచుకోలేదు. పైగా ‘వరేస్తే ఉరే’ అని భయపెట్టి పోయిన రబీలో ఎంతోమంది రైతులకు నష్టం చేశారు. నేటికీ చేనేతకు చేయూతే లేదు. గీతవృత్తిని లాభదాయకంగా మార్చి గౌడన్నలను ఆదుకోవటమన్న ఊసే లేదు.


నాలుగు లక్షల కోట్ల అప్పులను తెలంగాణ ప్రజల నెత్తి మీద బెట్టి, ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలియ్యలేని స్థితికి రాష్ట్రాన్ని దివాళా తీసిన్రు. వేల కోట్ల ప్రజాధనం పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఆ నీళ్లు ఎన్ని ఎకరాలకు పారుతున్నయో లెక్క చెప్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి! స్వయంగా సారుగారే ఇంజినీరులా వ్యవహరించిన ఫలితానికి, మొన్న కురిసిన వానలకు కోట్ల ఖరీదైన కాళేశ్వరం పంపుసెట్లు నీళ్ల పాలైనయ్‌. టీఆర్‌ఎస్‌ అనాలోచిత విధానాల వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ లోపాల వల్ల వేల ఎకరాల్లో పంటలు, వందల పల్లెలు ముగినిపోయినయ్‌. ఇగ, ఆ వరద బాధితలకు భరోసా ఇయ్యాల్సింది పోయి, విదేశీయులు కుట్రతో ‘క్లౌడ్‌ బరస్ట్‌’ చేయడమే వరదలకు కారణమని అర్థంలేని మాటలు చెప్తున్నారు. ఈ పాలకుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించి, సకల జనులు కలలు కన్న తెలంగాణను పునర్నిర్మించటానికి బీజేపీ ప్రజాసంగ్రామ పాదయాత్ర చేస్తున్నది.


ఈ యాత్ర ద్వారా జనం బాధలను స్వయంగా తెలుసుకొని, ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకొని, భరోసా కల్పిస్తం. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తెలంగాణకు అందిస్తున్న నిధులను గురించి ప్రజలకు వివరించి చైతన్యం తీసుకొస్తం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను దారి మళ్లిస్తూ, చివరికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ గులాబీ మూక చేస్తున్న దుష్ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తం. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాన్ని, మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతి సమైక్యత, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం.


తొలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన పార్టీగా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిల్లుకు సహకరించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీజేపీకి తెలంగాణ ఆకాంక్షలపై స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణ భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైన ప్రణాళికలున్నయ్‌. ఆగస్టు 2 నుంచి మొదలుకానున్న మూడోవిడత ప్రజా సంగ్రామ పాదయాత్రలో ‘ఈ దొర గడీల పాలనకు సెలవు పలికే రోజు దగ్గర పడ్డద’ని యావత్‌ తెలంగాణ ప్రజలకు భరోసానిస్తూ కాషాయదళం వారితో నడవబోతున్నది. 

డా. జి.మనోహర్‌రెడ్డి

బీజేపీ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షులు

Updated Date - 2022-08-02T06:03:44+05:30 IST