KBR పార్కులో మరో ఘటన.. భర్తతో కలిసి వాకింగ్ చేస్తున్న భార్యను..!

ABN , First Publish Date - 2022-03-13T15:06:56+05:30 IST

వాకింగ్‌ చేస్తున్న ఓ గృహిణిని వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి

KBR పార్కులో మరో ఘటన.. భర్తతో కలిసి వాకింగ్ చేస్తున్న భార్యను..!
FILE PHOTO

  • పార్కులో అసభ్య ప్రవర్తన
  • పోలీసులకు భర్త ఫిర్యాదు
  • సీసీ కెమెరాలు లేవన్న పోలీసులు


హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : వాకింగ్‌ చేస్తున్న ఓ గృహిణిని వెనుక నుంచి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పట్టుకున్నాడు. ఇదే విషయంపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తప్పించుకునే ధోరణితో వారు సమాధానం ఇచ్చారని ఆయన ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌, నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. ఓ వ్యాపారి రోజూ తన భార్యతో కలిసి బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వస్తాడు. రెండు రోజుల క్రితం కూడా వాకింగ్‌కు వచ్చాడు. మెడ్‌లీ ఎదురు వరకు రాగానే తెల్ల షర్ట్‌, నల్లటి ప్యాంట్‌, మాస్క్‌ పెట్టుకున్న ఓ వ్యక్తి అతడి భార్యను వెనుక నుంచి పట్టుకున్నాడు. అనంతరం వెళ్లి పోయాడు. ఇదే విషయాన్ని ఆయన బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, అక్కడి సిబ్బంది పార్కు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, నిందితుడిని ఎలా గుర్తించగలుగుతామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.


ఇదే విషయాన్ని సదరు వ్యాపారి ట్విటర్‌లో పోస్టు చేశాడు. నగరంలో సీసీ కెమెరాలు చూసి భద్రంగా ఉన్నామనే భరోసా ఉండేదని, కానీ, కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అలంకారప్రాయం మాత్రమేనని వాపోయారు. ‘నా భార్యకు ఏం కాలేదు.. దేవుడికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశాడు.  కేబీఆర్‌ పార్కులో గతంలో ఓ నటి మీద దాడి జరిగిన విషయం విదితమే. అప్పుడు కూడా పనిచేయని సీసీ కెమెరాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు వారం రోజుల తరువాత నిందితుడిని పట్టుకున్నారు. సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. కానీ, ఇప్పుడు మరోసారి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులే ఒప్పుకోవడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 

Updated Date - 2022-03-13T15:06:56+05:30 IST