ఫ్లాయిడ్‌పై దాడి తరహాలో చికాగోలో మరో ఘటన

ABN , First Publish Date - 2020-06-05T21:11:19+05:30 IST

ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా దేశం మొత్తం అట్టడుకుతున్నా..

ఫ్లాయిడ్‌పై దాడి తరహాలో చికాగోలో మరో ఘటన

చికాగో: ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా దేశం మొత్తం అట్టడికుతున్నా అమెరికా పోలీసుల తీరులో ఏ మాత్రం మార్పు రావడంలేదు. నిందితులు, అనుమానితుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా న్యూయార్క్‌లో పోలీసులు అమానుష కాండ వెలుగు చూసింది. కర్ఫ్యూ సమయంలో ఆందోళన చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు నెట్టేశారు. కిందపడిపోవడంతో  అతని తలకు బలమైన గాయమై రక్తం ధారలా కారింది. స్పృహ కోల్పోయిన ఆ వ్యక్తిని పట్టించుకోని పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు. రోడ్డుపై ఉన్నవారే అతనిని ఆస్పత్రికి తరలించారు.


ఇదిలా ఉండగా ఫ్లాయిడ్‌ హత్యోదంతాన్ని తలపించే మరో ఘటన చికాగోలో జరిగింది. కారులో వెళుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అడ్డగించారు. లాఠీలతో కారును పదే పదే బాది.. ఇద్దరు మహిళలను బయటకు ఈడ్చేశారు. తర్వాత కింద పడేసి కాళ్లతో తొక్కారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇద్దరు మహిళల్లో ఒకరు నిబంధనలు అతిక్రమించడంవల్లే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తర్వాత ప్రకటన చేశారు. అయితే పోలీసులు అంత అమానుషంగా ప్రవర్తించడం తీవ్ర విమర్ళలకు దారితీస్తోంది.


అలాగే న్యూయార్క్‌లో ఓ సైకిలిస్టును పోలీసులు చుట్టుముట్టి చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకొచ్చినందుకు పోలీసులు దాడి చేశారు.

Updated Date - 2020-06-05T21:11:19+05:30 IST