బిపిన్‌ రావత్‌ ప్రమాదం నేపథ్యంలో ప్రోటోకాల్స్‌ మార్పు

ABN , First Publish Date - 2022-01-10T07:19:13+05:30 IST

అత్యంత ముఖ్యమైన వ్యక్తులు (వీవీఐపీలు) ప్రయాణించే హెలికాప్టర్ల విషయంలో

బిపిన్‌ రావత్‌ ప్రమాదం నేపథ్యంలో ప్రోటోకాల్స్‌ మార్పు

  • ప్రయాణికుల సంఖ్య తగ్గింపు
  • వీవీఐపీ ప్రయాణాలపై ప్రోటోకాల్స్‌ మార్పు
  • త్రివిధ దళాల నిపుణుల కమిటీ సిఫార్సు 


న్యూఢిల్లీ, జనవరి 9: అత్యంత ముఖ్యమైన వ్యక్తులు (వీవీఐపీలు) ప్రయాణించే హెలికాప్టర్ల విషయంలో మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన నేపథ్యంలో కొన్ని కొత్త ప్రోటోకాల్స్‌ను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రతిపాదించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జనరల్‌ రావత్‌ హెలికాప్టర్‌ దుర్ఘటనపై కేంద్రం నియమించిన కమిటీ చేసిన  సిఫార్సుల ఆధారంగా ఈ మేరకు మార్పులు చేపట్టనున్నారు.


ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు గత బుధవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమైనప్పుడు కమిటీ సిఫార్సులను వివరించినట్టు తెలిసింది. వీటిని అనుసరించి... వీవీఐపీ హెలికాప్టర్‌లలో ప్రయాణించే వ్యక్తుల సంఖ్య (పేలోడ్‌)ను తగ్గించనున్నారు. జనరల్‌ రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఇద్దరు పైలట్‌లతో కలిపి మొత్తం 14 మంది ఉన్నారు. దీనివల్ల ఇంధనం కూడా ఎక్కువగా తీసుకెళ్లాల్సి వచ్చింది. హెలికాప్టర్‌ కూలడంతో ఫ్యూయల్‌ ట్యాంకు పేలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్యను తగ్గించాలని ఎయిర్‌ఫోర్స్‌ భావిస్తోంది.


అలాగే హెలికాప్టర్‌ ప్రయాణించే భౌగోళిక ప్రాంతాన్ని బట్టి విజువల్‌ కండిషన్స్‌కు సంబంధించిన ప్రమాణాలను నిర్ణయించనున్నారు. భూమి నుంచి హెలికాప్టర్‌ ప్రయాణిస్తున్న ఎత్తు, భౌగోళిక, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఈ ప్రమాణాలను నిర్ణయిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను సిద్ధంగా ఉంచుతారు. అదేవిధంగా... రోడ్డు మార్గానికి వీలైనంత దగ్గరగా ఉండే హెలికాప్టర్‌ ప్రయాణ మార్గాన్ని ఎంచుకుంటారు. దూరమైనా సరే ఇలాంటి మార్గంలోనే ప్రయాణిస్తారు. ఏదైనా అత్యవసర ల్యాండింగ్‌ అవసరమైతే ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఒకే ఇంజిన్‌తో నడిచే హెలికాప్టర్ల విషయంలో ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు.


ఇకనుంచి రెండు ఇంజిన్ల హెలికాప్టర్లకు కూడా దీన్ని వర్తింపచేస్తారు. ఇక.. వీవీఐపీ ప్రయాణించే హెలికాప్టర్‌ వెనుకే మరో హెలికాప్టర్‌ను పంపిస్తారు. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే సహాయక చర్యలు చేపట్టడం వీలవుతుంది. కమిటీ సిఫార్సులను సమీక్షించిన తర్వాత ప్రోటోకాల్‌ మార్పులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎయిర్‌ఫోర్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.


Updated Date - 2022-01-10T07:19:13+05:30 IST