కాంగ్రెస్‌లో కలకలం.. మూడురోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్!

ABN , First Publish Date - 2020-06-05T19:23:18+05:30 IST

గుజరాత్‌లో మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు...

కాంగ్రెస్‌లో కలకలం.. మూడురోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్!

అహ్మదాబాద్: గుజరాత్‌లో మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి రెండ్రోజుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పగా ఇవాళ అదే పార్టీకి చెందిన బ్రిజేష్ మేర్జా శాసనసభ సభ్యుత్వానికి రాజీనామా చేశారు.  స్పీకర్ రాజేంద్ర త్రివేది ఇప్పటికే మేర్జా రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం మేర్జా మోర్బీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. శాసనసభ సభ్యుత్వానికి రాజీనామా చేసే ముందు ఆయన కాంగ్రస్ పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి సైతం రాజీనామా చేశారు.


కాగా గత మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం గమనార్హం. అక్షయ్ పటేల్, జీతూ చౌదరి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు త్రివేది గురువారం వెల్లడించారు. కాగా మేర్జాతో కలిపి మార్చి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడం గమనార్హం. ఈ రాజీనామాల వెనుక బీజేపీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 81 స్థానాలు గెలుచుకోగా.. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Updated Date - 2020-06-05T19:23:18+05:30 IST