Abn logo
Mar 26 2020 @ 15:09PM

పాక్ ఆర్మీ మరో దారుణం... పీఓకేలోకి కోవిడ్-19 రోగుల బలవంతపు తరలింపు...

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైన్యం దురాగతాలు అందరికీ తెలిసినవే. ఆ సైన్యం ఎంత నీచంగా ఆలోచిస్తుందో చెప్పడానికి తాజాగా మరొక దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రపంచమంతా కోవిడ్-19 వైరస్‌తో అల్లాడుతున్న సమయంలో, ఆ వైరస్ పాజిటివ్ రోగులను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోకి, గిల్గిట్ బాల్టిస్థాన్‌లోకి తరలిస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ సైన్యం పట్టించుకోవడం లేదు. మరోవైపు పాక్ ఆక్రమణలో ఉన్న ఈ రెండు ప్రాంతాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే. సాధారణ రోగాలకు సైతం ఇక్కడ వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.


పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కోవిడ్-19 పాజిటివ్ రోగులను పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌లకు బలవంతంగా పాకిస్థాన్ సైన్యం తరలిస్తోందని పీఓకేలోని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. పీఓకేలోని మీర్‌పూర్‌, తదితర ప్రధాన నగరాల్లో స్పెషల్ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. పాకిస్థాన్ సైనిక స్థావరాలు, సైనిక కుటుంబాల నివాస ప్రాంతాలు ఉన్నచోట, వాటికి సమీపంలో కోవిడ్-19 పాజిటివ్ రోగులు ఉండటానికి వీల్లేదని సైనిక ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకే పంజాబ్ ప్రావిన్స్‌లోని కోవిడ్-19 పాజిటివ్ రోగులను బలవంతంగా తరలిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఈ వ్యాధిగ్రస్థులను తాళాలు వేసిన వాహనాల్లో పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌లలోని మీర్‌పూర్, ముజఫరాబాద్, తదితర నగరాలకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 


పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌ ప్రజలు ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ ప్రాంతంలో వైద్యపరమైన సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా లేరని, కోవిడ్-19 పాజిటివ్ రోగులను పాకిస్థాన్ నుంచి తమ ప్రాంతాలకు తరలించవద్దని కోరుతున్నారు. కోవిడ్-19 విస్తరించి, తమ ప్రాంతంలోని సహజసిద్ధ స్థానిక కశ్మీరీల జీవితాలను ప్రమాదంలోకి నెడుతుందని, ఈ ప్రాంతం మొత్తం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం కశ్మీరీలకు మరోసారి ద్రోహం చేస్తోందని మండిపడుతున్నారు.


ఇదిలావుండగా, పంజాబ్ ప్రావిన్స్‌తో పోల్చుకుంటే, పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌‌లకు పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రాధాన్యం లేదు. అందువల్ల పాకిస్థాన్ ఆర్మీ ఈ ప్రాంతాల ప్రజల నిరసనను పట్టించుకోవడం లేదు. 


Advertisement
Advertisement
Advertisement