కేంద్రం, రాష్ట్రం మధ్య మరో చిచ్చు

ABN , First Publish Date - 2022-07-17T09:21:25+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో యుద్ధం మొదలైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజకీయ చిచ్చు రాజుకుంది.

కేంద్రం, రాష్ట్రం మధ్య మరో చిచ్చు

  • ‘ఉపాధి’లో అవకతవకలపై కేంద్రం కన్ను
  • 16 బృందాలు.. 18 జిల్లాల్లో తనిఖీలు
  • రూల్స్‌కు విరుద్ధంగా పనులంటూ ఫిర్యాదు
  • ఆస్తుల కల్పనే చేశామంటున్న రాష్ట్రం
  • రెండురోజుల్నించి పరిశీలన..నేడు కూడా  
  • నిబంధనలకు విరుద్ధమైన పనులపై ఆరా
  • రైతు వేదికలు కట్టొద్దా అంటూ ప్రశ్నలు


హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో యుద్ధం మొదలైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజకీయ చిచ్చు రాజుకుంది. ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, అసలు ఆ పథకం నిబంధనలకే విరుద్ధమైన పనులు చేశారంటూ కేంద్ర ప్రభుత్వం తమ అధికారులతో రాష్ట్రంలో తనిఖీలు చేయిస్తోంది. ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఏకంగా 16 బృందాలను తెలంగాణకు పంపింది. వీరు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నారు. చాలా పనులు నిబంధనల ప్రకారం జరగలేదని, కొన్నిరకాల పనులు అసలు ఈ పథకం కింద చేయకూడనివి ఉన్నాయని తేల్చేస్తున్నారు. వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం, కేంద్రానికి లేఖ రాయడం వంటి ప్రక్రియలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ పథకంలో రైతు వేదికలు నిర్మిస్తే తప్పా? అని ప్రశ్నిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ తనిఖీలేంటని తప్పుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామీ పథకాన్ని ఆపినట్లుగా ఇక్కడ కూడా ఆపేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 


పలు అంశాల్లో అవకతవకలు..

వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా భారీ ఎత్తున నిధులు  వస్తున్నాయి. ఆ నిధులను పథకంలో నిర్దేశించిన పనులకే వాడాలి. అదే సమయంలో పనులు సక్రమంగా ఉండాలి. అయితే ఈ రెండు విషయాల్లోనూ తేడాలున్నాయని కేంద్రం భావిస్తోంది. రైతు వేదికలు, కల్లాల నిర్మాణానికి ఈ పథకం కింద అనుమతి లేదని చెబుతోంది. అయితే  రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించామని కొన్ని సందర్భాల్లో రాష్ట్ర నేతలు చె ప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం నరేగా కింద రైతు వేదికలు నిర్మిస్తే తప్పేంటని, ఆస్తుల కల్పనే చేశామని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం నుంచి తెలంగాణకు వచ్చింది తక్కువ అన్న వాదనను కూడా బలంగా తెరపైకి తెచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంపై యుద్ధం నడుస్తుండగా.. తాజాగా తలెత్తిన ఉపాధి హామీ పనుల వివాదం ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సి ఉంది. 


ఏటా రూ.4 వేల కోట్ల నిధులు..

నరేగా పథకం కింద ఏటా రాష్ట్రానికి రూ.4 వేల కోట్లకు పైగా నిధులొస్తాయి. 2021-22లో రూ.4,763 కోట్లు వచ్చాయి. 11 కోట్ల పనిదినాలు ఇప్పుడు సుమారుగా 15 కోట్ల పనిదినాలకు పెరిగాయి. వాస్తవానికి ఈ నిధుల అంశంపైనా కొంతకాలం నుంచీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వివాదం ఉంది. నరేగా నిధులను కేంద్రమే భారీగా ఇస్తోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను కూడా కేంద్రం ఇచ్చినంతగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఇస్తోందని ఆరోపిస్తోంది. పనుల్లో నాణ్యత కూడా లేదని, కొన్ని పనులను చేయకుండానే బిల్లులు ఎత్తుకుంటున్నారేమోననే సందేహాలనూ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం నుంచి కేంద్రమే నేరుగా ఉపాధి హామీ కూలీల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లోకి నిధులు వేయడం ప్రారంభించింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అన్ని రాష్ట్రాలతోపాటే తెలంగాణకూ ఇస్తున్నారని, తాము మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా దేశం కోసం కేంద్రానికి నిధులు ఇస్తున్నాని అంటున్నారు. మొత్తంమీద ఇన్నివేల కోట్లకు సంబంధించిన పథకం వల్ల వచ్చే ఓట్ల ప్రయోజనాన్ని ఎవరు పొందాలన్న విషయంలోనూ రాజకీయం మొదలైంది. అది క్రమంగా పెరిగి పెరిగి వివాదంగా మారింది. 


18జిల్లాల్లో పరిశీలన

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, చెరువుల పూడికతీత, కందకాలు, ఇతర నిర్మాణ పనులు చేపట్టిన విధానంపై కేంద్ర బృందాలు ఈ రెండురోజుల నుంచి ఆరా తీస్తున్నాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని నిజామాబాద్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్డిపేట, సూర్యాపేట, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, ములుగు తదితర జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించి ఈ బృందాలు క్షేత్రస్థాయి విచారణ జరుపుతున్నాయి. ఆదివారం కూడా ఈ బృందాలు తమ తనిఖీలను కొనసాగించనున్నాయి. కాగా జూన్‌ 9 నుంచి 12 వరకు కూడా ఐదు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా పనులు జరిగినట్లు గుర్తించాయి. ఉన్నత స్థాయి అనుమతులు పొందకుండానే  పనులు విభజించారని ఆక్షేపించాయి. దీంతోపాటు సోషల్‌ ఆడిట్‌, వివాదాల పరిష్కార వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా 18 జిల్లాల్లో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించడం దుమారం రేపుతోంది. 

Updated Date - 2022-07-17T09:21:25+05:30 IST