మరో నాలుగు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2020-08-06T06:33:51+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాష, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల

మరో నాలుగు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

కొత్తగా 1000 మంది వైద్య సిబ్బంది నియమాకం

కొవిడ్‌ పరీక్షల్లో 17 శాతం మందికి పాజిటివ్‌

ప్లాస్మా దానంతో ప్రాణదాతలు కండి

మంత్రులు అంజద్‌బాష, ఆళ్ల నాని


కడప (కలెక్టరేట్‌), ఆగస్టు 5 : జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాష, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో కొవిడ్‌-19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, వైద్యసేవలు, ఆహారం, మౌలిక సౌకర్యాలు తదితర అంశాలపై కలెక్టర్‌ హరికిరణ్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల వారిగా కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నాలుగు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 3100 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని, మరో నాలుగు కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోజుకు 4, 5 వేల వరకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, అందులో 17 శాతం మేర పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు.


ప్రస్తుతం 1080 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని, మరో 300 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు, వైద్య సిబ్బందిని దాదాపు 1000 మంది వరకు రిక్రూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ సర్వీసులు, ఇతర డయాలసిస్‌, ప్రసవాలు, ఇతర వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా వైద్యసేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవని వారు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్యెల్యేలు రవీంద్రనాథరెడ్డి, సుధీర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య,  జాయింట్‌ కలెక్టర్లు సాయికాంత్‌ వర్మ, గౌతమి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-06T06:33:51+05:30 IST