హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌

ABN , First Publish Date - 2020-08-11T19:28:09+05:30 IST

హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ట్రాఫిక్‌ కష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో మరో అడుగు పడింది. బైరామల్‌గూడ పైవంతెన అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్‌

ప్రారంభించిన కేటీఆర్‌, సబిత, బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ట్రాఫిక్‌ కష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో మరో అడుగు పడింది. బైరామల్‌గూడ పైవంతెన అందుబాటులోకి వచ్చింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించిన ఈ వంతెనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌లతో కలిసి సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఎస్‌ఆర్‌డీపీ మొదటి దశ ప్యాకేజీ-2లో భాగంగా బైరామల్‌గూడలో రూ.26.45 కోట్లతో కుడివైపు పైవంతెనను నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడ నిర్మాణంలో ఉన్న మరో వంతెన, పూర్తయిన ఫ్లై ఓవర్‌లతో ఏర్పాటు చేసిన ఫొటోల ప్రదర్శనను మంత్రులు తిలకించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. 


రూ.341.41 కోట్లు.. 14 నిర్మాణాలు..

ఎల్బీనగర్‌, పరిసర ప్రాంతాల్లోని జంక్షన్లలో మరో రెండు వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్యాకేజీ -2లో భాగంగా రూ.341. 41 కోట్లతో ఎనిమిది వంతెనలు, రెండు ర్యాంపులు (లూప్స్‌), నాలుగు అండర్‌పా్‌సలు నిర్మించాల్సి ఉంది. ఇందులో మూడు వంతెనలు, రెండు అండర్‌పా్‌సలు(ఎల్‌బీనగర్‌, చింతల్‌కుంట) అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్‌, బైరామల్‌గూడ, కామినేని చౌరస్తాల వద్ద కుడి, ఎడమ వైపు వంతెనలు మూడు లేన్ల చొప్పున వేర్వేరుగా నిర్మిస్తున్నారు. కామినేని వద్ద రెండు వైపులా వంతెనలు అందుబాటులోకి రాగా, ఎల్బీబీనగర్‌లో ఎడమ వైపు, బైరామల్‌గూడలో కుడి వైపు వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్‌ నుంచి ఒవైసీ ఆస్పత్రి వెళ్లే మార్గంలో బైరామల్‌గూడ పైవంతెన ట్రాఫిక్‌ కష్టాలను తగ్గిస్తుంది. ఎల్బీనగర్‌ కుడి వైపు వంతెన 38 శాతం, బైరామల్‌గూడ ఎడమ వైపు పైవంతెన పనులు 36 శాతం పూర్తయ్యాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. బైరామల్‌గూడలో రెండోదశ పైవంతెన పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇదే జంక్షన్‌లో కుడి, ఎడమ వైపు వంతెనలకు అనుసంధానంగా రెండు లూప్‌లు నిర్మిస్తున్నారు. కామినేని వద్ద అండర్‌పాస్‌ పనులు భూగర్భ పైపులు, కేబుళ్ల మార్పు అనంతరం మొదలు పెట్టనున్నారు. నాగోల్‌ జంక్షన్‌లో ఆరు లేన్ల వంతెన నిర్మాణ పనులు 25 శాతం పూర్తయ్యాయి. 

Updated Date - 2020-08-11T19:28:09+05:30 IST