GHMC లో మరో రాకెట్‌ గుట్టు రట్టు.. ఈసారి ఏకంగా..!

ABN , First Publish Date - 2022-03-22T18:17:37+05:30 IST

GHMC లో మరో రాకెట్‌ గుట్టు రట్టు.. ఈసారి ఏకంగా..!

GHMC లో మరో రాకెట్‌ గుట్టు రట్టు.. ఈసారి ఏకంగా..!

  • కొందరు ఏఎంఓహెచ్‌లు వసూల్‌ రాజాలు
  • ఏ పనికైనా పైసలివ్వాల్సిందే..
  • నకిలీ పత్రాలతో జనన, మరణ ధ్రువీకరణలు జారీ
  • ప్రధాన నిందితుడిపై గతంలోనూ ఆరోపణలు
  • మరి కొందరిదీ అదే తీరు

జీహెచ్‌ఎంసీలో బోగస్‌ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న మరో రాకెట్‌ గుట్టు బయటపడింది. దళారులతో కుమ్మక్కైన సంస్థలోని ఓ అధికారి, ఆపరేటర్‌ నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనూ సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జోన్లలో అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లు (ఏఎంఓహెచ్‌)లు ఇదే తరహా దందాలకు పాల్పడి అరెస్ట్‌ అయ్యారు. అయినా జీహెచ్‌ఎంసీలోని కొందరి తీరు మారలేదు.


హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీ హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగంలో అవినీతి పెచ్చుమీరుతోంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ మొదలు పారిశుధ్య కార్మికులు, సూపర్‌వైజర్ల నియామకం, హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరణ వరకు ఈ శాఖలో అంతా వసూళ్ల దందానే. వైద్యారోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన కొందరు ఏఎంఓహెచ్‌లు అన్నీ తామై అక్రమార్జనకు పాల్పడుతుండగా, వారికి జోనల్‌ కమిషనర్లు, కేంద్ర కార్యాలయంలోని కొందరు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.


- ఇటీవల సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని ఓ సర్కిల్‌కు బదిలీపై వచ్చిన ఏఎంఓహెచ్‌.. కార్మికుల నియామకానికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే రూ.50 వేలు, ఇతరులైతే రూ.లక్ష తీసుకుంటున్నట్టు సమాచారం.

- ముషీరాబాద్‌లో పనిచేసి మరో సర్కిల్‌కు వెళ్లిన ఏఎంఓహెచ్‌ కూడా కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నట్టు తెలిసింది. కొందరి వద్ద డబ్బులు తీసుకొని విధుల్లోకి తీసుకోకపోవడంతో బాధితులు ఆ అధికారి చుట్టూ తిరుగుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన కొందరికి డబ్బులు ఇచ్చేసిన ఆ ఏఎంఓహెచ్‌ ఇంకొందరిని ఇప్పటికీ తిప్పుకుంటున్నట్లు తెలిసింది. 

- అవినీతి ఆరోపణలతో రాష్ట్ర విజిలెన్స్‌, సంస్థలోని ఈవీడీఎం అధికారులు కొందరు ఏఎంఓహెచ్‌ల పాత్రపై విచారణ జరుపుతున్నారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నుంచి బయటపడ్టారు. ఒక అధికారి ఓ జిల్లా విభాగాధిపతిగా పని చేస్తుండడం గమనార్హం. మాతృ సంస్థకు వెళ్లేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో కొందరిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. 

- సింథటిక్‌ వేలి ముద్రలతో కార్మికులకు హాజరు వేసి వారి వేతనాలు కాజేసిన కేసులో కొందరు ఏఎంఓహెచ్‌ల పాత్ర ఉంది. క్షేత్రస్థాయిలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నా.. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్న అధికారులు అందుకు సూత్రధారులైన ఏఎంఓహెచ్‌ల జోలికి వెళ్లలేదు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేసి కేసును నీరుగార్చారు. వేలి ముద్రల వినియోగం సూత్రధారులుగా ఉన్న నలుగురు ఏఎంఓహెచ్‌లు.. గతంలో ఓ ఉన్నతాధికారికి భారీ మొత్తాన్ని ముట్టజెప్పడం వల్లే కేసును గాలికొదిలేశారని చెబుతున్నారు.


జీహెచ్‌ఎంసీలో బోగస్‌ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న మరో రాకెట్‌ గుట్టు బయటపడింది. దళారులతో కుమ్మక్కైన సంస్థలోని ఓ అధికారి, ఆపరేటర్‌ నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. గతంలోనూ సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జోన్లలో అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లు (ఏఎంఓహెచ్‌)లు ఇదే తరహా దందాలకు పాల్పడి అరెస్ట్‌ అయ్యారు. అయినా జీహెచ్‌ఎంసీలోని కొందరి తీరు మారలేదు.


అధికారి అవినీతి చిట్టా

మెహిదీపట్నంలో విధులు నిర్వర్తిస్తోన్న ఏఎంఓహెచ్‌ ఎజాజ్‌ ఖాసీం, తన వద్ద పనిచేసే ఆపరేటర్‌తో కలిసి ఫోర్జరీ, నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసిన 163 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆపరేటర్‌ ఆకుల సతీ్‌షను పోలీసులు అరెస్ట్‌ చేయగా ఎజాజ్‌ ఖాసీం పరారీలో ఉన్నారు. సర్టిఫికెట్‌కు రూ.1,300 వసూలు చేసినట్టు అరెస్టయిన వారు విచారణలో చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. ఎజాజ్‌ ఖాసీంపై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నాయి. దశాబ్దంన్నర క్రితం చెత్త రిక్షాల కొనుగోలులో జరిగిన అక్రమాల్లో భాగస్వామి అన్న ఫిర్యాదులు అందడంతో అతను విచారణ సమయంలో విదేశాలకు పారిపోయాడని సంస్థలోని ఉద్యోగులు చెబుతారు. రాజకీయ పలుకుబడితో అంతా సద్దుమణిగాక తిరిగి విధుల్లో చేరినట్టు తెలిసింది.


ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌, చార్మినార్‌, కార్వాన్‌ తదితర సర్కిళ్లలో ఆయన ఏఎంఓహెచ్‌గా విధులు నిర్వర్తించాడు. పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య బాధ్యతలు అప్పగించిన పలు సంస్థల నుంచి ఆయన పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడన్న ప్రచారం ఉంది. పారిశుధ్య కార్మికులు, సూపర్‌ వైజర్ల నియామకంలో రూ.కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. తన బంధువులు, స్నేహితులు ఎనిమిది మందిని సూపర్‌ వైజర్లుగా నియమించేందుకు రూ.10 లక్షలు ఎజాజ్‌ ఖాసీం తీసుకున్నాడని కేంద్ర కార్యాలయంలోని ఓ ఉద్యోగి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేయాలని గతంలో ఎజాజ్‌ ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. ఆయన అవినీతి సొమ్ముతో రాయదుర్గం దర్గాలో కొన్నాళ్ల క్రితం రూ.3 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసినట్టు సర్కిల్‌లోని సిబ్బంది చెబుతున్నారు. 


‘చెత్త’ పనులపై మక్కువతో..

హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరు డాక్టర్లు జీహెచ్‌ఎంసీలో పని చేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, ఉన్నతాధికారులతో సిఫారసులు చేయించుకొని మరీ బల్దియాలో పని చేసేందుకు డిప్యూటేషన్‌పై వస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ, ట్రేడ్‌ లైసెన్స్‌లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వీరి బాధ్యత. ఈ క్రమంలో అక్రమాలకు తెర తీస్తున్నారు.  

- చార్మినార్‌ జోన్‌ పరిధిలో ఓ ఏఎంఓహెచ్‌ కార్మికుల నియామకానికి సంబంధించి రూ. 2.50 కోట్లు జేబులో వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో సెలవుపై వెళ్లిన ఆయన.. ఇటీవల మరోసారి లీవును పొడిగించుకున్నారు.

- ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోనూ ఓ ఏఎంఓహెచ్‌ అక్రమాలకు పెట్టింది పేరు. ధ్రువపత్రాల జారీ నుంచి కార్మికుల నియామకం వరకు తాననుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. తీవ్ర ఆరోపణలు రావడంతో కుటుంబ సమస్యలను సాకుగా చూపి జీహెచ్‌ఎంసీ నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు మంత్రాంగం మొదలు పెట్టారు.

Updated Date - 2022-03-22T18:17:37+05:30 IST