Abn logo
Sep 19 2021 @ 02:48AM

‘మహా’లో మరో మార్పు!

  • బీజేపీ-శివసేన మళ్లీ పొత్తు?
  • కేంద్ర మంత్రి, బీజేపీ నేత దాన్వేను
  • ‘పాత మిత్రుడి’గా పేర్కొన్న సీఎం ఉద్ధవ్‌
  • ‘భవిష్యత్తులో సహోద్యోగి’ అని వ్యాఖ్య
  • మోదీవి సాహసోపేత నిర్ణయాలన్న సామ్నా


ఔరంగాబాద్‌/మహారాష్ట్ర, సెప్టెంబరు 18: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇలాంటి రాజకీయాలే చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు చేతులు కలిపి రాజకీయ ప్రయాణం సాగించిన బీజేపీ-శివసేనలు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడిపోయిన విషయం తెలిసిందే. దాంతో.. కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన జతకట్టి ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని శివసేన, మహారాష్ట్ర సర్కారును రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు రాజకీయం కుదురుతోందని, పాతమిత్రులు చేతులు కలుపుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.


పరిణామాలు ఇవే!

ఔరంగాబాద్‌లో శుక్రవారం జరిగిన జడ్పీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే, బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ దాన్వే ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే.. ‘‘ప్రస్తుతం ఇక్కడ నా మాజీ.. మేం చేతులు కలిపితే.. భవిష్యత్తులో సహోద్యోగి..’’ అంటూ దాన్వేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నిముషాల వ్యవధిలోనే వైరల్‌ అయి బీజేపీతో శివసేన పొత్తు పెట్టుకోబోతోందన్న ప్రచారం ప్రారంభమైంది. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సీఎం.. ‘‘దాన్వే నాకు పాత మిత్రుడు. సుదీర్ఘకాలం నుంచి తెలుసు’’ అని పేర్కొన్నారు. ‘‘నా ఉద్దేశం.. దాన్వే మాతో కలిసి వస్తే.. భవిష్యత్తులో కొలీగ్‌ అవుతారనే’’ అని చెప్పారు. అనంతరం దాన్వే మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలు.. మిత్రపక్షాలతో ఆయన పడుతున్న ఇబ్బందులు, ఒత్తిళ్లును స్పష్టం చేస్తున్నాయన్నారు. సేనతో బీజేపీ తిరిగి చేతులు కలిపేందుకు సిద్ధమేని.. రెండు పార్టీ సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు.


వీరి వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు మహావికాస్‌ అఘాడీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. కాగా, మాజీ సీఎం, శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్‌ స్పందిస్తూ.. సీఎం ఉద్ధవ్‌ వ్యాఖ్యలు.. మిత్ర పక్షాలతో ఆయన పడుతున్న ఆవేదనకు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. శివసేన మిత్రపక్షం ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ స్పందిస్తూ.. శివసేన-బీజేపీల మళ్లీ పొత్తు ఉత్తమాటేనని కొట్టిపారేశారు. బీజేపీని వదిలిపెట్టాలని అనుకుంటున్న నేతల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న దాన్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోందని.. ఈ క్రమంలోనే ఒకవేళ బీజేపీ నుంచి ఆయన బయటకు వస్తే సేనలో చేరాలనే ఉద్దేశంతోనే.. ఉద్ధవ్‌ అలా వ్యాఖ్యానించి ఉంటారన్నారు.


బీజేపీ హెచ్చరికలు

బీజేపీ సీనియర్‌ నేత కిరీట్‌ సోమయ్య మీడియాతో మాట్లాడుతూ.. మరో ఇద్దరు మంత్రుల అవినీతిని త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. ఈ ఇద్దరు మంత్రుల్లో ఒకరు శివసేనకు చెందిన నాయకుడని, మరొకరు ఎన్సీపీ నాయకుడని తెలిపారు.


మోదీపై ‘సామ్నా’ ప్రశంసలు

శివసేన అధికార పత్రిక సామ్నాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ప్రశంసిస్తూ.. పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ రాసిన వ్యాసం.. సంచలనంగా మారింది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ.. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని రౌత్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలిన దరిమిలా.. ప్రధాని విప్లవాత్మక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌ను గుజరాత్‌ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని పేర్కొన్నారు. బీజేపీ నిజమైన నాయకుడు మోదీయేనని.. మిగిలిన వారు డమ్మీలేనని రౌత్‌ అభిప్రాయపడ్డారు.