దంపతులకు మరో చాన్స్‌

ABN , First Publish Date - 2021-12-23T16:56:44+05:30 IST

దంపతులకు..

దంపతులకు మరో చాన్స్‌

ఉద్యోగుల విభజనలో ఎట్టకేలకు అంగీకరించిన ప్రభుత్వం

కోరుకున్న ప్రాంతాలకు బదిలీకి ఓకే.. 

దరఖాస్తు చేసుకోవాలని సూచన

ఉద్యోగ సంఘాల నేతలకూ అవకాశం..

మార్గదర్శకాలు జారీ


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల విభజనకు సంబంధించి భార్యాభర్తల (స్పౌజ్‌) కేసులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత కేటాయించిన జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల్లో జాయిన్‌ అయ్యాక... స్పౌజ్‌ కేసుల కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే, ఉద్యోగ సంఘాలకు చెందిన ఆఫీస్‌ బేరర్లకూ అవకాశం ఇచ్చింది. వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ బుధవారం వేర్వేరుగా అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో జూనియర్లకు సొంత జిల్లాలు దక్కడం లేదని, స్థానికులైనప్పటికీ ఇతర జిల్లాల్లో పని చేయాల్సి వస్తుందని.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో కనీసం స్పౌజ్‌ కేసులను, ఆఫీస్‌ బేరర్లను పరిగణనలోకి తీసుకోవాలని టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌ తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి కోరారు. టీచర్లలో స్పౌజ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకోవాలని యూటీఎఫ్‌-టీఎస్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి పాఠశాల విద్యా డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈమేరకు స్పందించిన ప్రభుత్వం ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగులందరికీ ఈ అవకాశం కల్పించింది. 


జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన

తొమ్మిది జిల్లాల్లోని జోనల్‌, మల్టీ జోనల్‌ ఉద్యోగుల విభజన బుధవారం సైతం కొనసాగింది. బీఆర్కే భవన్‌లోని 10వ అంతస్తులో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఉద్యోగుల విభజన చేపట్టారు.  గురువారం సాయంత్రం లేదా శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వివరిస్తున్నారు. కాగా... జిల్లా కేడర్‌కు చెందిన విభజన పూర్తి కావడంతో కొందరు ఉద్యోగులు ఆయా జిల్లాల అధికారులకు రిపోర్టు చేస్తున్నారు.


ఇవీ మార్గదర్శకాలు

- ఉద్యోగులు విభజన కేటాయింపు ఉత్తర్వులు అందుకోగానే... తమకు కేటాయించిన జిల్లా, జోన్‌, మల్టీ జోన్‌లో జాయిన్‌ కావాలి. 

ఆ తర్వాత స్పౌజ్‌ కేసులు, ఆయా సంఘాల ఆఫీస్‌ బేరర్ల ఆప్షన్ల కింద నిర్దేశిత ప్రొఫార్మా ద్వారా ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల్లోని ఉద్యోగులు తమ విభాగాధిపతికి దరఖాస్తు చేసుకోవాలి.

- జిల్లా అధికారులు, విభాగాధిపతులు ఆ దరఖాస్తులను అవసరమైన సిఫార్సులతో తమ శాఖల ముఖ్యకార్యదర్శులకు పంపించాలి.

ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు/ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఈ దరఖాస్తులను పరిశీలించి.. పరిష్కరించాలి.

Updated Date - 2021-12-23T16:56:44+05:30 IST