మరో కబ్జా!

ABN , First Publish Date - 2022-07-04T04:32:09+05:30 IST

మరో కబ్జా!

మరో కబ్జా!
కోసంగిపురం జంక్షన్‌ వద్ద ఆక్రమార్కుల చేతిలో చిక్కిన ప్రభుత్వ భూమి రియల్‌ ఎస్టేట్‌గా మారుతున్న దృశ్యం

- రూ.5కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు

- చదును చేసి విక్రయానికి వైసీపీ నేతల యత్నం

- పట్టించుకోని రెవెన్యూ అధికారులు

- జంట పట్టణాల్లో పెరుగుతున్న భూ ఆక్రమణలు

(పలాస)

 పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో భూ ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూమి కనబడితే చాలు.. రికార్డులు తారుమారు చేసి సొంతం చేసుకుంటున్నారు. కోట్లాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కోసంగిపురం జంక్షన్‌లో మరో కబ్జా వెలుగుచూసింది. సర్వే నంబరు 292లో మొత్తం 11.50 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఇందులో 8 ఎకరాలను గతంలో పలాస-కాశీబుగ్గ మునిసిపాల్టీ డంపింగ్‌ యార్డుకు కేటాయించారు. 3.50 ఎకరాల మిగులు భూమి ఉంది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తప్ప మరొకరికి తెలియదు. అటువంటిది ఇద్దరు వైసీపీ నాయకులు ఈ భూమిపై కన్నేయడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.5 కోట్లు పైమాటే. ఎకరా విస్తీర్ణంలో మొక్కలు, మట్టి తొలగించి భూమికి సమానంగా చదును చేసి ప్రస్తుతం రాళ్లను పాతుతున్నారు. రంగులు వేసి ఆ భూమిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ స్థలాలను ఎవరికీ కేటాయించకుండా ప్రభుత్వ అవసరాలకు వినియోగించేందుకు మిగులు భూమిగా ఉంచారు. అయితే దీనిపై పట్టాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా భూమిని చదును చేస్తున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే పెట్రోల్‌ బంకు నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ , జేసీ చక్రధర్‌బాబులు భూమిపూజ సైతం పూర్తిచేశారు. కానీ అప్పట్లో కొందరు రైతులు అవి తమ భూములంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో బంకు నిర్మాణం నిలిచిపోయింది. అయితే అప్పటికే డంపింగ్‌ యార్డుకు కేటాయించగా.. మిగతా భూమి ఉన్నా అధికారులు కేటాయించలేదు. అప్పట్లో ఉన్న 3.50 ఎకరాల్లో.. ఎకరా కేటాయించి ఉన్నా పెట్రోల్‌ బంకు నిర్మాణం పూర్తయ్యేది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. స్థానికులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేవి. కానీ అధికారులు ఎందుకో భూముల విషయంలో గోప్యత పాటించారు. ఇప్పుడే అవే భూములను అధికార పార్టీ నేతలు కొల్లగొడుతున్నా అధికారులకు మిన్నకుండా ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని జంట పట్టణ వాసులు కోరుతున్నారు. 


దృష్టిసారిస్తాం

సర్వే నంబరు 292లో ప్రభుత్వ భూమి ఉంది.  ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. తక్షణం ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఆరాతీస్తాం. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ప్రజా అవసరాలకు ఆ భూమిని వినియోగిస్తాం. 

-మధుసూదనరావు, తహసీల్దారు

Updated Date - 2022-07-04T04:32:09+05:30 IST