అంగన్‌వాడీలపై మరో ఆదనపు భారం

ABN , First Publish Date - 2020-11-01T07:00:49+05:30 IST

మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లపై మరో అదనపు భారం పడింది.

అంగన్‌వాడీలపై మరో ఆదనపు భారం

‘సుకన్య సమృద్ధి యోజన’లో తల్లిదండ్రులను చేర్పించాలని ఆదేశాలు

ఒక్కో కార్యకర్తకు పది చందాల లక్ష్యం

ఎక్కడా లేనివిధంగా వ్యవహరిస్తున్న ఖమ్మం ఐసీడీఎస్‌


ఖమ్మం, ఖానాపురంహవేలి, అక్టోబరు 31: మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో  పనిచేసే టీచర్లపై మరో అదనపు భారం పడింది. కేంద్ర ప్రభుత్వం, పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సుకన్య సమృద్ధి యోజనం పథకం’లో పదేళ్లలోపు ఆడపిల్లల తల్లిదండ్రులను చందాదారులగా చేర్పించాలని ఆదేశాలు  జారీచేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఖమ్మం జిల్లాలోనే ఐసీడీఎస్‌ అధికారులు ఈ నిబంధన విధించడం పట్ల అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 1,605 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 232 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు అందరూ ఒక్కొక్కరు పది మందికి తక్కువ కాకుండా చందాదారులను సుకన్య సమృద్ధి యోజన పథకంలో  చేర్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. నవంబరు ఐదో తేదీకల్లా లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పడం పట్ల పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


ప్రస్తుతం కొవిడ్‌ 19 కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేస్తున్నారు. కానీ జిల్లా మహిళ శిశుసంక్షేమమశాఖ అధికారులు ఇవేమీ పట్టనట్టు అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సుకన్య సమృద్దియోజన పథకంలో తల్లిదండ్రులను చేర్పించాలని చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  బలవంతంగా అంగన్‌వాడీ లబ్ధిదారులను పథకంలో చేర్పించలేమని పలువురు అంగన్‌వాడీ కార్యర్తలు చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2020-11-01T07:00:49+05:30 IST