డీసీసీబీకి మరో అవార్డు

ABN , First Publish Date - 2022-05-20T05:41:30+05:30 IST

ఉమ్మడి జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌(డీసీసీబీ)కి మరో అవార్డు దక్కింది. స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.

డీసీసీబీకి మరో అవార్డు
హైదరాబాద్‌లో డీసీసీబీ చైర్మన్‌కుఅవార్డును అందజేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వరుసగా నాలుగు అవార్డులు 

10310 ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు  రూ.325.49 కోట్ల రుణాలు

డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి


సంగారెడ్డి టౌన్‌,  మే 19: ఉమ్మడి జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌(డీసీసీబీ)కి మరో అవార్డు దక్కింది. స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అవార్డును, ప్రశంసాపత్రాన్ని డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డికి బుధవారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలోని డీసీసీబీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాలు, రైతులతోపాటు ఖాతాదారులకు డీసీసీబీ ఇతర బ్యాంక్‌లకు దీటుగా సేవలందిస్తున్నాదన్నారు. 2019-20 నుంచి ఇప్పటి వరకు బ్యాంక్‌కు నాలుగు అవార్డులు దక్కాయని, ఈ అవార్డులే తమ పనితనానికి నిదర్వనమన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10,310 స్వయం సహాయక సంఘాలకు రూ.325.49 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. 2019-20లో రాష్ట్రంలో ఉత్తమ బ్యాంకుగా అవార్డు పొందామన్నారు. 2020-21లో జాతీయ స్థాయిలో ఉత్తమ బ్యాంకుగా, 2021-22లో జాతీయ స్థాయిలో ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా తనకు అవార్డు లభించిందన్నారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులలో ఉన్న సభ్యులు సమష్టిగా వ్యాపారాల కోసం ముందుకు వస్తే  ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.20లక్షల వరకు రుణాలు ఇవ్వాలని డీసీసీబీ పాలకమండలి తీర్మానించిందన్నారు. అలాగే బ్యాంక్‌ లింకేజీ కింద ఒక్కో గ్రూపునకు రూ.12 లక్షలు ఇవ్వనున్నామన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌ చిట్టిదేవేందర్‌రెడ్డిని, వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యంను, సీఈవో శ్రీనివా్‌సలను బ్యాంకు ఉద్యోగులు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో మేనేజర్‌ ఎల్‌.సంగమేశ్వర్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పవన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T05:41:30+05:30 IST