24 గంటలు కూడా గడవకముందే.. బెంగళూరులో మరో అమూల్య!

ABN , First Publish Date - 2020-02-22T01:11:58+05:30 IST

పౌరసత్వ సవరణచట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నగరంలో గురువారం నిర్వహించిన

24 గంటలు కూడా గడవకముందే.. బెంగళూరులో మరో అమూల్య!

బెంగళూరు: పౌరసత్వ సవరణచట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నగరంలో గురువారం నిర్వహించిన ర్యాలీలో అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసి కలకలం రేపింది. దీంతో వేదికపై ఉన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కార్యక్రమ నిర్వాహకులు విస్తుపోయారు. ఆమె నుంచి మైక్ లాక్కుని వేదిక నుంచి బలవంతంగా కిందికి పంపారు. ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే నగరానికే చెందిన మరో మహిళ శుక్రవారం కశ్మీర్‌కు విముక్తి కావాలంటూ ప్లకార్డు ప్రదర్శించి డిమాండ్ చేసింది. 


నగరంలోని టౌన్‌హాల్‌లో వివిధ కన్నడ సంఘాలు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించాయి. ఇందులో పాల్గొన్న ఆరుద్ర అనే యువతి కశ్మీర్‌కు విముక్తి కావాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ‘‘ముస్లింలు, దళితులు, కశ్మీర్, బహుజన్, ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్లకు విముక్తి కావాలి’’ అని ప్లకార్డుపై రాసి ప్రదర్శించింది.


వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని సంపంగిరామనగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించిన అమ్యూలకు ఆరుద్ర ఫేస్‌బుక్ ఫ్రెండ్ అని పోలీసులు తెలిపారు. తాను మల్లేశ్వరం కాలేజీ విద్యార్థినని ఆరుద్ర చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-02-22T01:11:58+05:30 IST