వదలని మహమ్మారి

ABN , First Publish Date - 2020-07-09T09:57:13+05:30 IST

మహమ్మారి వైరస్‌ అనంతను వదలట్లేదు. బుధవారం జిల్లాలో మరో 87 మంది కరోనా బారిన పడ్డారు. ఈ లెక్కన జిల్లాలో కరోనా బాధితుల

వదలని మహమ్మారి

మరో 87 మందికి కరోనా

2568కి చేరిన బాధితులు

ఇద్దరి మృతి.. 18కి పెరిగిన మరణాలు..

శాంపిళ్ల సేకరణపై అదే అస్తవ్యస్తం

జిల్లావ్యాప్తంగా అనుమానితుల పడిగాపులు


అనంతపురం వైద్యం, జూలై 8: మహమ్మారి వైరస్‌ అనంతను వదలట్లేదు. బుధవారం జిల్లాలో మరో 87 మంది కరోనా బారిన పడ్డారు. ఈ లెక్కన జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 2568కి చేరింది. ఇద్దరు కరోనాతో ప్రాణాలొదిలారు. దీంతో జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 18కి చేరింది. 1517 మంది కోలుకున్నారు. ఇంకా వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల్లో 1033 మంది చికిత్స పొందుతున్నారు.


కరోనా నుంచి కోలుకున్న 95 మంది

కరోనా నుంచి బుధవారం 95 మంది కోలుకుని, డిశ్చార్జ్‌ అయినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు. వారిని స్వస్థలాలకు పంపామన్నారు. కరోనా అనుమానితుల నుంచి శాంపిళ్ల సేకరణ విషయంలో జిల్లా యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో అనుమానితులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో అనేక మంది కరోనా పరీక్షలకు శాంపిల్‌ ఇచ్చేందుకు వచ్చినవారు.. అధికారుల తీరుతో వెనుదిరగాల్సి వచ్చింది. శాంపిల్స్‌ ఎక్కడ, ఎప్పుడు తీస్తారన్న వివరాలు కూడా అధికారులు చెప్పకపోవటం విమర్శలకు దారితీస్తోంది. నూతనంగా నమోదైన 87 కరోనా కేసుల్లో జిల్లా కేంద్రంలోనే మరోసారి అధికంగా వెలుగుచూశాయి.


కళ్యాణదుర్గం ప్రాంతంలో ఆరుగురికి..

నియోజకవర్గ పరిధిలో తాజాగా ఆరుగురు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి, మేడా వీధిలో ఓ అటెండర్‌కు, మరో బంగారు దుకాణం వ్యాపారికి కరోనా సోకినట్లు కమిషనర్‌ వెంకటరాముడు తెలిపారు.



Updated Date - 2020-07-09T09:57:13+05:30 IST