ఏపీకి చెందిన ఇంకా 618 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే..!

ABN , First Publish Date - 2022-03-02T13:38:59+05:30 IST

ఉక్రెయిన్‌లో ఇంకా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 618 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలింది. వీరిలో 248 మంది విద్యార్థినులు, 370 మంది విద్యార్థులు ఉన్నారు.

ఏపీకి చెందిన ఇంకా 618 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే..!

విదేశాంగ శాఖ నిర్ధారణ... వీరిలో విశాఖ వారే 95 మంది

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్‌లో ఇంకా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 618 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలింది. వీరిలో 248 మంది విద్యార్థినులు, 370 మంది విద్యార్థులు ఉన్నారు. విదేశాంగ శాఖ పలు మార్గాల ద్వారా ఈ వివరాలు సేకరించింది. ఆయా విద్యార్థుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, వారి చిరునామాలు, అక్కడ ఏయే విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు.. ఏయే నగరాల్లో ఉన్నారనే పూర్తి వివరాలు తెలిశాయి. అంతేకాదు.. వారందరినీ భారత్‌కు తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. తొలి విడతలో 301 మంది రాష్ట్ర విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి రైలులో ఉజ్‌గొరోద్‌కు.. అక్కడి నుంచి స్లొవేకియా బోర్డర్‌కు తీసుకురానున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి పంపుతారు. రాష్ట్రం నుంచి ఉక్రెయిన్‌ వెళ్లిన విద్యార్థుల్లో అన్ని జిల్లాలవారూ ఉన్నారు. వీరిలో విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 95 మంది, కృష్ణా-90, తూర్పు గోదావరి-70, గుంటూరు-57, పశ్చిమ గోదావరి-47, ప్రకాశం-35, చిత్తూరు జిల్లాకు చెందినవారు 33 మంది ఉన్నారని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ కూడా ఈ విద్యార్థులు, వారి బంధువులతో మాట్లాడి స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది. వారంతా స్వదేశానికి వచ్చాక స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యుడు బాబు.ఎ తెలిపారు.


స్వస్థలాలకు చేరుకున్న కడప వైద్య విద్యార్థులు

శంషాబాద్‌ రూరల్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కపడ జిల్లాకు చెందిన గౌతమి, మదనపల్లెకు చెందిన ఎస్‌.హర్షిత, వాల్మీకిపురానికి చెందిన జయశ్రీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కపడ రెవెన్యూ అధికారులు, వారి తల్లిదండ్రులు వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారులో వారిని స్వస్థలాలకు పంపించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-02T13:38:59+05:30 IST