మరో 30 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-07T09:26:28+05:30 IST

తెలంగాణలో సోమవారం మరో 30 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య

మరో 30 కరోనా కేసులు

  • 364 కు చేరిన బాధితుల సంఖ్య... 
  • నమాజ్‌కు వెళ్లిన కానిస్టేబుల్‌కు పాజిటివ్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సోమవారం మరో 30 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ మర్కజ్‌తో సంబంధం ఉన్నవేనని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ల సంఖ్య 364కు చేరింది. నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికం(133) హైదరాబాద్‌లోనే ఉన్నాయి. నిజామాబాద్‌లో 26 కేసులు, మేడ్చల్‌లో 15, వరంగల్‌ అర్బన్‌లో 23, గద్వాలలో 13 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10, భద్రాద్రిలో 2, జగిత్యాలలో 3, జనగాంలో 2, భూపాలపల్లి 1, కామారెడ్డి 8, కరీంనగర్‌ 7, మహబూబాబాద్‌ 1, మహబూబ్‌నగర్‌ 6, మెదక్‌ 5, ములుగులో 2, నాగర్‌ కర్నూల్‌ 2, నల్గొండ 13, నిర్మల్‌ 4, పెద్దపల్లి 2, రంగారెడ్డి 10, సంగారెడ్డి 7, సిద్దిపేట 1, సూర్యాపేట 8, వికారాబాద్‌ జిల్లాలో 4 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ 308 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో సోమవారం తాజాగా ఒక కేసు నమోదైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మాత్రం ఆ విషయాన్ని వెల్లడించలేదు. ఇక సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 12 మందిని  డిశ్చార్జ్‌ చేశారు. దీంతో ఇప్పటి దాకా రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 45కు చేరింది. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 11 మంది మరణించారు.


  • హైదరాబాద్‌లో ఒక కుటుంబంలోని వ్యక్తి ఐదుగురితో కలిసి మర్కజ్‌కు వెళ్లొచ్చారు. బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. అకస్మాత్తుగా శనివారం అనారోగ్యం పాలయ్యారు. పరీక్షించగా పాజిటివ్‌ వచ్చింది. విచారించగా, మర్కజ్‌కు వెళ్లాడనే విషయం తెలిసింది. అందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. ఆ కుటుంబం నివసిస్తున్న ప్రాంగణంలో మరో 40 మంది ని కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. 
  • ఒకే కుటుంబంలో 15 మందికి వైరస్‌ సోకింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ వృద్ధ మహిళ(68) అనారోగ్యం కారణంగా గత నెల 30న ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. కుటుంబీకులను పరీక్షించగా మొత్తం 15మందికి పాజిటివ్‌ ఉన్నట్లు గుర్తించారు. 
  • మణికొండ మున్సిపాలిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఆయన విదేశాలకు కానీ, ఢిల్లీకి గానీ వెళ్లిన చరిత్ర లేదు. అలాంటి వారిని కలవలేదు. ఈ ప్రాంతంలో ఇప్పటికే రెండు కేసులు పాజిటివ్‌ ఉండడంతో వారితో కలవడం గానీ, సూపర్‌ మార్కెట్‌లో తిరగడం గానీ చేసి ఉంటాడని, బహుశా కరోనా పాజిటివ్‌ వారు సూపర్‌ మార్కెట్‌ను సందర్శించిన తరువాత ఇతను సందర్శించి ఉంటాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో మర్కజ్‌ మసీదుకు వెళ్లి వచ్చిన 150 మంది వివరాలు ఇంకా అందలేదు. వారి కోసం విస్తృత అన్వేషణ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి 14 రోజులు గడిచిపోతున్నాయి. ఇప్పటికే వారిలో లక్షణాలు రావడం, అస్వస్థత గురి కావడం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా కాలనీల పెద్ద మనుషులతో చర్చిస్తున్నారు.
  • సైదాబాద్‌ పరిధిలోని హెడ్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయనతోపాటు కలిసి పని చేసిన 12 మంది సిబ్బంది, ఆయన కుటుంబ సభ్యులు పది మందిని క్వారంటైన్‌కు పంపారు. హెడ్‌ కానిస్టేబుల్‌కు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేదు. మసీదులో ప్రార్థనలకు వెళ్లినపుడు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. 
  • రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. మంత్రి సబిత, కలెక్టర్‌, ఇతర అధికారులు మున్సిపాలిటీలో పర్యటించారు. 280 మంది వైద్య బృందాలతో ఇంటింటి పరిశీలన చేస్తున్నారు. స్ర్పేయర్లు, ఫైరింజన్ల ద్వారా సోడి యంహైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. 
  • గద్వాల జిల్లాలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం 10 కేసులయ్యాయి. అన్నీ మర్కజ్‌తో లింకులు ఉన్నవే. ఒకరు మృతి చెందారు. మృతుడి కుమారుడు, కోడలుకు, మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీకి తరలించారు. అయిజకు చెందిన 14 మందిని వడ్డేపల్లి క్వారంటైన్‌ కేంద్రంలో చేర్చారు. వారిలో నలుగురికి సోమవారం పాజిటివ్‌ తేలింది. 
  • నిర్మల్‌ జిల్లాలో ముగ్గురికి పాజిటివ్‌ తేలింది. 131 మంది శాంపిల్స్‌ పరీక్షించగా, నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరికుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బర్మా నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చిన రోహింగ్యాలు 17 మందిని వైద్య పరీక్షలకు పంపగా, అందులో ఇద్దరికి సోమవారం రెండు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇంకా ఇద్దరి నమూనాల రిపోర్టు రావాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటలో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
  • నిజామాబాద్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు 29కి చేరాయి. 176 మంది శాంపిల్స్‌ తీయగా, 29 కరోనా పాజిటివ్‌గా తేలాయి. సోమవారం ఒక్కరోజే పది కేసులు నమోదయ్యాయి. వారిలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. 
  • కరీంనగర్‌ జిల్లాలో మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. హుజూరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లిన వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా అతని  సోదరుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని అధికారులు సోమవారం ధ్రువీకరించారు. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 18 మందికి కరోనా సోకగా అందులో ఇప్పటికే 11 మంది గాంధీలో చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన ఏడుగురు చికిత్స పొందుతున్నారు.


ఖమ్మం జిల్లాలో తొలికేసు 

ఖమ్మం జిల్లాలో తొలికేసు నమోదైంది. గిరిజన సంఘం నాయకుడొకరు మార్చి 14న ఢిల్లీ వెళ్లారు. 17న ఢిల్లీలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అదే రైల్లో మర్కజ్‌ సభలకు వెళ్లిన 12 మంది తిరిగి వస్తున్నారు. గిరిజన నాయకుడు కాజీపేటలో రైలు దిగి, మరోరైల్లో 18న ఖమ్మంలో ఇల్లు చేరుకున్నారు. తెలంగాణ ఎక్స్‌ప్రె్‌సలో పక్కనే కూర్చొని ప్రయాణం చేసిన మహబూబాబాద్‌ వాసికి కరోనా వచ్చిందని తెలుసుకొని, అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. వైద్య అధికారులు ఆయన్ను 2న ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఐదున కరోనా పరీక్ష చేశారు. పాజిటివ్‌ అని తేలింది. అతన్ని నేరుగా కలిసి మాట్లాడిన 45 మంది బంధు మిత్రులను క్వారంటైన్‌కు తరలించే కార్యక్రమం ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మరోవ్యక్తికి కరోనా వచ్చింది. ఐదు నెలలుగా ఆయన హైదరాబాద్‌లో ఉంటూ వివిధ రాష్ట్రాల్లో మత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Updated Date - 2020-04-07T09:26:28+05:30 IST