మరో 19 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-07T08:04:59+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 17 మందికి పాజిటివ్‌ రాగా...శనివారం మరో 19 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

మరో 19 మందికి పాజిటివ్‌

కూర్మన్నపాలెంలో ఐదుగురికి, దువ్వాడలో ముగ్గురికి...

అనకాపల్లిలో మరో ఇద్దరికి సోకిన వైరస్‌..పట్టణంలో 21కి చేరిన బాధితుల సంఖ్య

దేశ, విదేశాల నుంచి వచ్చిన మరో ఎనిమిది మందికి కరోనా

జిల్లాలో 164కు చేరిన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య

కూర్మన్నపాలెంలో మరో ఐదుగురికి అనుమానిత లక్షణాలు

జిల్లాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌


విశాఖపట్నం/కూర్మన్నపాలెం/ మల్కాపురం/కొమ్మాది/అగనంపూడి/ నక్కపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం 17 మందికి పాజిటివ్‌ రాగా...శనివారం మరో 19 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 164కు చేరింది. శనివారం వైరస్‌ బారినపడిన వారిలో నగర పరిధిలోని కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన ఐదుగురు, దువ్వాడకు చెందిన ముగ్గురు, అనకాపల్లికి చెందిన ఇద్దరు, నక్కపల్లి, సబ్బవరం, కొమ్మాది, మల్కాపురం, గాజువాక, పెదముషిడివాడ, అగనంపూడి, శ్రీహరిపురం, సాగర్‌నగర్‌ ప్రాంతాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.


కూర్మన్నపాలెంలో ఐదుగురికి...

గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో శనివారం ఒక్కరోజే ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మరో ఆరుగురిలో లక్షణాలున్నట్టు గుర్తించిన అధికారులు పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. వైరస్‌ సోకినట్టు శనివారం నిర్ధారణ అయిన వారిలో కూర్మన్నపాలెం సమీపం లోని అశోక్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు...28 ఏళ్ల వ్యక్తితోపాటు బాలుడు (9),బాలిక (5) ఉన్నారు. అదేవిధంగా శాతవాహన నగర్‌లో నివాసం వుంటున్న మరో వ్యక్తి (46), మహిళ (35) ఉన్నారు. అదే కుటుంబానికి చెందిన బాలిక (13)కు నిర్ధారించాల్సి ఉంది. వీరంతా ఇటీవల వైరస్‌ బారినపడిన ఫార్మా కంపెనీ ఉద్యోగి కాంటాక్ట్‌ కేసులని అధికారులు చెబుతున్నారు.


దువ్వాడలో ముగ్గురు

ఫార్మా కంపెనీ ఉద్యోగి కాంటాక్ట్‌ వల్ల దువ్వాడకు చెందిన ఇద్దరికి వైరస్‌ సోకింది. వీఎస్‌ఈజెడ్‌ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ దువ్వాడలో నివాసం వుంటున్న 27 ఏళ్ల వ్యక్తి, అతని కుమారుడి (14 నెలలు)కి వైరస్‌ సోకింది. అదేవిధంగా దువ్వాడ సెక్టార్‌-1లో నివాస ముంటున్న 34 ఏళ్ల మరో వ్యక్తి వైరస్‌ బారిన పడ్డాడు. ఇతను ఇటీవల ముంబై నుంచి విమానంలో వచ్చాడు. తల నొప్పి, గొంతునొప్పితో బాధపడుతూ ఈనెల నాలుగో తేదీన కేజీహెచ్‌కు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 


అనకాపల్లిలో మరో ఇద్దరికి.. 

అనకాపల్లిలో శుక్రవారం చెందిన 14 మందికి వైరస్‌ సోకగా, శనివారం మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో  పట్టణంలో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 21 చేరింది. శనివారం వైరస్‌ బారినపడిన వారిలో 22 ఏళ్ల యువకుడు, 47 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.   


నక్కపల్లి మండలంలో మహిళకు.. 

నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో ఒక మహిళ(38)కు కరోనా వైరస్‌ సోకింది. గత నెల 17న విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లివచ్చిన ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామానికి వచ్చిన ఒక వృద్ధురాలికి మూడు రోజుల కిందట కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో నివాసముంటున్న ఆమె కుమార్తె కూడా తల్లితో పాటు విజయవాడ వెళ్లి వచ్చింది. కొన్ని రోజులు పెనుగొల్లులోనే ఉంది. 23న దేవవరం తిరిగి వచ్చింది. ఇటీవల ఆమె తల్లికి కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆమె ద్వారా సెకండరీ కాంటాక్ట్‌ అయిన వారందరినీ వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు దేవవరంలో వున్న ఆమె కుమార్తె (48)కు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ తేలింది. దీంతో వైరస్‌ బారినపడిన మహిళతో కాంటాక్ట్‌ అయిన 21 మందిని అధికారులు గుర్తించి వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  


ప్రయాణికులు ఎనిమిది మందికి.. 

లాక్‌డౌన్‌ వల్ల దేశ, విదేశాల్లో చిక్కుకుపోయి.. ప్రస్తుతం జిల్లాకు తిరిగివచ్చిన ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో అగనంపూడికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఇండియన్‌ ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్న సదరు వ్యక్తి ఈ నెల ఒకటిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి వచ్చాడు. అధికారులు నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో శనివారం పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా గాజువాక కణితి రోడ్డుకు చెందిన యువకుడు (30) గురువారం ఖతర్‌ నుంచి విమానంలో నగరానికి వచ్చాడు.విమానాశ్రయంలో నమూనాలు సేకరించి పరీక్షించగా, శనివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సాగర్‌నగర్‌కు సమీపంలోని తాటిచెట్లపాలెంలో నివాసం వుంటున్న ఉద్యోగి కుమార్తె (7)కు వైరస్‌ సోకింది. ఢిల్లీలో వున్న భార్య, ఇద్దరు పిల్లలను విమానంలో శుక్రవారం విశాఖకు తీసుకువచ్చారు. ఎయిర్‌ పోర్టులో పరీక్షలు నిర్వహించగా, ఏడేళ్ల బాలికకు వైరస్‌ నిర్ధారణ అయింది.  


సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌.. 

పెదముషిడివాడకు చెందిన సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ (32)కు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. జమ్ము కశ్మీర్‌లో పనిచేస్తున్న ఆయన ఈనెల రెండో తేదీన సోదరుడితో కలిసి విమానంలో విశాఖ వచ్చారు. నమూనాలు సేకరించి పరీక్షించగా, శనివారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో ఎంతమంది కాంటాక్ట్‌ అయ్యారో వివరాలు సేకరించారు. 


పారిశ్రామిక ప్రాంతంలో ఒకరికి.. 

మల్కాపురం శివారు త్రినాథ్‌పురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అతను ఈ నెల మూడో తేదీన హైదరాబాద్‌ నుంచి విశాఖకు వచ్చాడు. ఇక్కడ రైల్వే క్లబ్‌లో ఆ యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాత ఇంటికి పంపించారు. ఫలితాల్లో అతనికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మల్కాపురం సీఐ ఉదయ్‌కుమార్‌, ములగాడ తహసీల్దార్‌ రమామణి, జీవీఎంసీ జోన్‌-4 జోనల్‌ కమిషనర్‌ సింహాచలం శనివారం అతడి ఇంటికి వెళ్లి యువకుడితో పాటు అతని తల్లిదండ్రులు, బంధువులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


శ్రీహరిపురంలో ఒకటి

అలాగే శ్రీహరిపురం ఇందిరాకాలనీలో ఉంటున్న వ్యక్తి అనకాపల్లిలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ దుకాణంలో ఒకరికి పాజిటివ్‌ రావడంతో అందరికీ పరీక్షలు చేశారు. ఇందిరాకాలనీలోని వ్యక్తికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతనితో పాటు బంధువులను కూడా ఆస్పత్రికి తరలించారు. 


సబ్బవరంలో.. 

సబ్బవరం శివారు గణపతిపురం గ్రామంలో (పాత రోడ్డు) ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆమె తన భర్తతో కలిసి ఈ నెల ఒకటో తేదీన ఢిల్లీలోని నోయిడా నుంచి విమానంలో విశాఖ వచ్చారు. అప్పటి నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆమెతో పాటు ఇంట్లోని ఇద్దరు కుటుంబ సభ్యులకు పరీక్షలు చేశారు. ఆమెకు పాజిటివ్‌ రాగా, మిగతా ఇద్దరికి నెగెటివ్‌ వచ్చింది. ఆమెను కొమ్మాది వద్ద గల గాయత్రి మెడికల్‌ ఆస్పత్రికి తరలించినట్టు ఎంపీడీవో రమేష్‌నాయుడు తెలిపారు. ఆమెకు దగ్గరగా మెలిగిన 14 మందిని వంగలి క్వారంటైన్‌కు తరలించామన్నారు. మరో ఇద్దరికి సంబంధించిన వివరాలు తె లియాల్సి ఉంది. 


కొమ్మాదిలో 40 ఏళ్ల వ్యక్తికి కరోనా

కొమ్మాది సాయిరాం కాలనీలో 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈయన గత నెల 30న శ్రీకాకుళం జిల్లా కొత్తపేట గ్రామంలో అమ్మమ్మ మృతిచెందడంతో కుటుంబంతో సహా వెళ్లి వచ్చినట్టు అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించడంతో శుక్రవారం ఆయన స్వయంగా ఛాతీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని జోన్‌-1 కమిషనర్‌ బి.రాము తెలిపారు. కాగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆరుగురిని ప్రథమ ఆస్పత్రికి తరలించినట్టు మధురవాడ పీహెచ్‌సీ వైద్యాధికారిణి అశ్వని శైలజ తెలిపారు. ఈ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా, చుట్టుపక్కల 200 మీటర్ల ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా ప్రకటించామన్నారు.

Updated Date - 2020-06-07T08:04:59+05:30 IST