ఆకలిని చంపేస్తోందా?.. అయితే ఎనరొక్సియా నర్వోసానే!

ABN , First Publish Date - 2022-09-13T19:39:49+05:30 IST

కొన్ని మానసిక సమస్యలు ఆకలిని చంపేస్తాయి. ఆహారం పట్ల ఏవగింపును పెంచుతాయి. ఎనరొక్సియా నర్వోసా అలాంటి వ్యాధే!

ఆకలిని చంపేస్తోందా?.. అయితే ఎనరొక్సియా నర్వోసానే!

కొన్ని మానసిక సమస్యలు ఆకలిని చంపేస్తాయి. ఆహారం పట్ల ఏవగింపును పెంచుతాయి. ఎనరొక్సియా నర్వోసా అలాంటి వ్యాధే!


లావైపోతామోననే భయంతో ఆకలిని చంపుకునే మానసిక సమస్య ఇది. ఈ రుగ్మత 18 నుంచి 25 ఏళ్ల యువతుల్లో ఎక్కువ. సాధారణంగా అందంగా, నాజూకుగా కనిపించాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సమాజపు పోకడ కూడా అదే విధంగా ఉండటంతో కొందరు ఎంతో ఒత్తిడికి లోనుతారు. ఎత్తుకు తగిన లావు ఉంటేనే అందం అనుకుంటే, ఈ కోవకు చెందినవాళ్లు అంతకంటే సన్నబడితే ఇంకా అందంగా కనిపిస్తాం కదా! అనుకుంటారు. అందుకు తగ్గ ఆహార శైలిని అలవరుచుకుని సాధ్యమైనంత తక్కువ మోతాదుల్లో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ శరీర బరువుకు ఓ టార్గెట్‌ పెట్టుకుని దాన్ని చేరుకున్నా, ఇంకా ఇంకా తగ్గాలనే తాపత్రయపడుతూ ఉంటారు. ఎదుటివాళ్లు గుర్తించి ‘అస్థిపంజరంలా తయారయ్యావు’ అన్నా పట్టించుకోరు. ‘ఇంకా కొన్ని గ్రాముల బరువు తగ్గితే ఇంకా బాగుంటాను’...అనే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆహారాన్ని తగ్గించుకుంటూ పోతారు. చివరికి ఓ దశలో శరీరానికి సరిపడా పోషకాలు అందక బలహీనతతో వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఈ సమస్య ఉన్న వాళ్లని గుర్తించటం కొంత కష్టం. కానీ కొన్ని లక్షణాలను బట్టి ఎనొరొక్సియా నర్వోసా వ్యాధిని గుర్తించవచ్చు. 


అవేంటంటే...

  • ఆకలి లేదనే సాకుతో ఆహారానికి దూరంగా ఉండటం.
  • అందరిముందూ తినటానికి ఇష్టపడకపోవటం.
  • తినకపోయనా తిన్నామని అబద్ధం చెప్పటం.
  • అతి కొద్ది పరిమాణాల్లో తినటం.
  • తినే ప్రతి పదార్థాన్నీ కాలరీల్లో లెక్కిస్తూ ఉండటం.
  • దుస్తులు వదులవుతున్నా గుర్తించలేకపోవటం.
  • తాము బలహీనంగా ఉన్నామని ఒప్పుకోకపోవటం.
  • రోజులో ఎక్కువసార్లు బరువు చెక్‌ చేసుకుంటూ ఉండటం.
  • ఏదైనా తిన్న వెంటనే ఆ కాలరీలు ఖర్చు అవటం కోసం వ్యాయామం చేయటం.
  • బలవంతం చేసినా తినకపోవటం.
  • బలహీనంగా కనిపిస్తున్నావని అంటే కోపం తెచ్చుకోవటం.
  • సన్నగా కనిపించాలనే ఆలోచన తప్ప వేరే ధ్యాస లేకపోవటం.

Updated Date - 2022-09-13T19:39:49+05:30 IST