చీదరింపులు.. ఛీత్కారాలు...

ABN , First Publish Date - 2021-04-17T05:07:11+05:30 IST

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ అభాసుపాలవుతోంది. ఈ పథకం ద్వారా చికిత్సలు పొందే వారి పట్ల సిబ్బంది చులకనభావాన్ని చూపిస్తున్నారు. పెద్దాసుపత్రి కదా పెద్ద డాక్టర్లుంటారు.. చికిత్స బాగా చేస్తారనే ఆశతో ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి వస్తుంటారు.

చీదరింపులు.. ఛీత్కారాలు...

ఆసరా కోసం బాధితుల అవస్థలు  

ఇదీ.. రిమ్స్‌లో ఆరోగ్యశ్రీ వైద్య సేవల దుస్థితి


     ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ అభాసుపాలవుతోంది. ఈ పథకం ద్వారా చికిత్సలు పొందే వారి పట్ల  సిబ్బంది చులకనభావాన్ని చూపిస్తున్నారు. పెద్దాసుపత్రి కదా పెద్ద డాక్టర్లుంటారు.. చికిత్స బాగా చేస్తారనే ఆశతో ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికి వస్తుంటారు. అయితే ఆసుపత్రిలో కాలు పెట్టింది మొదలు.. అనేక చీదరిం పులు.. ఛీత్కారాలు రోగులకు తప్పడం లేదు. వివరాలిలా..


కడప(సెవెన్‌రోడ్స్‌), ఏప్రిల్‌ 16: చికిత్స కోసం ప్రజలు సర్వజన ఆసుపత్రికి రావడం మొదలుకొని అబ్జర్వేషన్‌, బెడ్లు, ఫుడ్‌, ఆరోగ్యమిత్రల వద్ద ఎంట్రీ, మందులు, చికిత్సలు, డిశ్చార్జి వరకు ఇబ్బందులు పడాల్సిందే. పైగా వివిధ రకాల పత్రాలు కావాలని రోగులను, వారి బంధువులను పలుమార్లు తిప్పించుకుంటున్నారు. పులివెందులకు చెందిన గోపినాథ్‌ అనే వ్యక్తి (ఊరు, పేరు మార్చాం) పది సంవత్సరాల తన బిడ్డకు బాగాలేదని రిమ్స్‌కు తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. సంబంధిత చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుండడంతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలను రెండు రోజుల తరువాత చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు చిక్కు అప్పుడే వచ్చింది. ఏంటంటే చికిత్స అనంతరం విడుదల (డిశ్చార్జి పత్రం) ఇవ్వడానికి సాంకేతికంగా కుదరదు కాబట్టి మీరు పది రోజుల తరువాత కుట్లు విప్పదీసుకునేందుకు వస్తారు కదా.. అప్పుడు ఇస్తామని చెప్పారు. వచ్చేటప్పుడు పిల్లాడిది, మీది కలిసిన జాయింట్‌ అకౌంటు చేయించుకుని రమ్మన్నారని తెలిపారు. దీనికి అతను సమాధానమిస్తూ ‘మా అబ్బాయికి ఇప్పటికే అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి కదా, మీరేమో కొత్తగా జాయింట్‌ అకౌంటు అడుగుతున్నారేంటి’ అని ప్రశ్నించగా.. సిస్టంలో ఎంట్రీ చేయాలి.. ఖచ్చితంగా తీసుకురండి, లేదంటే మీకు ఆరోగ్యశ్రీ ఆసరా లభించదని సమాధానం ఇచ్చారు. అంటే పత్రాలు  లేకుండానే అడ్మిషన్‌ ఇచ్చి ఆపరేషన్‌ చేశారన్నమాట. పది రోజుల తరువాత అడిగిన అన్ని పత్రాలతో ఆ వ్యక్తి వెళితే, సర్వర్‌ పనిచేయడం లేదు, మరో వారం తరువాత రమ్మని సమాధానమిచ్చారు. అలాగే మరోవారం తరువాత రాగా డిశ్చార్జి పత్రం ఇవ్వాల్సిన వారికి పరీక్షలు ఉన్నాయని, రెండురోజుల తరువాత రమ్మని సమాధానమిచ్చారు. ఎక్కడో దూరం నుంచి ఎంతో వ్యయ ప్రయాసలతో చార్జీలను భరించి వస్తే పదే పదే తిప్పుకోవడమేంటని బాధితులు వాపోతున్నారు. అనేక కష్టాలు, అవమానాలు, ఛీదరింపులు, చీత్కారాలతో పేదలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఉదాహరణకు మాత్రమే. నిత్యం ఇలాంటివి ఎన్నో ఇక్కడ చోటు చేసుకుంటు న్నాయని సమాచారం. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో రోగులను వారి బంఽధువులను ఇలా పదే పదే తిప్పుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, ఆసుపత్రి పరిపాలనాధికారులు ఈ విషయమై పట్టీ పట్టనట్లు ఉన్నారని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా దీనిపై విచారించి తగిన చర్యలు తీసుకుంటే రిమ్స్‌ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


ఇబ్బందులు లేకుండా చూస్తాం 

ఈ విషయమై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. చికిత్స అనంతరం వచ్చే ఆరోగ్య ఆసరా కోసమై పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అప్‌లోడ్‌ చేయాలి. పత్రాలు సరిగా లేకుంటే ఆరోగ్య ఆసరా రోగులకు అందదు. ఆలస్యం, తిప్పుకోవడం వంటి విషయాల గురించి సంబంధిత విభాగ అధిపతులు (హెచ్‌ఓడి)తో సంప్రదించి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రయత్నిస్తాం. రోగులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. 


- డాక్టర్‌ వెంకటశివ (మెడికో), ఆరోగ్యశ్రీ విభాగాధికారి


Updated Date - 2021-04-17T05:07:11+05:30 IST