కారులో కిరికిరి!

ABN , First Publish Date - 2021-09-16T05:10:14+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీలో..

కారులో కిరికిరి!

టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పదవులపై కన్నేసిన ఆశావహులు 

పాత, కొత్త నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం

పైరవీలు చేసిన వారికే పదవులంటూ ఆగ్రహం

జిల్లాలో ఎమ్మెల్యేల ఏకపక్ష నిర్ణయాలపై పార్టీ క్యాడర్‌లోనే అసంతృప్తి


ఆదిలాబాద్‌(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని టీఆర్‌ఎస్‌ పార్టీలో గ్రామ, వార్డు కమిటీల కిరికిరి మొదలైంది. సీనియర్‌ కార్యకర్తలకు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న 468 గ్రామ కమిటీల ఎన్నిక దాదాపుగా పూర్తయింది. ఇందులో అవకాశం దక్కని నేతలంతా పార్టీ తీరుపై ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ఎన్నాళ్లు పార్టీలో పని చేసినా ఫలితం లేదంటూ అసంతృప్తికి లోనవుతూ ఇతర పార్టీల వైపు ఎదురు చూస్తున్నారు. అధికార పార్టీ కావడంతో పార్టీ పదవులకు ఎక్కువగానే ప్రాధాన్యం కనిపిస్తోంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తున్నా గ్రామ స్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి.


టీఆర్‌ఎస్‌ వర్గ విభేదాలతో ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు కలిసి వస్తోంది. ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో పరిస్థితులు కొంత మెరుగ్గానే కనిపిస్తున్నా బోథ్‌ నియోజకవర్గంలో మాత్రం గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంది. ఇక్కడి నేతలు రెండు, మూడు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీకి ఇబ్బందికరంగానే మారింది. ఈ నెల 20లోగా పట్టణ, మండల కమిటీలను పూర్తి చేయాల్సి ఉండగా అధికార పార్టీలో ఆసక్తికర పరిణామమే చోటు చేసుకుంటున్నాయి. మండల పదవులను ఆశిస్తున్న వారంతా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతూ పదవులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


ఊపందుకుంటున్న పైరవీలు..

ఇప్పటికే వార్డు, గ్రామ కమిటీల ఎంపిక పూర్తి కావడంతో పట్టణ, మండల కమిటీలపై దృష్టి సారిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో మండల కన్వీనర్‌ పదవులకు భారీగా డిమాండ్‌ ఏర్పడుతోంది. గతంలో మండల కన్వీనర్‌గా పని చేసిన వారే మళ్లీ పదవిని ఆశిస్తున్నారు. జిల్లా ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో మంచి పరిచయాలు ఉండడంతో మండల పదవులపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల కన్వీనర్‌ పదవులను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సమయం దగ్గర పడడంతో ఆశావహ నేతలంతా పైరవీలను ముమ్మరం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్న క్షణాల్లో అక్కడవాలిపోతూ మండల స్థాయిలో చక్రం తిప్పేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. 


ఉద్యమ నేతల ఆగ్రహం..

పార్టీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఉద్య మ నేతలకు నామినెట్‌ పదవులు దక్కక పోవడంతో అసంతృప్తితో కనిపిస్తున్న వారంతా పార్టీ పదవులను ఆశిస్తున్నారు. అయినా అవకాశం దక్కక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు అనుకూలమైన వారికే పదవులను ఇస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రతి గ్రామంలో పాత, కొత్త నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక వివాదాలకు దారి తీస్తోంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎంతో పని చేశామన్న ఆవేదన ఉన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి పార్టీకి అండగా నిలిచిన సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటు ఆవేదనకు లోనవుతున్నారు. నిత్యం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన వారికే పదవులు కట్టబెట్టడం ఏమిటన్న ప్రశ్నలు టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.


మాట వినకుంటే వేటే...

ఎమ్మెల్యేల మాట వినకుంటే సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండానే పలువురు నేతలపై వేటు వేయడం జిల్లాలో పరిపాటిగానే మారుతోంది. ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేస్తుందంటూ సీనియర్‌ నాయకురాలు మంచికట్ల ఆశమ్మపై సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. అలాగే బోథ్‌ నియోజక వర్గంలో ఇటీవల తలమడుగు మండల కన్వీనర్‌గా పని చేసిన శ్రీనివాస్‌రెడ్డిని తొలగించి మరో నేతకు పదవీ బాధ్యతలు అప్పగించారు. అదే మండలానికి చెందిన మరో నేత మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌గా పని చేసిన ముడుపు కేదరేశ్వర్‌రెడ్డిని అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి ఎమ్మెల్యేల పంతం నెగ్గించుకున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. కేదరేశ్వర్‌రెడ్డి రాష్ట్ర పాడిపరిశ్రమ చైర్మన్‌ లోక భూమారెడ్డికి దగ్గరి బంధువు కావడంతోనే పదవిని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడుతున్నాయని కొందరు సీనియర్‌ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

Updated Date - 2021-09-16T05:10:14+05:30 IST