రైళ్లలో డిస్పోజబుల్‌ చద్దర్లేవీ?

ABN , First Publish Date - 2021-11-25T08:54:26+05:30 IST

రైల్వే శాఖకు ఆదాయం మీద ఉన్న మక్కువ.. ప్రయాణికుల సదుపాయాలపై లేనట్లుగా కనిపిస్తోంది. కరోనా వణికించినా రైల్వే శాఖ కళ్లు తెరవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రైళ్లలో డిస్పోజబుల్‌ చద్దర్లేవీ?

  • రెండేళ్ల క్రితం ప్రకటన.. 
  • కరోనా వణికించినా కళ్లు తెరవని వైనం

హైదరాబాద్‌ సిటీ, నదవడరు 24(ఆంధ్రజ్యోతి): రైల్వే శాఖకు ఆదాయం మీద ఉన్న మక్కువ.. ప్రయాణికుల సదుపాయాలపై లేనట్లుగా కనిపిస్తోంది. కరోనా వణికించినా రైల్వే శాఖ కళ్లు తెరవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం చేసిన ప్రకటన ఇప్పటికీ అమలు కాకపోవడమే దీనికి ఉదాహరణ.  కరోనా కష్టాల తర్వాత ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థాయికి వస్తోంది. రైల్వే ప్రయాణాలూ పెరిగాయి. దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్ల పరిధిలో కరోనాకు ముందు 430రైళ్ల ద్వారా 3.20లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం 274రైళ్లలో సుమారు 2.60లక్షల మంది రోజూ ప్రయాణిస్తున్నారు. గతంలో ఏసీ బోగీల్లోని ప్రయాణికులకు దుప్పటి, దిండు, రగ్గు అందించేవారు. కరోనా విపత్తులో వాటిని ఆపేశారు. తర్వాత మళ్లీ రైళ్లు పట్టాలెక్కిన కొన్నాళ్లకు దిండు, దుప్పటి ఇవ్వడం మొదలెట్టారు. అయితే, స్వచ్ఛ ప్రయాణంలో భాగంగా డిస్పోజబుల్‌ దిండు కవర్లు, దుప్పట్ల సౌకర్యం అందుబాటులోకి తెస్తామని 2019లో చెప్పిన రైల్వే శాఖ.. ఆ మాటను మరిచింది. ఒక ప్రయాణికుడు వాడిన వాటిని మరొకరికి ఇవ్వడం..


మధ్యలో ఎక్కిన ప్రయాణికులు గట్టిగా అడిగితే తప్ప ఉతికినవి ఇవ్వకపోవడం.. దుర్వాసన.. ఉతకడంలో అలసత్వం వంటి వాటివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. దీంతో రైల్వే డిస్పోజబుల్‌ ఆలోచన చేసింది. ‘స్వచ్ఛ రైలు, స్వచ్ఛస్టేషన్‌’ నినాదంలో భాగంగా డిస్పోజబుల్‌ క్లాత్‌ పిల్లో(దిండు) కవర్‌, దుప్పట్లను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. కోల్‌కతా-న్యూఢిల్లీ రైలులో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో అన్ని రైళ్లలో వీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకావడం లేదు. కరోనా ఇంకా మనల్ని వదిలిపోలేదని అప్రమత్తం చేస్తున్న కేంద్రం..  స్వచ్ఛతపై రైల్వే శాఖను హెచ్చరించడంలేదని విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2021-11-25T08:54:26+05:30 IST