సరైనా సమయంలో నిర్ణయం ప్రకటిస్తా

ABN , First Publish Date - 2021-05-06T07:35:35+05:30 IST

తన రాజకీయ భవిష్యత్తుపై మద్దతుదారుల అభిప్రాయం తీసుకొని సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

సరైనా సమయంలో నిర్ణయం ప్రకటిస్తా

  • శ్రేయోభిలాషులు, మిత్రులతో చర్చిస్తా
  • జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా స్పందన 
  • ఉద్యమకారులు, అభిమానుల మద్దతు
  • ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామంటున్నారు
  • హుజరాబాద్‌ నుంచి బయలుదేరేముందు ఈటల
  • దేవరయాంజాల్‌లో మూడోరోజూ విచారణ


హుజూరాబాద్‌, హైదరాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి): తన రాజకీయ భవిష్యత్తుపై మద్దతుదారుల అభిప్రాయం తీసుకొని సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశవిదేశాల నుంచి తనకు వేలాది ఫోన్లు వస్తున్నాయని.. తన శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజకీయవేత్తలతో చర్చించి ఏం చేయాలనేది నిర్ణయిస్తానని చెప్పారు. వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఏం ఆశించారు? వారికి ఏం అందింది? అనేవి పరిశీలిస్తామన్నారు. ఇది ఆత్మగౌరవ సమస్య అని, తన విషయంలో దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించారని, ఏమాత్రం సహించకుండా ముందుకు వెళ్లాలని చాలామంది తనకు చెప్పారని, తన పిలుపునకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మాట ఇచ్చారని ఈటల తెలిపారు! ఈటల కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో 3 రోజులుగా ప్రజలతో మాట్లాడారు. 


బుధవారం హైదరాబాద్‌కు బయల్దే రే ముందు ఆయన విలేకర్లతో ముచ్చటించారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు, అభిమానులు, పాత ఉద్యమకారులు వచ్చి తనను కలిశారని చెప్పారు. 20 ఏళ్ల తెలంగాణ ఉద్యమం, ఇక్కడ జరిగిన మిలిటెంట్‌ ఉద్యమాలను తలుచుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఢిల్లీ సర్కారు మెడలు వంచేందుకు 48 గంటల రైల్‌రోకోకు పిలుపునిస్తే కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో ఏ ఎక్స్‌ప్రెస్‌ కదలకుండా, రైళ్లలో ఉన్న ప్రయాణికులకు అన్నం, నీళ్లు అందించి రైల్‌రోకో చేసి హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు చైతన్యం చాటారని పేర్కొన్నారు. ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌లో ఫైరింగ్‌కు ఆర్డర్‌ ఇచ్చినా లెక్క చేయకుండా ఉద్యమం నడిపామని తెలిపారు. ఇంత బాధ్యతగల నియోజకవర్గంలో కార్యకర్తలంతా ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారని.. తనకు జరిగిన అన్యాయం సహించరానిదని తీవ్రంగా ఖండిస్తున్నారని, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ‘‘మీలాంటి వారికే ఇలాంటి కష్టం వస్తే మాములు జనాల పరిస్థితి ఏమిటి’’ అంటూ వారు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.


ఈటల ముందు కన్నీరు పెట్టిన మహిళ 

హుజూరాబాద్‌ ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయం లో విలేకరుల సమావే శం అనంతరం ఈటల బయటకు వస్తుండగా ఆయన్ను చూసి ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన ఓ మహిళ రోదించింది. ‘‘అయ్యో బిడ్డా.. నీకు ఇలా జరిగిందా. మా లాంటి పేదలకు ఎంతో సాయం చేశావు’’ అంటూ కన్నీంటి పర్యంతమైంది. ఆమెను ఈటల ఓదార్చారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఇది చూసి మిగతా మహిళలు కూడా కంటతడి పెట్టారు. అనంతరం ఆయన కారులో హైదరాబాద్‌ వెళ్లారు.


ఆ చర్యలు కుట్రపూరితమే: నారాయణ

భూ ఆక్రమణల ఆరోపణలతో ఈటలపై సీఎం కేసీఆర్‌ చర్యలు కుట్రపూరితమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయ వ్యవస్థ న్యాయంగానే స్పందించిందన్నా రు. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా ఉంటూ టీఆర్‌ఎస్‌ పార్టీలో సైతం క్రియాశీలక పాత్రవహించిన ఈటలపై పోలింగ్‌ అయిన మరుక్షణం చర్యలు ప్రారంభించారంటే ఇది కుట్రపూరితం కదా? అని ప్రశ్నించారు. ఈటలపై తీసుకున్న కఠిన వైఖరి ఇతర భూదందాల విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ ఈ ఆరోపణలను రాజకీయంగానే ఎదుర్కొంటారో? న్యాయ వ్యవస్థ చుట్టూనే తిరుగుతారో? చూడాల్సి ఉందన్నారు.  


అసైన్డ్‌ భూముల ఆక్రమణ తప్పు కాదా?: లక్ష్మీకాంతారావు

రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి ఈటల అసైన్డ్‌ భూములు ఆక్రమించడం తప్పు కాదా? అని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ప్రశ్నించా రు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌ గ్రామంలోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయొద్దని 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. పార్టీ నాయకత్వానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుందన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్‌ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మంత్రిగా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదన్నారు.

Updated Date - 2021-05-06T07:35:35+05:30 IST