అన్నవరం కొండపై జీతాల కోసం ఉద్యోగులు విలవిల

ABN , First Publish Date - 2020-09-28T03:08:44+05:30 IST

ఎందరో భక్తుల సమస్యలను గట్టెక్కిస్తున్న అన్నవరం సత్యదేవుడు ఆయన సన్నిధిలో పనిచేసే ఉద్యోగుల సమస్య ..

అన్నవరం కొండపై జీతాల కోసం ఉద్యోగులు విలవిల

  • కాంట్రక్టర్లకు అరకొర చెల్లింపులే 
  • స్వామివారికి రూ 76 కోట్లు ఎఫ్‌డిఆర్‌లు
  • ఎఫ్‌డిఆర్‌లు రూ.10 కోట్లు ఎన్‌ క్యాష్‌ కోరినా స్పందన కరవు
  • దయనీయస్థితికి చేరువలో 249 మంది పురోహితులు
  • రూ 4.90 కోట్లు పేరుకుపోయిన రెగ్యులర్‌ ఉద్యోగుల జీతాల బకాయిలు 
  • పురోహితులకు కేవలం రూ 10వేలు మాత్రమే చెల్లింపులు


అన్నవరం, సెప్టంబరు 27 ఆంధ్రజ్యోతి: ఎందరో భక్తుల సమస్యలను గట్టెక్కిస్తున్న అన్నవరం సత్యదేవుడు ఆయన సన్నిధిలో పనిచేసే ఉద్యోగుల సమస్య తీర్చలేకపోతున్నాడు. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తుల కానుకలతో ఆదాయం కళకలలాడేది. అయితే కరోనా మహమ్మారి పుణ్యమా అని ఆలయంలో ఆర్దిక వ్యవస్ధ పూర్తిగా కుంటిపడింది. దరిమిలా సిబ్బందికి జీతాలు పూర్తిస్థాయిలో చెల్లించకపోవడంతో ఉద్యోగులు విలవిలలాడుతున్నారు. 


అన్నవరం దేవస్థానంలో 325 మంది రెగ్యులర్‌, 100మంది కాంట్రాక్ట్‌, 70 మంది జౌట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు కమిషన్‌, ప్రయివేటు ఏజెన్సీల ద్వారా మరో 150 మంది, 250మంది వ్రతపురోహితులు వరకు విదులు నిర్వహిస్తున్నారు. అయితే రెగ్యులర్‌ ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రతీనెల 1.60 కోట్ల రూపాయలు వ్యయమవుతుండగా నిదులు లేక మార్చి నుంచి ఇప్పటివరకు 4.90 కోట్లు బకాయిలు ఇవ్వాల్సిఉంది. దీనిపై ఉద్యోగసంఘ నాయకులు పాలకమండలిలో ఎఫ్‌డిఆర్‌లు 10 కోట్లు ఎన్‌క్యాష్‌ చేసి బకాయిపడ్డ తమ జీతాలను చెల్లింపుచేయాలని తిరిగి ఆమొత్తాన్ని రెండేళ్లలో ఫిక్ష్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని కోరగా పాలకమండలి ఆమోదించి కమిషనర్‌ అనుమతికి పంపించారు. 


అయితే ఎఫ్‌డిఆర్‌లు ఎన్‌క్యాష్‌కు కమిషనర్‌ సుముఖత వ్యక్తంచేయకపోవడంతో ఉద్యోగులు ఈంఐలు చెల్లించలేక అవస్ధలు పడుతున్నారు.  సుమారు 76 కోట్లరూపాయలు వివిద ఎఫ్‌డిఆర్‌ల రూపంలో బ్యాంక్‌లో ఉన్నాయి. వీటిలో శాస్వత పథకాల కోసం 7 కోట్లు ఉన్నాయి. గడిచిన 5ఏళ్లలో రూ 17 కోట్లు సర్‌ప్లస్‌ (మిగులు) నిదులు ఉన్నా దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఉద్యోగుల జీతాలచెల్లింపు పై స్పందించకపోవడం బాదకరం. మరోపక్క కాంట్రాక్టర్లకు అరకొర చెల్లింపులే జరుగుతున్నాయి. కరోనాకు ముందు ప్రతినెలా వివిద పద్దులకింద సరాసరిన 15కోట్లు ఆదాయం వస్తుండగా ప్రస్తుతం రూ 1.50కోట్లుకు చేరడమే కష్టంగా ఉంది. 


దేవదాయశాఖలో ఉన్నతాధికారులకు ప్రభుత్వనిదులు నుంచి క్రమం తప్పకుండా కోతలు లేకుండా జీతాలు వస్తున్నాయి. ప్రధానాలయాలలో సిబ్బందికి ఆయా ఆలయాల ఖాతాల నుంచే చెల్లింపులు చేపట్టడం ప్రస్తుతం వారికి శాపంగా మారింది. ఎఫ్‌డిఆర్‌లు ఎన్‌క్యాష్‌కుకు అంగీకరించని పక్షంలో ఆలయంలో వచ్చే నికర ఆదాయంలో ప్రభుత్వానికి ఈఏఎఫ్‌ నిదులు పేరుతో 8శాతం జమచేస్తుంటారు. కనీసం వాటిలోంచి అయినా ఇప్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరోపక్క కమిషన్‌ పద్దతిపై పనిచేసే వ్రతపురోహితుల పరిస్థితి దయనీయమయ్యేలా పరిస్థితులు కనబడుతున్నాయి. 249 మంది వ్రతపురోహితులలలో ఈనెల ఒకొక్కరికి 10వేలు మాత్రమే జమచేయడంతో దిక్కుతోచలేని స్థితిలో ఉన్నారు. వ్రతపురోహితుల సంక్షేమనిదిలో రూ 8కోట్ల వరకు ఫిక్స్‌డ్‌డిపాజిట్‌ ఉన్నా వాటిని నగదుగా మార్చే అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు.


దీనివలన దేవస్థానంపై పైసాకూడా అదనపు బారం పడకపోయినా ఎఫ్‌డిఆర్‌లు ఎన్‌క్యాష్‌కు ఒప్పుకోకపోవడం విచారకరం. పరిస్థితులు ఇలానేఉంటే తమ కుటుంబాలు రోడ్డునపాలవుతాయని ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రతిపక్షపార్టీలు మాత్రం హిందూదేవాలయాలను విచ్చినం చేసేందుకే హిందూ ఆలయంలో పనిచేసే సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల ఇబ్బందులపై దేవదాయకమిషనర్‌ స్పందించి ఎఫ్‌డిఆర్‌లు ఎన్‌క్యాష్‌ చేసి తమ పూర్తివేతన బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-28T03:08:44+05:30 IST