ఆనాటి కన్నడ - తెలుగు సాహిత్య వారధి

ABN , First Publish Date - 2020-04-13T06:02:51+05:30 IST

కన్నడ, తెలుగు అనువాదరంగంలో పరిచితమైన పేరు శర్వాణి. అర్ధశతాబ్దం కిందట రెండు మూడు తరాల పాఠకులకి కన్నడసాహిత్యంతో ప్రాథమిక పరిచయమైనా కలగడానికి ఆమె చేసిన అనువాద నవ లలు, కథలు సాయపడ్డాయి. శర్వాణి అసలుపేరు మణి గానహళ్ళి (నీలారంభం) శారద...

ఆనాటి కన్నడ  - తెలుగు సాహిత్య వారధి

ఆనాటి కన్నడ  - తెలుగు సాహిత్య వారధి

కన్నడ, తెలుగు అనువాదరంగంలో పరిచితమైన పేరు శర్వాణి. అర్ధశతాబ్దం కిందట రెండు మూడు తరాల పాఠకులకి కన్నడసాహిత్యంతో ప్రాథమిక పరిచయమైనా కలగడానికి ఆమె చేసిన అనువాద నవ లలు, కథలు సాయపడ్డాయి. శర్వాణి అసలుపేరు మణి గానహళ్ళి (నీలారంభం) శారద. ఏ తరగతి గదిలోనూ చదువుకోని కన్నడిగురాలైన శారద రెండుభాషల్లో ప్రవీణురా లైన శర్వాణిగా మారడానికి చేసిన ప్రయాణం ఆసక్తికరం. శర్వాణి గురించి ఆమె కుమార్తె కల్యాణి నీలారంభం తన అనుభవాలను విశాఖపట్నంలోని ‘పుస్తకాల పురుగులు’ గ్రూప్‌తో పంచుకున్నారు. ‘మాధవి’ వంటి కన్నడ అను వాద నవలల ద్వారా కల్యాణి నీలారంభం సుపరిచితులే. 


మీ అమ్మగారు శర్వాణి జీవిత నేపథ్యం చెప్పండి?  

శారద నుండి శర్వాణి గమనం, పుస్తకాల ద్వారానే సాధ్య మయిందనుకుంటా. మహానంది దగ్గరలోని నందవరం అనే చిన్నవూళ్ళో కాశీనుండి వచ్చిన కొందరు, బ్రాహ్మణ కుటుంబా లుగా స్థిరపడ్డారు. వారే నందవరీకులనే ఉపశాఖీయుల య్యారు. వీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఇంట్లో తెలుగే మాట్లాడే వారు. కోలార్లో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ మా తాతగారు. ఆరు గురు ఆడపిల్లలు ఒక్క మగపిల్లవాడు. కోలార్‌లో ఓ మట్టి గోడల ఇల్లు తప్ప మరేం ఆస్తిలేని మా తాతగారు పిల్లల్ని ప్రేమగా పెంచుకున్నారు. చిత్తూరునుండి వచ్చి బెంగళూర్లో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న నీలారంభం రామయ్యకు, మణి గానహళ్ళి శారదకు పెళ్ళయింది. అమ్మ బెంగళూర్లో కన్నడ సాహిత్యం విరివిగా చదివేది. అమ్మకి తెలుగు అలవాటు చేసే ప్రయత్నంలో నాన్న ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తెప్పించే వారు. 1956లో నాన్నకు రాజమండ్రి బదిలీ అయి తెలుగు రాష్ట్రానికి వచ్చాక తెలుగు పుస్తకాలు, ఏది దొరికితే అది చదివేది. క్రమంగా మంచి పుస్తకాలు ఎంచుకోవడం వచ్చింది. ఓ సంవత్సరం నాన్నకు బోనస్‌గా 500రూపాయలు వచ్చా యి. ఆ డబ్బులతో బంగారు మంగళసూత్రం గొలుసా, రేడి యోనా అని ఆప్షన్‌ అమ్మకిస్తే రేడియోకి ఓటు వేశారు. మా వొంటి మీద చిన్నమెత్తు బంగారం ఉండేది కాదు గాని రెండు బీరువాల నిండా పుస్తకాలు ఉండేవి. దాని మూలం గానే పుస్తకాలు చదవడం సహజమైన అలవాటుగా ఉండేది.


మీ ఇద్దరి అనువాద ప్రస్థానం ఎలా మొదలైంది?

విజయవాడలో ఉండగానే, మా రెండోతమ్ముడు మెనింజై టిస్‌తో చనిపోయాడు. ఆ  దుఃఖంలోంచి బయటపడడానికి అమ్మ ఏదైనా వ్యాపకాన్ని వెతుక్కునే ప్రయత్నంలో అనువా దాలు మొదలుపెట్టింది. ఆంధ్రపత్రికకు త్రివేణి కథ ‘ఆకర్షణ’ ఆమె అనుమతి తీసుకుని పంపాము. అది పత్రికలో రావ డంతో ఉత్సాహం వచ్చి అప్పుడు పత్రిక ఎడిటర్‌ శివలెంక రాధాకృష్ణకి అనువాద నవల వేసుకుంటారా అని లెటర్‌ రాశాము. ఆయన పరిశీలనకు పంపండి అనగానే ‘వెండి మబ్బు’ నవల చేసి పంపాము. అప్పటినుండి అమ్మ అను వదించిన అన్నినవలలూ సీరియల్స్‌గా ఆంధ్రపత్రికలో వచ్చి నవే. 1960లో నాన్నకి బదిలీ అయి అనకాపల్లి వచ్చాము. అక్కడ శారదా గ్రంథాలయం, దాని మేడమీద రెగ్యులర్‌గా నడిచే సాహితీ సమావేశాలు మా పరిధిని పెంచుకోవడానికి దోహదం చేశాయి. మునిమాణిక్యం నుండి రావిశాస్త్రి, రంగ నాయకమ్మ--ఎంతమందిని విన్నామో! రావిశాస్త్రి, మహీధర రామ్మోహనరావు, వారి కుటుంబాలతో సహా జీవితకాలం స్నేహితులు అయ్యారు. 1967లో గుడివాడలో జరిగిన తెలుగు రచయిత్రుల మహాసభకు హాజరైనవారిలో అమ్మకూడా ఉన్నారు. తెన్నేటి హేమలత, బీనాదేవి, నిడదవోలు మాలతి వంటి రచ యిత్రులను ఒకేచోట చూడడం బాగానచ్చి చాలాసార్లు తల్చు కునేవారు. అప్పుడే కె. రామలక్ష్మి అందరి వివరాలు తీసుకుని రచయిత్రుల ‘who is who’ని ‘ఆంధ్ర రచయిత్రులు’ పేరిట తీసుకొచ్చారు. అందులో అమ్మ గురించి సమాచారం ఉంది.


అమ్మ అనువాదం చేసే టప్పుడు మూలరచనలో మా ర్పులు చేయకుండా తెలుగు దనం తెచ్చే ప్రయత్నం చేసే వారు. సరైనపదంకోసం విశ్వ ప్రయత్నం చేసేవారు. ఒక్కో మారు గంటల తరబడి చర్చించుకునేవాళ్ళం. ఎన్ని ఊళ్ళు మారినా, కుటుంబంలో ఎన్ని విషాదాల్ని ఎదిరించాల్సి వచ్చి నా అమ్మకి మందు అనువాదాలు, కథలు రాయడం. ఆంధ్ర పత్రికలోనే కాక యువ, జ్యోతి ప్రత్యేకసంచికలలో అమ్మ కథలు ఉండేవి. విపుల మాసపత్రిక పెట్టిననాటి నుంచి అమ్మ చనిపోయేముందు దాకా తన అనువాదాలు ప్రతినెలా కనీసం ఒక్కటైనా ప్రచురించేవారు. 


మీ కుటుంబంలో చాలామంది అనువాదకులున్నారు? 

అమ్మ అక్కచెల్లెళ్ళందరూ ముందు చదువరులు. ఒక చెల్లెలు సుందరీమూర్తి హిందీలో విశారద, ప్రవీణ పరీక్షలు పాసయింది. మాకు చిన్నప్పుడు హిందీ పాటలు, సాహి త్యంతో పరిచయం ఆమె మూలంగానే. తను హిందీనుండి కన్నడంలోకి అనువాదాలు చేస్తుంది. ఇంకో చెల్లెలు సులో చనామూర్తి కవిత్వం రాస్తుంది. తెలుగు నుండి కన్నడంలోకి అనువాదాలు చేస్తుంది. నేను అయిదునవలలు, కొన్ని కథలు అనువాదం చేసాను. మా తమ్ముడి భార్య ఉమాదేవి నీలా రంభం కన్నడనుంచి తెలుగులోకి అయిదు నవలలు అను వాదం చేసారు. మంచి తెలుగుపుస్తకాలు కనపడితే అందరం షేర్‌ చేసుకునేవాళ్ళం. ఇవాళ్టికీ మంచి తెలుగుకథలు కనబ డితే వారికి పంపుతాను. లత ‘ఆలేఖ్య’, రంగనాయకమ్మ ‘కృష్ణవేణి’ మా పిన్ని మొదటి అనువాదాలు. జనార్దన మహర్షి ‘గుడి’, మృణాళిని ‘కోమలి గాంధారం’ వంటివి ఈ మధ్య కాలంలో చేశారు. నలభై ఇద్దరు రచయితలవి చిన్నకథలు అనువాదం చేసారంటే చేశారంటే నమ్ముతారా? పి.ఎస్‌. నారా యణ, ఓల్గా, బాలగంగాధర తిలక్‌, వివినమూర్తి, పాలగుమ్మి సీత, ఎల్‌.ఆర్‌.స్వామి, ఎవి.రెడ్డిశాస్త్రి ఇందులో ఉన్నారు. 


శర్వాణి రచనలు, పబ్లికేషన్స్‌ వివరాలు? 

అమ్మ అనువదించిన త్రివేణి నవలలు చాలా మటుకు ఆంధ్రపత్రికలో సీరియల్స్‌గా వచ్చాయి. తర్వాత శేషాచలం అండ్‌ కంపెనీవారు పుస్తకాలుగా తీసుకొచ్చారు. ఎమెస్కోవారు ఇంటింటా గ్రంథాలయం స్కీములో ఈ నవలలను తేవ డంతో ఎక్కువమంది చదివే అవకాశం వచ్చింది. కన్నడ రచ యితలు-త్రివేణి, శివరామకారంత, నిరంజన నవలలు పద కొండింటిని అమ్మ తెలుగులోకి అనువదించింది. కన్నడనుంచి తెలుగులోకి ద్వివేదుల విశాలాక్షి, మల్లాది, యర్రంశెట్టి, పవని నిర్మల ప్రభావతి, పరిమళా సోమేశ్వర్‌ మొదలైనవారి కథలు వందపైనే అనువాదం చేసారు. విపులలో అనువాద కథలు చాలా వచ్చాయి. అలానే తెలుగు నుంచి కన్నడలోకి అయిదు రచనలు, దాదాపు వంద కథల వరకూ అనువాదం చేసారు. ఈ మధ్యకాలంలో పాత రచనలు చాలామందివి రీ ప్రింట్‌ చేస్తున్నారు. 1985లో ఎమెస్కో వారిని రీ ప్రింట్‌ చేసే ఉద్దేశ్యం ఉందా అని అడిగితే లేదన్నారు. ఇపుడు సానుకూ లంగా స్పందిస్తారేమో చూడాలి. ఫేస్బుక్‌లో చాలామంది నన్ను శర్వాణి కూతురిగా గుర్తిస్తారు, పుస్తకాలు అన్నీ గుర్తు పెట్టుకొని అడుగుతారు. ఎక్కడ దొరుకుతాయి అనడుగు తారు. కాని పత్రికలు, పబ్లిషర్స్‌ మాత్రం అనువాద రచన లకు మార్కెట్‌ లేదంటారు. నేను బి.యు. గీత ‘మిథ్య’ అనే నవలను అనువదించాను. కుటుంబంలో సంబంధాలు ఎలా వ్యాపార సంబంధాలుగా మారుతున్నాయన్న కథావస్తువుతో. ఇది woman centric కాదు, పురుష ప్రధానమయింది. ఆ కారణంగా దానిని ప్రచురణలోకి తేలేకపోయాను. మరికొ న్నాళ్లకి మా ఈ అనువాద సాహిత్యం అంతా మరుగున పడిపోయే అవకాశం ఉంది. దాదాపు 20నవలలు, కొన్ని వందల కథలు విడివిడిగా ఉండిపోయాయి. అన్నిటినీ ఒక చోటకి చేర్చిపెట్టాము కానీ వాటి సమగ్ర సంకలనాలు తేవడ మన్నది ఒంటిచేత్తో జరిగే పని కాదు. 

(ఇంటర్వ్యూ: ‘పుస్తకాల పురుగులు’ గ్రూప్‌, విశాఖపట్నం)


కల్యాణి నీలారంభం 

95509 81050 


Updated Date - 2020-04-13T06:02:51+05:30 IST