Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నమయ్య సంకీర్తనలను యువతకు చేరువ చేసేందుకే పోటీలు

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి


తిరుపతి(కల్చరల్‌), డిసెంబరు 6: శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని, శ్రీవారి వైభవాన్ని, అన్నమయ్య సంకీర్తనల్లోని భక్తి భావాలను జనబాహుళ్యంలో విస్తృత ప్రచారం  కల్పించడంతో పాటు యువతకు చేరువ చేసేందుకే పోటీలు నిర్వహిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘అదివో అల్లదివో’ పేరిట సోమవారం తిరుపతిలోని మహతి మందిరంలో పాటల పోటీలను ప్రారంభించారు. శీర్షికా గీతాన్ని ఆవిష్కరించి ప్రదర్శించారు. అనంతరం ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు వేల సంకీర్తనలను రికార్డు చేసి టీటీడీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. వీటిలో కొన్ని మాత్రమే బహుజనాదరణను పొందాయని తెలిపారు. మిగిలిన సంకీర్తనలనూ ప్రజలకు చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఇందులో సుమారు 50 ఎపిసోడ్‌లతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అన్నమాచార్య సంకీర్తనలపై లోతైన విశ్లేషణ చేసి ప్రతిపదార్థాలు, అర్థతాత్పర్యాలు  విశేషాలతో  భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కృషి జరుగుతోందన్నారు. కొత్త పాత మేలు కలయికతో  ఈ కార్యక్రమం ఉంటుందని ఎస్వీబీసీ చైర్మన్‌ సాయికృష్ణయాచేంద్ర  పేర్కొన్నారు. 15 నుంచి 25 ఏళ్లలోపు యువతీ యువకులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, ఎస్వీ వేద వర్సిటీ వీసీ ఆచార్య సన్నిదానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర్‌ శర్మ,  అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు డాక్టర్‌ ఆకెళ్ల విభీషణశర్మ ప్రసంగించారు.  అనంతరం జరిగిన పాటల కార్యక్రమంలో 12 మంది  సంకీర్తనలను ఆలపించి పోటీల్లో పాల్గొన్నారు. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, సినీ గాయని  ఎస్‌పీ శైలజ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ  కార్యక్రమంలో సంగీతగాయకులు పారుల్లి రంగనాథ్‌, వేదవ్యాస ఆనందభట్టార్‌తో పాటు  ఎస్వీబీసీ సీఈవో జి.సురే్‌షకుమార్‌, సీఏవో శేషశైలేంద్ర,  డీఎ్‌ఫవో శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ ఈవో రమణప్రసాద్‌, పీఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement