కొత్త జిల్లాగా అన్నమయ్య

ABN , First Publish Date - 2022-01-26T06:14:17+05:30 IST

కడప జిల్లా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయనున్నారు. నూతన జిల్లాల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కొత్త జిల్లాగా అన్నమయ్య

జిల్లా కేంద్రంగా రాయచోటి

6 నియోజకవర్గాలతో నూతన జిల్లా

రాజంపేట వాసులకు చేదు కబురు

ఉద్యమం దిశగా సన్నాహాలు

7 నియోజకవర్గాలతో కడప జిల్లా

కడప, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు కానుంది. జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేయనున్నారు. నూతన జిల్లాల ఏర్పాట్లలో భాగంగా మంగళవారం వర్చువల్‌ విధానంలో జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన వచ్చే అవకాశం ఉందని జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కొత్తగా ఏర్పడుతున్న అన్నమయ్య జిల్లాలో మదనపల్లి అర్బనతో పాటు రెండు మండలాలు, తంబళ్లపల్లె నియోజక వర్గంలోని ఏడు మండలాలు, పీలేరు నియోజక వర్గంలోని 6 మండలాలు, రాజంపేట నియోజకవర్గం లోని 6 మండలాలు, రైల్వేకోడూరు నియోజక వర్గంలోని 5 మండ లాలు, రాయచోటి నియోజక వర్గంలోని 6 మండ లాలు వస్తున్నాయి. ఈ జిల్లా పరిధిలో సుమారుగా 18 లక్షల జనాభా వచ్చే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంగా రాయచోటి ఏర్పాటు చేయడం అటు చిత్తూరు జిల్లాలోని నియోజక వర్గాలు, ఇటు కడప జిల్లాలోని నియోజకవర్గాలకు అనుకూలంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

కడపలో 7 నియోజకవర్గాలు

10 నియోజకవర్గాలతో కొనసాగిన కడప జిల్లా జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా అన్నమయ్య, కడప జిల్లాలుగా ఏర్పడనుంది. పాత కడప జిల్లా పరిధిలో కడప, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలు మిగులుతున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో 33 మండలాలు ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 32 లక్షల జనాభాతో ఉన్న కడప జిల్లా ఇక 19.20 లక్షల జనాభాకు తగ్గిపోనుంది. అయితే కడప జిల్లాలో కార్పొరేషనతో పాటు కమలాపురం, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, పులివెందుల, జమ్మలమడుగు మున్సిపాలిటీలు, మూడు రెవెన్యూ డివిజన కేంద్రాలు వస్తాయి. 

చక్రం తిప్పిన పెద్దిరెడ్డి !

రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం 1957 నుంచి కొనసాగుతోంది. అక్కడి నుంచి పలువురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. 2019 మే 30న సీఎం జగన బాధ్యతలు చేపట్టిన తొలి సమావేశంలోనే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో రాజంపేట కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు అవుతుందని, జిల్లా కేంద్రానికి అవసరమైన వనరులు కూడా అక్కడ ఉన్నాయని రాజంపేట డివిజన వాసులు భావించారు. జిల్లా కేంద్రం అయితే రాజంపేట, రైల్వేకోడూరు మరింత అభివృద్ధి చెందుతాయని భావించారు. అదే సమయంలో రాజంపేట పార్లమెంట్‌ కొత్త జిల్లాగా ఏర్పడితే జిల్లా కేంద్రం మదనపల్లె ఏర్పాటు చేయాలని మదనపల్లె జిల్లా సాధన సమితి పేరుతో ఆ ప్రాంత వాసులు ఉద్యమాలు కూడా చేపట్టారు. అదే క్రమంలో ఇటు రాజంపేట, రైల్వేకోడూరు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెకు మధ్యలో రాయచోటి ఉంటుందని, రాయచోటిని జిల్లా కేంద్రం చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అయితే రాజంపేటతో పోలిస్తే మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెకు రాయచోటి దగ్గరగా ఉంటుందని అక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరవెనుక ప్రయత్నాలు చేసి సఫలమైనట్లు పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే రాజంపేటకు వచ్చిన మెడికల్‌ కాలేజిని మదనపల్లెకు తీసుకెళ్లిన మంత్రి జిల్లా కేంద్రం కూడా దక్కకుండా చేశారని రాజంపేట, రైల్వేకోడూరు వాసులు రగిలిపోతున్నారు. 

Updated Date - 2022-01-26T06:14:17+05:30 IST