చెదిరిన మనసులకు చేయూత!

ABN , First Publish Date - 2022-05-08T09:06:45+05:30 IST

మతిస్థిమితం కోల్పోయి.. జడలు కట్టిన జట్టు, గడ్డాలతో ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేవోనన్న స్పృహ కూడా లేకుండా రోడ్ల మీద తిరిగే అభాగ్యులెందరో! అలాంటి వారికి పట్టెడన్నం పెట్టాల్సింది పోయి.. పిచ్చివాళ్లుగా..

చెదిరిన మనసులకు చేయూత!

మతిస్థిమితం కోల్పోయిన  అభాగ్యులకు అన్నం ఫౌండేషన్‌ అండ

ఉచిత వసతి వైద్య సేవలతో ఆదరణ

స్వస్థత పొంది.. అయినవాళ్ల దగ్గరకు 

ప్రస్తుతం ఈ కేంద్రంలో 270 మంది


ఖమ్మం, మే 7(ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం కోల్పోయి.. జడలు కట్టిన జట్టు, గడ్డాలతో ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేవోనన్న స్పృహ కూడా లేకుండా రోడ్ల మీద తిరిగే అభాగ్యులెందరో! అలాంటి వారికి పట్టెడన్నం పెట్టాల్సింది పోయి.. పిచ్చివాళ్లుగా ముద్రవేసి హేళన చేయడమో.. రాళ్లు, కర్రలతో కొట్టడమో చేస్తున్నారు కొందరు! మరి.. ఇలాంటి అభాగ్యులను చేరదీసి ఆదరిస్తే! ఇంత నీడ, చక్కని ఆహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తే? ఆ ఆదరణ మధ్య తామెవరనేది వారు గుర్తు తెచ్చుకొని సాధారణ స్థితికి చేరుకుంటే? ఎంత బాగుంటుందో కదా! మతిస్థిమితం కోల్పోయిన వారిపట్ల ఇవన్నీ చేస్తోంది ఖమ్మం జిల్లా కేంద్రంలోని అన్నం ఫౌండేషన్‌! మతిస్థిమితం కోల్పోయినవారిని ఆదుకునేందుకు అన్నం ఫౌండేషన్‌ 2016లో ప్రత్యేకంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.


మన రాష్ట్రం నుంచే కాక ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచీ అన్నం ఫౌండేషన్‌కు అభాగ్యులను తరలిస్తున్నారు. ఈ కేంద్రంలో ఉచిత వసతి, భోజనం, వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక చికిత్స అవసరమైన వారిని ఖమ్మంలోని మమత ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కొందరు కోలుకుని తమ సొంత ఊళ్లు, కుటుంబసభ్యుల వివరాలు చెబుతున్నారు. ఫౌండేషన్‌ సభ్యులు.. వారిని గ్రామాలకు తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికి దాకా వందమందికిపైగా సాధారణ స్థితికి వచ్చి సొంతూళ్లకు చేరుకున్నారు. ఎటో వెళ్లిపోయిన తమవారి కోసం వెతికి వెతికీ అలసిపోయి.. ఆశలు వదిలేసుకున్న స్థితిలో వారే రావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రస్తుతం అన్నం ఫౌండేషన్‌ పునరావాస కేంద్రంలో 200మందికిపైగా పురుషులు, 70మందిపైగా మహిళలు పునరవాసం పొందుతున్నారు. నెలకు ఒకరిద్దరు కోలుకొని.. తమవాళ్ల వద్దకు చేరుకుంటున్నారు. 


కోలుకొని ఇళ్లకు చేరినవారు వీరే.. 

 ఏపీలోని విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన ఆనంద్‌కుమార్‌ 12 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఖమ్మంలోని జలగంనగర్‌లో ముళ్లకంపల మధ్య తిరుగుతుండగా స్థానికులు అతడిని రాళ్లతో కొట్టారు. అతడిని అన్నంఫౌండేషన్‌ చేరదీసింది. ఇటీవల కోలుకున్న అతడు తమ కుటుంబసభ్యుల వివరాలు చెప్పాడు. వారం క్రితమే ఆనంద్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

 నల్లగొండకు చెందిన పుల్లయ్య  నాలుగేళ్ల క్రితం ఖమ్మం బైపా్‌సరోడ్డులో పిచ్చివాడిగా తిరుగుతుండగా.. పోలీసులు అన్నం ఫౌండేషన్‌కు తరలించారు. ఇటీవల  కోలుకోవడంతో నల్గొండ పోలీసుల సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగించారు. 

 హైదరాబాద్‌కు చెందిన జహంగీర్‌ మతిస్థిమితం కోల్పోయి దుస్తులు లేకుండా ఖమ్మం వైరా రోడ్డులో తిరుగుతుండేవాడు. పోలీసుల సాయంతో కొందరు అన్నం ఫౌండేషన్‌కు తరలించారు.   కోలుకున్న తర్వాత కుటుంబసభ్యుల వివరాలు చెప్పడంతో వారికి అప్పగించారు.

 జార్ఖండ్‌కు చెందిన మర్కుజ్‌ఖుజర్‌ మతిస్థిమితం కోల్పోయి 2017లో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ఒక తండాకొచ్చి అక్కడే  తిరిగేవాడు. అతడిని సైకో, పిచ్చివాడంటూ స్థానికులు కొట్టేవారు. పోలీసులిచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్‌ చేరదీసి అతడికి వైద్యం అందించింది. కోలుకున్న తర్వాత  అతడు తన వివరాలు చెప్పడంతో ప్రత్యేక వాహనంలో తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు 

 అస్సోంకు చెందిన సునిల్‌ గోగే కూడా పిచ్చివాడిగా ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తిరుగుతుండేవాడు. రైల్వేపోలీసుల సమాచారంతో అన్నం ఫౌండేషన్‌ అతడిని చేరదీసి వసతి, వైద్యం అందించింది. నాలుగేళ్ల తర్వాత కోలుకుని స్వస్థలానికి చేరుకున్నాడు. 




కష్టమైనా ఇష్టంతో సేవలందిస్తున్నాం

అనాథలు, మతిస్థిమితం లేనివారిని ఎందరినో తీసుకువచ్చి వసతి కల్పిస్తున్నాం. కష్టమైనా సరే ఇష్టంతో సేవలందిస్తున్నాం. చాలామంది కోలుకుని గతాన్ని గుర్తుకు తెచ్చుకుని మామూలు స్థితికి చేరుకుంటున్నారు. వారు తమ గ్రామాలు, కుటుంబసభ్యుల పేర్లు చెబితే.. ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అక్కడ అధికారులు, పోలీసుల సమక్షంలో కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగిస్తున్నాం. 

-అన్నం శ్రీనివాసరావు, అన్నం ఫౌండేషన్‌ వ్యవస్థానకుడు

Read more