tamilnadu: కొత్త ఆశలతో భవిష్యత్తులోకి...

ABN , First Publish Date - 2021-10-17T15:16:53+05:30 IST

తిరుగుబాటు తో ఊపిరి పోసుకున్న పార్టీ .. తిరుగులేని పతాకమై ఎగసిపడింది. సినీ నేతల చేతల్లో ఒదిగి సరికొత్త ‘విప్లవా నికి’ నాంది పలికింది. ద్రావిడ సిద్ధాంతాలు ఒక వైపు.. ఎనలేని భక్తిప్రపత్తులు మరోవైపు కలగలిపి ఎదిగిన ‘రెండాకుల చి

tamilnadu: కొత్త ఆశలతో భవిష్యత్తులోకి...

- నేడు 50వ వసంతంలోకి ‘అన్నాడీఎంకే’

- రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవ సంబరాలు

- వాడవాడలా పతాకావిష్కరణ


చెన్నై: తిరుగుబాటు తో ఊపిరి పోసుకున్న పార్టీ .. తిరుగులేని పతాకమై ఎగసిపడింది. సినీ నేతల చేతల్లో ఒదిగి సరికొత్త ‘విప్లవా నికి’ నాంది పలికింది. ద్రావిడ సిద్ధాంతాలు ఒక వైపు.. ఎనలేని భక్తిప్రపత్తులు మరోవైపు కలగలిపి ఎదిగిన ‘రెండాకుల చిహ్నం’ పార్టీ రాష్ట్ర ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురింపజేసింది. అది ‘ఇంతింతై - వటుడింతై’ అన్నట్టుగా ఎదిగి ఐదు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించింది. ఎంజీఆర్‌ చేతుల్లో జన్మించి, జానకి మాటల్లో ఒదిగి, జయ మార్గంలో ఎదిగిన ఆ పార్టీ ఆదివారం 50వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. అధికారం కోల్పోయి తీవ్ర నిరాశకు లోనవుతున్న పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా, తాజాగా ఎదురైన వరుస పరాజయాలు మరచిపోయేలా రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకద్వయం పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నిర్ణయించారు. ఆ మేరకు ఆదివారం అన్నాడీఎంకే స్వర్ణోత్సవ సంబరాలు జరుగనున్నాయి. ఆ సందర్భంగా రాష్ట్రమంతటా స్థానిక శాఖ నాయకులు పార్టీ పతాకాలను ఎగురవేయాలని నిర్ణయించారు. స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయమైన ‘ఎంజీఆర్‌ మాళిగై’లో నిర్వహించనున్న వేడుకల్లో పార్టీ ఉపసమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, సీనియర్‌ నాయకులు పాల్గొనున్నారు. కార్యాలయం వద్దనున్న ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత అందరికీ మిఠాయిలు పంచిపెట్టనున్నారు. ఆ తర్వాత పార్టీ ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం ఇతర నాయకులు అక్కడి నుంచి బయల్దేరి మెరీనాబీచ్‌ చేరుకుంటారు. అక్కడ ఎంజీఆర్‌, జయలలిత సమాధులపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించ నున్నారు. అన్నాడీఎంకే ఎంపీలు, శాసన సభ్యులు, జిల్లా శాఖ నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా పరాజయాల పీడ నుంచి కార్యకర్తలు బయటపడేలా వాడవాడలా పార్టీ స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించాలని ఇప్పటికే ఈపీఎస్‌, ఓపీఎస్‌ నేతలకు పిలుపునిచ్చారు. పతాకాలు ఎగురవేయడంతో పాటు మిఠాయిలు పంచుతూ, అన్నదానం, వస్త్రదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలు భవిష్యత్తుకు నాంది పలికేలా వుండాలని, ఎక్కడా లోటు రాకుండా చూడాలని వారు సూచించారు. దీంతో కార్యకర్తలు సంబరాలకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. 



Updated Date - 2021-10-17T15:16:53+05:30 IST