1989 తర్వాత తొలిసారి 187 స్థానాల్లో డీఎంకే చిహ్నం

ABN , First Publish Date - 2021-03-12T15:02:31+05:30 IST

త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే 1989 సంవత్సరం తర్వాత 187 స్థానాల్లో ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేయనుంది. రాష్ట్ర శాసనసభకు వచ్చే నెల ...

1989 తర్వాత తొలిసారి 187 స్థానాల్లో డీఎంకే చిహ్నం

చెన్నై/అడయార్ (ఆంధ్రజ్యోతి): త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే 1989 సంవత్సరం తర్వాత 187 స్థానాల్లో ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేయనుంది. రాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 6వ తేదీన జరిగే ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటమి పార్టీలు తలపడుతున్నాయి. అయితే, డీఎంకే కూటమిలో డీఎంకేతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి 25 సీట్లు కేటాయించారు. ఈ సీట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులంతా హస్తం గుర్తుపై పోటీ చేయనున్నారు. అలాగే, ఎండీఎంకేకే ఆరు సీట్లు కేటాయించగా, ఈ పార్టీ అభ్యర్థులంగా ఉదయ సూర్యుడు గుర్తుపై పోటీ చేయనున్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీకి మూడు సీట్లు కేటాయించారు. వీరంతా సొంత గుర్తుపై పోటీ చేస్తారు. సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలకు ఆరు చొప్పున సీట్లు కేటాయించారు. ఈ పార్టీ అభ్యర్థులంతా తమతమ సొంత గుర్తులపైనే పోటీ చేస్తారు. మణిదనేయ మక్కల్‌ కట్టికి రెండు సీట్లు కేటాయించగా, ఒక స్థానంలో ఉదయించే సూర్యుడు, మరో స్థానంలో మరో గుర్తుపై పోటీచేయనుంది. అలాగే, తమిళగ వాళ్వురిమై కట్చి, మక్కల్‌ విడుదలై కట్చి, ఆది తమిళర్‌ పేరవై, ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీకు ఒక్కో సీటును కేటాయించగా, ఇవన్నీ ఉదయించే సూర్యుడు గుర్తుపైనే పోటీ చేయనున్నాయి. అలాగే, డీఎంకే ఒక్కటే 173 సీట్లలో పోటీ చేయనుంది. కూటమిలోని పార్టీల్లో ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులతో కలుపుకుని మొత్తం 187 సీట్లలో పోటీ చేయనుంది. 1989 తర్వాత ఇన్ని స్థానాల్లో డీఎంకే ఉదయించే సూర్యుడు గుర్తుపై పోటీ చేయనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

Updated Date - 2021-03-12T15:02:31+05:30 IST