మళ్లీ వాన భయం

ABN , First Publish Date - 2021-11-29T06:55:28+05:30 IST

అన్నదాతకు కోలుకోని దెబ్బ తగిలింది. వరుస వానలవల్ల చేతికాడకు వచ్చే పంట నష్టపోయింది. వారాల తరబడి చేలల్లోనూ, పనలమీద, కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది.

మళ్లీ వాన భయం

  ఇప్పటికే వరినష్టం రూ.60కోట్ల ఉండొచ్చని అంచనా
  కొనసాగుతున్న ఎన్యుమరేషన్‌ 8 60వేల హెక్టార్లలో పంటనష్టం
 ఇంకా పొలాలు, కళ్లాలలోనే ధాన్యం 8 కమీషన్‌దార్లతోనే కొనుగోలు
  75కిలోల బస్తా.. రూ.1250నుంచి 1350 వరకే కొనుగోలు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి) అన్నదాతకు కోలుకోని దెబ్బ తగిలింది. వరుస వానలవల్ల చేతికాడకు వచ్చే పంట నష్టపోయింది. వారాల తరబడి చేలల్లోనూ, పనలమీద, కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. తడిసిన వడ్లు రంగు మారిపోతున్నాయి. కొన్నిచోట్ల మొలకలెత్తాయి. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనిపిస్తామని చెప్పినా ఎక్కడా కొనడంలేదు సొసైటీల ద్వారా కూడా కొనుగోలు వేగం అందుకోలేదు. కమీషన్‌దార్లు, మిల్లర్లు రంగంలోకి దిగి అయినకాడకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అది కూడా వాళ్లు అడిగిన ధరకు ఇస్తేనే కొంటున్నారు. లేకపోతే రోడ్ల పక్కన, గట్ల మీద, చేలలోని కళ్లాల్లోనే వారాల తరబడి ఉంచుకోవాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పటికే 60వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రూ.60 కోట్లు నష్టం ఉంటుందని తేల్చారు. కానీ వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు స్వయంగా కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఇంకా నష్టం ఉందని చెప్పడంతో ఇంకా అధికారులు ఎన్యుమరేషన్‌ చేస్తున్నారు. దీంతో నష్టం ఎన్ని కోట్లకు చేరుతుందో చూడాలి. మొత్తం 13లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని మొదట అంచనా వేశారు. ఇవాళ అది 10.5 లక్షలకు తగ్గించారు. ప్రకృతి వైపరీత్యాలు, పొటాష్‌ సరిగ్గా సరఫరా లేకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. ఏ రైతును అడిగినా ఎకరానికి 25 నుంచి 26 బస్తాలు దిగుబడి దాటడం లేదని చెబుతున్నారు.

  ధాన్యం వేగంగా కొంటే రైతును ఆదుకున్నట్టే..

జిల్లాలో అధికారులు 10.5లక్షల టన్నుల ఽధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకూ 3వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటామని ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేసినా ఎక్కడా కొనడంలేదు. ఈ కేంద్రాల వద్దకు ధాన్యం ఎవరూ తేవడంలేదు. కానీ మిల్లర్లను, బ్రోకర్లను తప్పించడం కోసం ఈక్రాప్‌ డేటా ప్రకారం కొనుగోలు చేస్తున్నామని, బ్రోకర్లు కొన్నా, మిల్లర్లు కొన్నా ఈ ప్రకారమే చేయాలని కొందరు చెబుతున్నారు. కానీ మిల్లర్లు, కమీషన్‌దారులు కొనకపోతే ధాన్యం కొనేవాడే కనబడని పరిస్థితి. ఈ క్రాప్‌ విధానం ప్రకారం రైతు తన పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం చూపించాలి. ఆధార్‌కార్డు లింక్‌ చేసుకోవాలి. అప్పుడే వారి ధాన్యం కొని నెలరోజులలోపు డబ్బు ఇస్తా మని చెబుతున్నారు. దీంతో రైతులు కమీషన్‌దార్లకే అమ్ముకోవడం గమనార్హం. ఇక్కడ మిల్లర్లు రైతు నుంచి నేరుగా కొనుక్కోవచ్చు. మన జిల్లాల్లోని మిల్లర్లు కాకినాడ ఓడరేవు నుంచి ఓడల ద్వారా విదేశాలకు బియ్యం అమ్ముతారు. అందువల్లే ప్రభుత్వం కంటే వారే ఎక్కువ కొంటారు.

  అయిన కాడికే కొనుగోలు

  ధాన్యం అయిన కాడికి కొంటున్నారు. వాస్తవానికి మద్దతు ధర ప్రకారం 75 కిలోల సాధారణ రకం ఽధాన్యం రూ.1455కు కొనాలి. ఇవాళ నెంబర్‌వన్‌ ధాన్యం రూ.1350 వరకూ కొంటున్నారు. లేకపోతే రూ.1250 వరకే కొంటున్నారు. కానీ తడిసిన ధాన్యం ఎవరూ కొనడంలేదు. బాగా పాడైన ధాన్యాన్ని పాయలంటారు. వీటిని ఎవరూ కొనడంలేదు. ధాన్యం రంగు నల్లగా మారిపోతే మసర్లు అంటున్నారు. ఇది 75 కిలోల బస్తా కేవలం రూ.1200కే అడుగుతున్నారు.

  ధాన్యం పట్టుబడికి రైతుకు రూ.20

ధాన్యం సంచుల్లో పట్టడానికి క్వింటాల్‌కు రూ.20 సాయంగా ఇస్తున్నామని, రవాణా చార్జీలు కూడా వారు పెట్టుకోనవసరం లేదని, పొలం దగ్గరే ధర నిర్ణయించాల్సి ఉందని పౌరసరఫరాల శాఖ జిల్లామేనేజర్‌ లక్ష్మీరెడ్డి తెలిపారు. సొసైటీలకు రూ.5కోట్లు ఇచ్చామని, ఈ డబ్బంతా రైతులకు ఇవ్వాలని చెప్పారు. రైతులకు ఇవ్వకపోతే సొసైటీలపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-11-29T06:55:28+05:30 IST