అన్నదాతల ఆక్రోశం

ABN , First Publish Date - 2022-07-02T04:43:15+05:30 IST

గడిచిన కొన్ని సీజన్లుగా రైతాంగం పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పంటలు పండించిన రైతులకు చివరికి మిగిలింది శ్రమే కావడం గమనార్హం.

అన్నదాతల  ఆక్రోశం
శనగలు కొనుగోలు చేయాలంటూ కలిగిరిలో రోడ్డుపై ట్రాక్టర్లు ఉంచి ఆందోళన చేస్తున్న రైతులు (ఫైల్‌)

 పెరిగిన ధరలతో భారమవుతున్న సేద్యం

పంట వేసి దిగుబడి సాధించడమే కష్టం

ఆ దిగుబడి విక్రయానికి ఆపసోపాలు

ప్రభుత్వానికి అమ్మినా అందని నగదు

అధికారులే కాదు.. ప్రజాప్రతినిధులూ పట్టించుకోని వైనం

స్వచ్ఛందంగా రోడ్డెక్కి నినదిస్తున్న కర్షకులు


హలం పట్టాల్సిన చేతులే పిడికిలి బిగిస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండాల్సిన పుడమి పుత్రుడు రోడ్డుమీదకు వచ్చి నినదిస్తున్నాడు. కడుపు నింపాల్సిన సాగు అన్నదాతల కడుపు మండిస్తోంది. పండించిన పంటను కొనేవారు లేరు.. కొన్నా ధాన్యానికి డబ్బులు రావు.. వెరసి క్రమేనా వ్యవసాయానికి దూరమవుతున్న రైతాంగం.. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండగా వీటన్నింటినీ చూస్తున్న ప్రజాప్రతినిధులు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.. ఇదీ క్లుప్తంగా జిల్లాలో రైతులు, వ్యవసాయం పరిస్థితి. ధాన్యపు సిరిగా పేరు గడించిన నెల్లూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితులు దాపురించడం అటు రైతాంగాన్ని, ఇటు సామాన్యులను ఆవేదనకు గురి చేస్తోంది. 



నెల్లూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : గడిచిన కొన్ని సీజన్లుగా రైతాంగం పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ  పంటలు పండించిన రైతులకు చివరికి మిగిలింది శ్రమే కావడం గమనార్హం. ధాన్యం, శనగలు, పసుపు, పొగాకు వంటి పంటలను విక్రయించుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. అందులోనూ పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే మరింత శ్రమించాల్సి వస్తోంది. గిట్టుబాటు ధరకు పండించిన పంటను విక్రయించుకోలేక రైతాంగం నానా అవస్థలు పడుతోంది. ఇందుకోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉంటే ఇప్పుడు అమ్మిన పంటకు సంబంధించి డబ్బులు కూడా నెలల తరబడి చేతికి అందకపోవడంతో అన్నదాతల్లో ఆక్రోశం రెట్టింపవుతోంది. ఇప్పుడు ఈ పంట డబ్బుల కోసం మళ్లీ రోడ్ల మీదకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను గమనిస్తున్న మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం అంటే పండగ కాదు.. దండగ అన్న అభిప్రాయం చాలా మంది రైతుల్లో వ్యక్తమవుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యతలో పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 


జిల్లాలో తీవ్రంగా ఆందోళనలు


అధికారులు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యలపై మొరపెట్టుకుంటున్నా పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనబాట పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నా నగదు జమ చేయకపోవడంతో జలదంకి మండల రైతులు దాదాపు పది సార్లు అధికారులను కలిసి వినతి పత్రాలు అందించారు. అయితే ఫలితం లేకపోవడంతో ఏకంగా పౌరసరఫరాల సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. పసుపు పంటను కొనుగోలు చేయాలంటూ విన్నవించుకున్నా ఎవరూ స్పందించకపోవడంతో సహనం నసించిన రైతులు ఉదయగిరి మండలం బండగాని పల్లి రైతు భరోసా కేంద్రం వద్ద బైఠాయించి కార్యకలాపాలను స్తంభింపజేశారు. శనగ రైతులదీ ఇదే పరిస్థితి. శనగలు ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కలిగిరిలో రైతులు రోడ్డుకు అడ్డంగా శనగల లోడు ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేశారు. అంతకుముందు కోవూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధాన్యం రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం కలకలం రేపింది. గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేయడంతో ఉన్నతాధికారుల హామీ మేరకు రైతులు దీక్షను విరమించుకున్నారు. ఇవేకాదు.. అనేక చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులకు రైతుల నుంచి నిరసన ఎదురవుతోంది. ప్రభుత్వం నుంచే రైతులకు తోడ్పాటు కరువవుతుండడంతో చాలా మంది సాగును విరమించుకుంటున్నారు. 


ప్రజాప్రతినిధులకు పట్టదా..?


జిల్లాలో రైతాంగం రోడ్ల మీదకు వచ్చే పరిస్థితులు ఏర్పడినా ప్రజాప్రతినిధులు స్పందించకపోతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడో ఆరు నెలలకో, సంవత్సరానికో ఏదైనా జిల్లాస్థాయి సమావేశం జరిగినప్పుడు రైతుల గురించి మాట్లాడటం తప్ప ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతాంగ సమస్యలను క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే ఆలోచనతో ప్రభుత్వం వ్యవసాయ సలహా మండళ్ల (ఏఏబీ)ను ఏర్పాటు చేసింది. రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకే) స్థాయిలో ఒక కమిటీని, మండల స్థాయిలో మరో కమిటీని, జిల్లాస్థాయిలో ఇంకో కమిటీని ప్రభుత్వం నియమించింది. ముందుగా ఆర్‌బీకే స్థాయి కమిటీలో ఆ ప్రాంతంలోని రైతుల సమస్యలను చర్చిస్తారు. వాటిని మండల స్థాయి కమిటీలో ప్రస్తావించి, తదుపరి జిల్లా స్థాయి కమిటీలో చర్చిస్తారు. ఈ సమస్యల్లో జిల్లాస్థాయిలో పరిష్కరించేవాటిని ఇక్కడే పరిష్కరిస్తారు. రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తారు. ఇప్పటివరకూ పదికి పైగా జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధుల సంఖ్యను చూస్తేనే వారికి రైతులపై ఏపాటి చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని రైతులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశాక నిర్వహించిన మొదటి సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆ తర్వాత సమావేశాల్లో వారి జాడ కనిపించలేదు. ఒకటి రెండు సమావేశాల్లో ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పాల్గొనడం మినహా ఈ వేదికగా రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామన్న ఆలోచన కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. 



Updated Date - 2022-07-02T04:43:15+05:30 IST