అన్నా వర్సిటీలో Covid కలకలం

ABN , First Publish Date - 2021-12-10T13:57:58+05:30 IST

నగరంలోని అన్నా యూనివర్శిటీలో కరోనా కలకలం రేగింది. దీంతో వర్సిటీ వసతి గృహాల్లో ఉండే 300 మంది విద్యార్థులకు గురువారం కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేశారు. వీరిలో 9 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని

అన్నా వర్సిటీలో Covid కలకలం

- హాస్టల్‌ విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు 

- 9 మందికి పాజిటివ్‌


అడయార్‌(చెన్నై): నగరంలోని అన్నా యూనివర్శిటీలో కరోనా కలకలం రేగింది. దీంతో వర్సిటీ వసతి గృహాల్లో ఉండే 300 మంది విద్యార్థులకు గురువారం కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేశారు. వీరిలో 9 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇదే విషయంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈ వసతి గృహానికి చెందిన ఒక విద్యార్థికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో 300 మంది హాస్టల్‌ విద్యార్థులకు కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు చేయగా, 9 మందికి నిర్ధారణ అయిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులను గిండీలోని కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించినట్టు చెప్పారు. పాఠశాల, కాలేజీ విద్యార్థులు వుండే ప్రాంతాల్లో భౌతికదూరం పాటిస్తూ, ముఖానికి మాస్కు ధరించాలని ఆయన కోరారు. కాలేజీలు, పాఠశాలల్లో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేసే విషయంపై ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఒక సమీక్షాసమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ముఖ్యంగా హాస్టల్స్‌లో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఎట్‌ రిస్క్‌ జాబితాలోని దేశాల నుంచి వచ్చిన 9012 మంది ప్రయాణికులకు కరోనా, ఒమిక్రాన్‌ నిర్థారణ పరీక్షలు చేయగా, 11 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. అలాగే, ఇతర దేశాల నుంచి నగరానికి వచ్చిన వారికి కూడా ఈ తరహా పరీక్షలు చేయగా, ఇద్దరికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. ఈ 13 మంది శాంపిల్స్‌ను బెంగుళూరులోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్ట్‌ సెంటరుకు పంపించినట్టు తెలిపారు. ఈ ఫలితాలు నేడు రావొచ్చన్నారు. టాంజానియా వంటి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇకపై ఎయిర్‌పోర్టుల్లోనే నిర్బంధ కోవిడ్‌ పరీక్షలు చేస్తామని మంత్రి వివరించారు. అంతకుముందు ఆయన గురువారం అన్నా విశ్వవిద్యాలయంలో ఉన్న వసతి గృహాలను పరిశీలించారు. ఆ సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ కూడా ఉన్నారు. 

Updated Date - 2021-12-10T13:57:58+05:30 IST