అన్నా వర్సిటీలో ఆరుగురికి Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-05-25T16:10:52+05:30 IST

స్థానిక గిండిలోని అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ కళాశాల ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించిన రాష్ట్ర

అన్నా వర్సిటీలో ఆరుగురికి Covid పాజిటివ్‌

పెరంబూర్‌(చెన్నై): స్థానిక గిండిలోని అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ కళాశాల ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ అక్కడ చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, వర్సిటీ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కళాశాలలో జరిగిన ఓ వేడుక కారణంగా కరోనా వ్యాపించిందన్నారు. ఆ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, వారితో సంబంధాలున్న వారికి గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించామన్నారు. ప్రస్తుతం 40 మంది పరీక్షా ఫలితాలు రాగా వారిలో ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, బాధితులకు స్పల్ప లక్షణాలు కావడంతో వారిని ఆ ప్రాంతంలోనే క్వారంటైన్‌లో ఉంచామని రాధాకృష్ణన్‌ తెలిపారు.

  

పెరుగుతున్న కరోనా కేసులు

   చెన్నై సహా నాలుగు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోందని, దానిని అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో తాజాగా ప్రబలిన ‘మంకీ ఫీవర్‌’ చికిత్సా విధానాలపై ఓమందూర్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ప్రాంగణంలో మంగళవారం వైద్యుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన డా.జె.రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉండడంతో ప్రభుత్వ సూచనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కొద్దిరోజులుగా చెన్నై, తిరువళ్లూర్‌, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని, చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో అడయార్‌, తేనాంపేట మండలాల్లో  కేసులు అధికమవుతున్నాయని తెలిపారు. తమ జిల్లాల్లో కరోనా కేసులు లేవని జిల్లా యంత్రాంగం నియంత్రణ చర్యలపై అలసత్వం చూపరాదన్నారు.

Updated Date - 2022-05-25T16:10:52+05:30 IST