అన్నా! కాళన్నా!

ABN , First Publish Date - 2020-09-09T06:55:17+05:30 IST

అన్నా! కాళన్నా! నీ జయంతికి మా అక్షర నివాళన్నా! ఎవరేమన్నానీ మాట కరకు -మనసు చెరకు!...

అన్నా! కాళన్నా!

అన్నా! కాళన్నా!

నీ జయంతికి మా అక్షర నివాళన్నా!

ఎవరేమన్నా

నీ మాట కరకు -మనసు చెరకు!

మహారాష్ట్రలో పుట్టావు

పసిప్రాయంలోనే వరంగల్లులో అడుగుపెట్టావు

తండ్రి మరాఠీ, తల్లి కన్నడ

నీవేమో తెలంగాణ తెలుగు మీగడ!

బహుభాషా కుటుంబం మీది

అందర్నీ ఆత్మీయంగా చూసే స్వభావం నీది

అన్యాయం అగుపిస్తే మాత్రం

కన్నెర్ర జేసే కాళీస్వరూపం నీది!

ఎన్నికల్ని బహిష్కరించాలని

తీవ్రవాదులు ధ్వజమెత్తినా

ప్రజాస్వామ్యపు ఓటుహక్కుకై

ప్రతిఘటించిన తెగింపు నీది,

పి.వి ప్రధాని అయినా

ప్రియమైత్రితో ‘ఏరా’ అనగలిగిన 

   పలకరింపు నీది!

‘నా గొడవ’ పేరుతో

నానా రకాల ప్రజల గొడవల్ని

నీ గొడవగా మండించిన నిప్పు కలం నీది!

ప్రజా సంక్షేమానికై ప్రభుత్వాల్ని నిలదీసిన

నిజాయితీ కల గళం నీది!

పెద్ద మనుషుల ఒప్పందం 

అమలు కావడం లేదని

తెలంగాణకన్యాయం జరుగరాదని

ప్రత్యేక రాష్ట్రంకై ఉరిమిన

ప్రచండ ఘనాఘన గర్జన నీది!

తొలి మలి ఉద్యమాలకూ ఊపిరినూదిన

తొణకని బెణకని నేతృత్వం నీది!

కల్మషమెరుగని కర్తృత్వం నీది!!

డా. వడ్డేపల్లి కృష్ణ

Updated Date - 2020-09-09T06:55:17+05:30 IST