
చెన్నై: పలు తర్జనభర్జనలు, మంతనాలు.. అలకలు.. లుకలుకల అనంతరం ఎట్టకేలకు ప్రతిపక్ష అన్నాడీఎంకే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం, ఉపసమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి సంయుక్తంగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనుండగా, అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు స్థానాలు ఖాయమైంది. డీఎంకే మూడు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. డీఎంకే ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ ఇంకా నాన్చుడు ధోరణినే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. విల్లుపురం జిల్లా కు చెందిన అన్నాడీఎంకే కార్యదర్శిగా వున్న సీవీ షణ్ముగం, రామనాధపురం జిల్లా ముదుకులత్తూర్ యూనియన్ పంచాయతీ కార్యదర్శి ఆర్.థర్మర్‌లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సీవీ షణ్ముగం దిండివనం నియోజకవర్గం నుంచి 2001, 2006లో, విల్లుపురం నియోజకవర్గం నుంచి 2011, 2016లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత జయలలిత మంత్రివర్గంలో విద్యాశాఖ, న్యాయ, వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే జూనియర్ అయిన ఆర్.థర్మర్ అభ్యర్థిత్వం మాత్రం అనూహ్యమైనదేనని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఈపీఎస్, ఓపీఎస్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి