- అన్నాడీఎంకేలో ‘రాజ్యసభ’ సెగ!
చెన్నై: అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కోసం ముమ్మర సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఆ పార్టీలో రాజ్యసభ సెగ ఇప్పుడిప్పుడే బయల్పడుతోంది. ఆ పార్టీకి వచ్చే రెండు స్థానాల కోసం సుమారు 20 మంది గట్టిగా పోటీ పడుతుండడం కనిపిస్తోంది. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడుతున్న తమకు ఈసారైనా రాజ్యసభ పదవి ఇవ్వాలని జూనియర్లు, వాటిని మళ్లీ దక్కించుకోవాలని సీనియర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా ఆ రెండు స్థానాలను తమ వర్గానికే దక్కేలా పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), ఉపమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఎవరికివారుగా వ్యూహాలు పన్నుతుండడం ఆ పార్టీలో సరికొత్త టెన్షన్ రేపుతోంది. జూన్ 2తో రాష్ట్రానికి చెందిన ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన ఎస్ఆర్ బాలసుబ్రమణ్యం, ఎ.నవనీతకృష్ణన్, ఎ.విజయకుమార్, డీఎంకే నుంచి ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్, కేఆర్ఎన్ రాజేష్ కుమార్ల పదవీకాలం ముగియనుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో వున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి ఈ సారి అన్నాడీఎంకేకు రెండు, డీఎంకే నాలుగు స్థానాలు ఖాయమైపోయింది. దాంతో ఆ రెండు స్థానాల్లో ఒకదానిని చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర మాజీ మంత్రులు సెమ్మలై, డి.జయకుమార్, సీవీ షణ్ముగం, గోకుల ఇందిర, మాజీ ఎమ్మెల్యేలు డి.ప్రభాకర్, సెల్వరాజ్, తిరువళ్లూరు మాజీ ఎంపీ వేణుగోపాల్, తేని జిల్లా నేత బీఎం సయ్యద్ రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో ముందంజలో వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీటికిమాటికి ఎదురవుతున్న సమస్యల్ని ఎదుర్కోవాలంటే రాజ్యసభ సభ్యత్వం పొందడమొక్కటే మార్గమని మాజీ మంత్రి డి.జయకుమార్ గట్టిగా భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఎంపీలు ఎస్ఆర్ బాలసుబ్రమణ్యం, నవనీతకృష్ణన్ సైతం తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. త్వరలో సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్నాడీఎంకేకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. పదవి దక్కని వారు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారేమోనని ఈపీఎస్, ఓపీఎస్ మదనపడుతున్నారు. ఈ రెండు పదవుల పందేరం వారికి పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా అన్నాడీఎంకేకు వచ్చే రెండు స్థానాల్లో ఒకదానిని తమకివ్వాలని బీజేపీ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి