అన్నా డీఎంకేలో ముసలం

ABN , First Publish Date - 2022-06-16T13:50:52+05:30 IST

‘ఏకనాయకత్వం’ ప్రతిపాదన అన్నాడీఎంకేలో ముసలం రేపిందా?.. పార్టీ అధినేత పదవి కోసం మాజీ ముఖ్యమంత్రులైన ఎడప్పాడి పళనిస్వామి

అన్నా డీఎంకేలో ముసలం

- ‘ఏక నాయకత్వం’పై ఎడతెగని చర్చలు

- మద్దతుదారులతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వేర్వేరుగా మంతనాలు?


చెన్నై, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ‘ఏకనాయకత్వం’ ప్రతిపాదన అన్నాడీఎంకేలో ముసలం రేపిందా?.. పార్టీ అధినేత పదవి కోసం మాజీ ముఖ్యమంత్రులైన ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ఎవరికి వారు ఎత్తులు వేస్తున్నారా?.. ‘ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాలే’మన్న సూత్రాన్ని అనుసరిస్తూ ఇద్దరు నేతలు వేర్వేరుగా వ్యూహరచన చేస్తున్నారా? త్వరలో జరుగనున్న సర్వసభ్య మండలి సమావేశంలో అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా?.. అవుననే అంటున్నాయి అన్నాడీఎంకే వర్గాలు. దీంతో అన్నాడీఎంకేలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఈ నెల 23న జరుగనున్న సర్వసభ్య సమావేశంలో చేపట్టాల్సిన తీర్మానాలపై చర్చించేందుకు మంగళవారం జరిగిన అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఏకనాయకత్వంపైనే జరిగిన చర్చే ఇందుకు కారణమైంది. ఇన్నాళ్లూ ‘జోడు పదవు’లంటూ సాగిన ప్రచారం కాస్తా ఏకనాయకత్వంపైకి మళ్లడంతో ఆ పదవిని తామే సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇద్దరు నేతలు ఎవరికి వారు ఎత్తులు, ఎత్తులకు పైయెత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు. 


జిల్లా కార్యదర్శుల సమావేశంలో ముందు మాజీ మంత్రి మాధవరం మూర్తి పార్టీకి ఏకనాయకత్వం అవసరమంటూ మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. పార్టీ ప్రముఖులు మనోజ్‌పాండ్యన్‌, వైగై సెల్వన్‌ తదితరులు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రసంగించారు. మాజీ మంత్రి వైద్యలింగం ఏకనాయకత్వం గురించి ప్రస్తావించడం తగదని సూచించినా ఫలితం లేకపోయింది. మెజారిటీ సీనియర్‌ నేతలు పార్టీకి వీలైనంత త్వరగా ఏకనాయకత్వం ఉండాలని పట్టుబట్టారు. పార్టీ సీనియర్‌ నాయకులు సెంగోట్టయ్యన్‌, దిండుగల్‌ శ్రీనివాసన్‌, తంగమణి, వేలుమణి, డి.జయకుమార్‌, సీవీ షణ్ముగం, ఉదయకుమార్‌ కూడా ఏకనాయకత్వమే మంచిదంటూ సూచించారు. దీంతో అక్కడికక్కడే ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు తమ అధినేతకే ఆ పదవి ఇవ్వాలంటూ వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఈపీఎస్‌.. ఏకనాయకత్వం వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని, ఆ విషయంపై తాను, పన్నీర్‌సెల్వం తగిన నిర్ణయం తీసుకుంటామంటూ అప్పటికి అందరినీ శాంతపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. 


రహస్య మంతనాలు...

జిల్లా కార్యదర్శుల సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం రాత్రి అడయార్‌ గ్రీమ్స్‌రోడ్డులోని ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం నివాసాల్లో వారి మద్దతుదారులు భేటీ అయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎడప్పాడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి త్యాగం చేసిన ఓపీఎ్‌సను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయాలని ఆయన మద్దతుదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. ఎడప్పాడి నివాసంలో సమావేశమైన ఆయన మద్దతుదారులు మాత్రం.. పార్టీ శ్రేణుల్లో 90 శాతం మంది ఆయనకే గట్టి మద్దతు ఇస్తున్నారని, ఇన్నాళ్లూ పార్టీ పరులపాలు కాకుండా కాపాడింది తమ నేతే కనుక, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కొందరు వీరిరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నాయకులు ఈపీఎస్‌, ఓపీఎస్‌ నివాసాలకు వెళ్ళి రాజీ యత్నాలు చేశారు. ఇదే విధంగా బుధవారం ఉదయం కూడా ఇరువురి నివాసగృహాల్లో మద్దతుదారులు భేటీ అయి సమాలోచనలు చేపట్టారు. ఎడప్పాడి నివాసగృహంలో మాజీ మంత్రులు వేలుమణి, తంగమణి, విజయభాస్కర్‌, దిండుగల్‌ శ్రీనివాసన్‌, నత్తం 3విశ్వనాధన్‌, ఉదయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదే రీతిలో పన్నీర్‌సెల్వం నివాసగృహంలోనూ ఆయన మద్దతు దారులు సమావేశమయ్యారు.  సమావేశంలో మాజీ మంత్రులు వైద్యలింగం, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్‌, శాసనసభ్యుడు మనోజ్‌పాండ్యన్‌, జిల్లా శాఖ కార్యదర్శులు సయ్యద్‌ఖాన్‌, వేళచ్చేరి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. ఎడప్పాడి నివాసంలో సమావేశమైన అనంతరం పార్టీ నేతలు పన్నీర్‌సెల్వం నివాసానికి వెళ్ళి రాజీ ప్రయత్నాలు చేపట్టారు. ఇదే విధంగా పన్నీర్‌సెల్వం నివాసంలో సమావేశమైన ఆయన మద్దతుదారులు ఎడప్పాడి నివాసానికి వెళ్ళి సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ నివాసాల వద్ద వారు మద్దతు దారులు పెద్ద సంఖ్యలో గుమికూడి తమ నాయకులకు మద్దతుగా నినాదాలు చేశారు. 


ఓపీఎస్ కు మద్దతుగా పోస్టర్లు...

అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వంకు మద్దతుగా పలు చోట్ల పోస్టర్లు వెలిసాయి. రాయపేట, నందనం ప్రాంతాల్లోనూ బుధవారం ఉదయం గోడలపై ఆ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ‘మా పార్టీ అన్నాడీఎంకే- మా నాయకుడు ఓపీఎస్‌ అంటూ పోస్టర్లపై ముద్రించారు. మరో పోస్టర్‌లో అమ్మ ఆశీస్సులు గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు పన్నీర్‌సెల్వంకే ఏకనాయకత్వం దక్కాలి అంటూ వేసారు. ఇంకో పోస్టర్‌లో ఓపీఎ్‌సకే ఏకనాయకత్వం దక్కాలి. అదే అమ్మ ఆదేశం. ఆ ఆదేశమే శాసనం అంటూ ముద్రించారు. ఈ పోస్టర్లు తేని, మదురై సహా పలు జిల్లాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా నగరంలోని రాయపేట, నందనం ప్రాంతంలో పన్నీర్‌సెల్వంకు మద్దతుగా అంటించిన పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంతో ఆయన మద్దతు దారులు కార్యకర్తలు గ్రీన్‌వేస్ రోడ్డులో ధర్నాకు దిగారు. పోలీసుల జోక్యంతో వారు శాంతించారు.



Updated Date - 2022-06-16T13:50:52+05:30 IST