Anna dmk మార్గదర్శక కమిటీకి మరిన్ని అధికారాలు

ABN , First Publish Date - 2021-11-25T14:21:17+05:30 IST

అంతా కలిసేవున్నామని, తమదంతా ఒకే జట్టు అంటూ సమైక్యగీతం ఆలపిస్తున్న ప్రతిపక్ష అన్నాడీఎంకేలో రోజురోజుకూ అసంతుష్టులు పెరిగిపోతున్నారు. ఈసారి ఈ అసంతృప్తి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పార్టీ

Anna dmk మార్గదర్శక కమిటీకి మరిన్ని అధికారాలు

                       - జిల్లా నేతల సభలో ఓపీఎస్‌ వర్గం పట్టు


చెన్నై: అంతా కలిసేవున్నామని, తమదంతా ఒకే జట్టు అంటూ సమైక్యగీతం ఆలపిస్తున్న ప్రతిపక్ష అన్నాడీఎంకేలో రోజురోజుకూ అసంతుష్టులు పెరిగిపోతున్నారు. ఈసారి ఈ అసంతృప్తి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం వర్గీయుల నుంచే వినవచ్చింది. పార్టీ మార్గదర్శక కమిటీకి మరిన్ని అధికారాలు కల్పించాలని, ఆ కమిటీ సభ్యుల సంఖ్యను పెంచాలని బుధవారం జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శులు, శాసనసభ్యుల సమావేశంలో సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం వర్గీయులు పట్టుబట్టారు. వచ్చే యేడాది జనవరి మొదటివారంలో జరుగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేందుకు రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ‘ఎంజీఆర్‌మాళిగై’లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉదయం 10 గంటలకు అన్నాడీఎంకే ఉపసమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విచ్చేశారు. కాసేపటికి పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం కూడా ఆయన వెనుకనే పార్టీ కార్యాలయం ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. వీరిరువురిని చూడగానే వేలాదిమంది కార్యకర్తలు ఈపీఎస్‌ వర్థిల్లాలి, ఓపీఎస్‌ వర్థిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆ ఇరువురి అధ్యక్షతన జిల్లా కార్యదర్శులు, శాసనసభ్యుల సమావేశం ప్రారంభమైంది. తొలుత మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు గురించి అందరూ సమగ్రంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత శశికళను పార్టీలో చేర్చుకునే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎడప్పాడి వర్గీయులంతా ఆమెను పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో చివరకు పార్టీ మార్గదర్శక కమిటీకి మరిన్ని అధికారులు కల్పించాలని పన్నీర్‌సెల్వం వర్గీయులు పట్టుబట్టారు. ప్రస్తుతం ఆ కమిటీలో 11 మంది సభ్యులున్నారని, ఆ సంఖ్యను 18కి పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని మరోమారు పరిశీలిస్తామంటూ ఎడప్పాడి వారిని సర్దిపుచ్చారు.


ప్రాంతీయ కార్యదర్శుల్ని నియమించాలి

ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ద్వితీయ శ్రేణి నాయకుల వద్ద పార్టీ నిర్వాహకులు పలువురు ప్రాంతీయ కార్యదర్శులను వీలైనంత త్వరగా నియమించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పలు ప్రాంతాల్లో ప్రాంతీయ కార్యదర్శులు, ఉప శాఖల కార్యదర్శుల పదవులు ఖాళీగా వుంటున్నాయని, ఈ కారణాల వల్ల నగర, పట్టణ స్థాయి నుంచి పార్టీని అభివృద్ధి పరచలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.


చెంగల్పట్టు కార్యకర్తల ధర్నా

ఎంజీఆర్‌ మాళిగైలో అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం జరుగుతుండగా కార్యాలయం వెలుపల చెంగల్పట్టు  ఈస్ట్‌ జిల్లా శాఖ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ జిల్లాల్లో కొత్తగా పార్టీలో చేరినవారికే పార్టీ పదవులు కట్టబెడుతున్నారని, దశాబ్దాల తరబడి పార్టీకి సేవచేస్తున్నవారికి ఎలాంటి పదవులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తమ జిల్లా శాఖ ఇన్‌చార్జిగా ఉన్న శాసనసభ్యుడు మరగతం కుమారవేల్‌ను పదవి నుంచితొలగించాలని బిగ్గరగా నినాదాలు చేశారు. పార్టీ సీనియర్‌ నాయకులు కొందరు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటన కారణంగా పార్టీ కార్యాలయం వద్ద అరగంటసేపు ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - 2021-11-25T14:21:17+05:30 IST