అన్నాడీఎంకేలో మార్పులు తథ్యం

ABN , First Publish Date - 2021-12-03T14:25:02+05:30 IST

కార్యకర్తలు, ప్రజల అండంతో త్వరలోనే అన్నాడీఎంకేలో భారీ మార్పులు సంభవిస్తాయని, ప్రతి కార్యకర్త తలెత్తుకు తిరిగే రోజుల కోసం తాను ఎదురుచూస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ

అన్నాడీఎంకేలో మార్పులు తథ్యం

                  - Shashikala జోస్యం


చెన్నై: కార్యకర్తలు, ప్రజల అండంతో త్వరలోనే అన్నాడీఎంకేలో భారీ మార్పులు సంభవిస్తాయని, ప్రతి కార్యకర్త తలెత్తుకు తిరిగే రోజుల కోసం తాను ఎదురుచూస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ అన్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ నిర్వాహక మండలి సమావేశం బుధవారం జరిగింది. సమావేశం అనంతరం పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు చోటుచేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ సమావేశం జరిగిన తీరుపై  వీకే శశికళ స్పందిస్తూ విడుదల చేసిన ఓ ప్రకటనలో, అన్యాయాన్ని అణిచి వేసి ద్రోహులను పాతాళానికి నెట్టేసిన పునాదులపైనే అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఆవిర్భవించిందన్నారు. ఘనచరిత్ర కలిగిన పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిం చారు. రాష్ట్రాభివృద్ధితో పాటు పేదప్రజల అవసరాలు తీర్చేందుకు ఎంజీఆర్‌, జయలలితలు తమ జీవితాలను త్యాగం చేశారని, ప్రస్తుతం వారి త్యాగం ప్రశ్నార్థకంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ పార్టీపై విశ్వాసం కలిగిన ఎందరో కార్యకర్తలు పార్టీలో మార్పులొస్తాయని ఎదురు చూస్తున్నారన్నారు. మంచి రోజులు వస్తాయని, మళ్లీ పార్టీ వెలుగొందు తుందనే కార్యకర్తల్లో ఉన్న నమ్మకం త్వరలోనే నెరవేరుతుందని అన్నారు. ప్రజల అండదండలు, కార్యకర్తల కృషితో త్వరలోనే పార్టీలో మార్పులు జరిగి పాత రోజులు రానున్నాయని, ప్రతి కార్యకర్త తలెత్తుకు తిరిగే రోజులు వస్తాయని అన్నారు. నిజాలు, న్యాయం ఎన్నటికీ ఓడిపోయిన దాఖలాలు చరిత్రలో లేవని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన తుదిశ్వాస వరకు పార్టీ కోసమే పనిచేస్తానని, ఓటమిని అంగీకరించనని శశికళ స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-03T14:25:02+05:30 IST