అన్నాడీఎంకే పంచాయతీ అధ్యక్షుడి హత్య

ABN , First Publish Date - 2022-05-17T15:09:03+05:30 IST

తిరువళ్లూర్‌ జిల్లాలో అన్నడీఎంకే పంచాయతీ అధ్యక్షుడిని భార్యా, పిల్లల కళ్ల ముందే దారుణంగా హతమార్చిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం

అన్నాడీఎంకే పంచాయతీ అధ్యక్షుడి హత్య

                  - నిందితులను అరెస్ట్‌ చేయాలంటూ గ్రామస్తుల రాస్తారోకో


ప్యారీస్‌(చెన్నై): తిరువళ్లూర్‌ జిల్లాలో అన్నడీఎంకే పంచాయతీ అధ్యక్షుడిని భార్యా, పిల్లల కళ్ల ముందే దారుణంగా హతమార్చిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... తిరువళ్లూర్‌ జిల్లా మీంజూరు యూనియన్‌ కొండకరై గ్రామ పంచాయతీ అధ్యక్షుడుగా మనోహరన్‌ (35) రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన ఆదివారం రాత్రి కరివిమేడు గ్రామంలో బంధువుల ఇంటి శుభకార్యక్రమంలో కుటుంబంతో పాల్గొని కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. మనోహరన్‌ నడుపుతున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, రోడ్డు పక్కనే ఉన్న గుంతలో చిక్కుకుంది. స్వల్పగాయాలు తగిలిన మనోహరన్‌ కారు నుంచి వెలుపలికి వచ్చే సమయంలో కారులో నుండి దిగిన గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై మారణాయుధాలతో తీవ్రంగా దాడిచేసి పరారయ్యారు. చుట్టుపక్కల వారు అతడిని వెంటనే తిరువొత్తియూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా అధ్యక్షుడు మరణవార్త తెలుసుకున్న ఆయన మద్దతుదారులు, గ్రామస్తులు మీంజూరు -తిరువొత్తియూర్‌ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టి నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను అరెస్ట్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా మనోహరన్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారని, వ్యాపారంలో నెలకొన్న పోటీ కారణంగా హత్యకు గురయ్యాడా? పాతకక్ష్యలు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని ప్రైవేటు కర్మాగారంలో వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లతో ఆందోళన చేపట్టిన ఆందోళనలకు మద్దుతుగా మనోహరన్‌ కర్మాగార నిర్వాహకులతో చర్చలు జరిపారు. ఈ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-05-17T15:09:03+05:30 IST