అధికశాతం ఏకగ్రీవాలే

ABN , First Publish Date - 2021-12-14T13:12:47+05:30 IST

జిల్లాల వారీగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు సోమవారం ఉదయం నుండి ప్రారంభమ య్యాయి. ఇటీవల పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్తలుగా మాజీ ముఖ్యమంత్రులు ఒ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి

అధికశాతం ఏకగ్రీవాలే

                 - ప్రారంభమైన అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు


చెన్నై: జిల్లాల వారీగా అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు సోమవారం ఉదయం నుండి ప్రారంభమ య్యాయి. ఇటీవల పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్తలుగా మాజీ ముఖ్యమంత్రులు ఒ. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదే రీతిలో ప్రస్తుతం జిల్లా, కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, నగరస్థాయిలలో జరుగుతున్న ఆ పార్టీ సంస్థాగత ఎన్నికల్లోనూ పలు చోట్ల పార్టీ స్థానిక శాఖ నాయకులు, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. రెండు రోజుల్లోపున పలు జిల్లాలకు చెందిన సంస్థాగత ఎన్నికలు ముగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ మేరకు కాంచీపురం జిల్లాల్లో మాజీమంత్రి డి జయకుమార్‌, మాజీ ఎంపీ విజయకుమార్‌ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా వివిధ శాఖలకు సంబంధించిన పదవులకు సోమవారం ఉదయం ఎన్నికలు నిర్వహించారు. మాంగాడు, కుండ్రత్తూరు, శ్రీపెరుంబుదూరు, వాలాజాబాద్‌, కాంచీపురం, ఉత్తిరమేరూరు సహా 17 చోట్ల ఎన్నికలు జరిపారు. తిరువళ్లూరు జిల్లాకు మాజీ ఎంపీ మైత్రేయన్‌, మాజీ మంత్రి వైగైసెల్వన్‌, మాజీ శాసనసభ్యుడు అశోక్‌ ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా వ్యవహరించారు. ఆ జిల్లాలోని ప్రైవేటు కళ్యాణమండపాలలో సంస్థాగత ఎన్నికలు జరిపారు.  చెంగల్పట్టు జిల్లాకు ఎన్నికల ఇన్‌ఛార్జీగా ఆర్‌డీ రాజారామ్‌ వ్యవహరించారు. చెంగల్పట్టు వెస్ట్‌  జిల్లా పరిధిలోని తాంబరం, పల్లావరం, చెంగల్పట్టు, మరైమలర్‌నగర్‌, పమ్మల్‌, అనకాపుత్తూరు, సెంబాక్కం తదితర ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇదే విధంగా సేలం, నామక్కల్‌ నీలగిరి, ఈరోడ్‌, మదురై, విరుదునగర్‌, తిరునల్వేలి, తెన్‌కాశి, నాగపట్టినం, మైలాడుతురై, కల్లకుర్చి జిల్లాల్లోనూ పార్టీ సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగాయి. ముప్పావు శాతం కంటే అధికమైన పదవులకు ఏకగ్రీవంగానే ఎన్నికలు ముగిసినట్లు పార్టీ సీనియర్‌ నాయకులు ప్రకటించారు.

Updated Date - 2021-12-14T13:12:47+05:30 IST