అన్నా చెల్లి.. నీళ్ల లొల్లి!

ABN , First Publish Date - 2021-07-11T05:57:13+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండడంతో తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల కూడా ఖాళీ అవుతోంది....

అన్నా  చెల్లి.. నీళ్ల లొల్లి!

తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా జల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండడంతో తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల కూడా ఖాళీ అవుతోంది. నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురిసి వరదలు రాని పక్షంలో రెండు తెలుగు రాష్ర్టాలలో సాగునీటికి, తాగునీటికి కటకట ఏర్పడుతుంది. అయినా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకుండా ప్రకటనలకే పరిమితం కావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ జలాశయాల్లోని నీటిని సాగు, తాగునీటి అవసరాలకు ముందుగా వినియోగించాలని, విద్యుత్‌ ఉత్పత్తికి తొలి ప్రాధాన్యం ఉండకూడదన్న నియమం ఉమ్మడి రాష్ట్రంలో కూడా అమలులో ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్‌ నుంచి కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల నీరు వృథా అవుతోంది. జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంత పట్టుదలగా ఉండడానికి కారణం ఏమిటి? జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడమే ఇందుకు కారణంగా కనిపించడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెబుతున్న వాళ్లు, జల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పగలరా? వరదలు వచ్చి జలాశయం నిండని పక్షంలో ఎక్కువగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమే! రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినా ఉపయోగం లేకుండా పోతుంది. అయినా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పరిస్థితి చేయిదాటకుండా నిలువరించడానికి గట్టి ప్రయత్నం చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వృథా చేయవద్దని కేసీఆర్‌ను నేరుగా కోరే సాహసాన్ని కూడా జగన్‌ రెడ్డి చేయలేకపోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకునే ఆలోచన, ఉద్దేశం తమకు లేనే లేదని ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సంజాయిషీ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలను 65:35 నిష్పత్తిలో ఆంధ్రా–తెలంగాణ పంచుకోవడానికి అంగీకరించి సంతకాలు పెట్టిన కేసీఆర్‌, ఇప్పుడు హఠాత్తుగా రెండు రాష్ర్టాల మధ్య సమాన వాటా ఉండాలని అడ్డం తిరగడానికి కారణం ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను ఇతర మార్గాలలో సమకూర్చుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ జల విద్యుత్‌ ఉత్పత్తికే ఆయన ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే తెర వెనుక ఏం జరుగుతున్నదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వైఎస్‌ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించడమే ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న ప్రస్తుత జల జగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వయసులో చిన్నదైన షర్మిల తన పార్టీ ప్రారంభోత్సవ సమయంలో చక్కని మాట అన్నారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ కలసి భోజనాలు చేస్తారు, మిఠాయిలు పంచుకుంటారు, ఉమ్మడి శత్రువును కలిసికట్టుగా ఎన్నికల్లో ఓడిస్తారు, జల వివాదం పరిష్కరించుకోవడానికి మాత్రం రెండు నిమిషాలు కూర్చోలేరా? అని ఆమె ప్రశ్నించారు. దీన్నిబట్టి హఠాత్తుగా తెర మీదకు వచ్చిన ఈ వివాదానికి సంబంధించిన లోతుపాతులు షర్మిలకు బాగానే తెలుసు అనుకోవాలి. ఇప్పుడు మనం కూడా ఈ వ్యవహారంలో తెర వెనుక ఏం జరుగుతున్నదో చూద్దాం! 


ఉన్నవన్నీ హైదరాబాద్‌లోనే!

హుజూరాబాద్‌కు జరగనున్న ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేసీఆర్‌ జల వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారని ఇప్పటిదాకా అందరూ అనుకున్నారు కానీ, అదే ప్రధాన కారణం కాదు. జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు తొలుత వార్తలు వచ్చినప్పుడు కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినా ఆయన పెద్దగా హడావుడి చేయలేదు. షర్మిల రాజకీయ ప్రవేశం గురించి జరుగుతున్న ప్రచారమంతా వదంతులని కేసీఆర్‌ భావించారు. అయితే షర్మిల అడుగులు ముందుకే పడుతూ ఉండటంతో ఏదో జరగబోతోందని గ్రహించిన కేసీఆర్‌, ఆంధ్రా సీఎం జగన్‌ రెడ్డిని ఈ విషయమై హెచ్చరించినట్టు తెలిసింది. చెల్లెలు షర్మిలను అదుపులో పెట్టవలసిందిగా జగన్‌ రెడ్డికి ఆయన హుకుం జారీ చేశారు. కేసీఆర్‌కు ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో తెలిసిన జగన్‌ రెడ్డి తన చెల్లెలు షర్మిలకు నయానోభయానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సొంత రాష్ట్రంలో తనను రాజకీయంగా తొక్కేస్తున్న జగన్‌ రెడ్డిపై అప్పటికే ఆగ్రహంగా ఉన్న షర్మిల, తెలంగాణలో రాజకీయ పార్టీని పెట్టి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నారు. చెల్లి మనసు మార్చడానికి తల్లి విజయలక్ష్మి ద్వారా కూడా జగన్‌ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టవద్దని షర్మిలకు సూచించామనీ, అయినా ఆమె తమ మాట వినడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డితో జగన్‌ చెప్పించారు. షర్మిల కోరుతున్నట్టుగా ఆస్తుల పంపకానికి కూడా తాము అంగీకరించామని, అయినా ఆమె తన నిర్ణయం మార్చుకోవడం లేదని కేసీఆర్‌కు సమాచారం అందించారు. అయితే జగన్‌ అండ్‌ కో చెబుతున్న మాటలను కేసీఆర్‌ విశ్వసించలేదు. సోదరుడిని కాదని షర్మిల ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కేసీఆర్‌ అండ్‌ కో భావించారు. ఈ నేపథ్యంలో జగన్‌ రెడ్డిపై ఒత్తిడిని పెంచారు. గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బలహీనపర్చడానికి తెలంగాణకు చెందిన మంత్రులను పంపించి వ్యతిరేక ప్రచారం చేయించడమే కాకుండా ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేసినా, జగన్‌ రెడ్డికి కనీస కృతజ్ఞత లేకుండా సోదరి షర్మిలను తమపైకి ఉసిగొల్పుతున్నారని కేసీఆర్‌ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వల్ల కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని తొలుత భావించిన కేసీఆర్‌ అండ్‌ కో, ఆమె వల్ల తమకు కూడా నష్టం జరుగుతుందన్న అంచనాకు వచ్చారు. దీంతో జగన్‌ రెడ్డిపై మరింత ఒత్తిడి పెంచడానికే ప్రధాన రిజర్వాయర్ల నుంచి గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తికి ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా కృష్ణా జలాల్లో తెలంగాణకు సగ భాగం దక్కాల్సిందేనని ప్రకటించారు. షర్మిలను నిలువరించడానికి తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కేసీఆర్‌కు నచ్చజెప్పడానికి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తాజాగా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కేసీఆర్‌కు కోపం వస్తే ఏం జరుగుతుందో కూడా ఆయన తన తల్లి విజయలక్ష్మి ద్వారా సోదరికి చెప్పించారట. అయినా షర్మిల తన మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ముందుగా నిర్ణయించుకున్నట్టుగానే వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి రోజున తెలంగాణలో రాజకీయ పార్టీని ఆమె ప్రారంభించారు. దీంతో చేసేది ఏమీ లేక జగన్‌ రెడ్డి అదే రోజు మొదటిసారిగా నోరు విప్పి పొరుగు రాష్ర్టాలతో తాను సఖ్యతనే కోరుకుంటున్నానని, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాలలో వేలుపెట్టడం తనకు ఇష్టంలేదని కేసీఆర్‌కు మరోమారు సంజాయిషీ ఇచ్చుకున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి వల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్న విషయాన్ని ఆయన మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం! జలాశయాలు మళ్లీ నిండని పక్షంలో రాయలసీమలో తాగు, సాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందన్న విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి ఆ విషయం పట్టించుకోవడంలేదని అనుకోవాలి. కేసీఆర్‌తో తనకు సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్న ఆయన, ఈ క్రమంలో రాయలసీమ ప్రయోజనాలు గాలికిపోయినా పర్వాలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి జగన్‌ రెడ్డి ఒక్కరే కాదు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించలేరు. ఎందుకంటే వారందరికీ హైదరాబాద్‌లో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసుకున్న ఖర్మ. నిన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నందున ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముఖ్యులందరూ అక్కడే స్థిరపడిపోయారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వారంతా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు పరిమితం కావాల్సి వచ్చినప్పటికీ ఆస్తులు, వ్యాపారాలు చూసుకోవడం కోసం హైదరాబాద్‌కు తరచూ వచ్చి పోతున్నారు. జగన్‌ రెడ్డికి హైదరాబాద్‌లో లెక్కకు మించి ఆస్తులు, భూములు ఉన్నాయి. అందులో కొన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం వస్తే ఏం జరుగుతుందో జగన్‌ రెడ్డికి బాగా తెలుసు. లోటస్‌ పాండ్‌ వద్ద ఉన్న రాజప్రాసాదం వైపు జేసీబీలు కదలవచ్చు. బినామీ ఆస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. అందుకే జగన్‌ అండ్‌ కో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల వినయవిధేయతలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జలాశయాలు ఖాళీ అవుతున్నప్పటికీ కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనడానికి కూడా జగన్‌ రెడ్డి సాహసించడం లేదు. సోదరుడి బలహీనతను షర్మిల కూడా ఎత్తిచూపారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా తాను జోక్యం చేసుకోనని జగన్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్నట్టుగానే బెంగళూరు, చెన్నయ్‌లో కూడా జగన్‌ రెడ్డికి అనేక ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులూ, వ్యాపారాలూ పెట్టుకొని కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెడితే ఏం జరుగుతుందో మనకంటే జగన్‌కే ఎక్కువ తెలుసు. అందుకే సోదరి షర్మిల విషయంలో తన నిస్సహాయతను కేసీఆర్‌కు వినయపూర్వకంగా వివరించి చెప్పడానికి జగన్‌ రెడ్డి నానా అవస్థలు పడుతున్నారు. లోగుట్టు తెలియని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమకు జరగబోయే నష్టాన్ని తలచుకొని కుమిలిపోతున్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణం అనుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ ప్రజలు కూడా జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న ఎత్తిపోతల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టుపై ఉమ్మడి రాష్ట్రంలోనే భూగర్భంలో విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీనివల్ల శ్రీశైలం జలాశయం అడుగంటే వరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసినా తెలంగాణదే పైచేయిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ర్టాలకు చెందిన ప్రజాహితులు జోక్యం చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం అన్వేషించడం అవసరం. కేసీఆర్‌ను కనీసం ప్రశ్నించలేని స్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజల తరఫున హైదరాబాద్‌లో ఆస్తిపాస్తులు లేని పెద్దమనుషులు ఎవరైనా ఉంటే సమస్య పరిష్కారానికి పూనుకోవాలి.


ఒంటరి జగన్‌!

ఈ విషయం అలా ఉంచితే, దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు నానాటికీ ముదురుతున్నాయి. వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఈ విభేదాలు మరింత ప్రస్ఫుటంగా కనిపించాయి. జగన్మోహన్‌ రెడ్డికి అధికారం దక్కడం, కుటుంబంలో మిగిలిన వారిని, ముఖ్యంగా షర్మిల, విజయలక్ష్మిని అధికారానికి దూరం పెట్టడంతో విభేదాలు మరింత ముదిరాయి. గతంలో వైఎస్‌ఆర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అందరూ ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్దకు కలసికట్టుగా వెళ్లి ప్రార్థనలు చేసేవారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ నెల 8వ తేదీన వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో చోటుచేసుకున్న సన్నివేశాలు విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. ఆరోజు జగన్‌ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి తొలుత ఒంటరిగా వైఎస్‌ సమాధి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత కొంతసేపటికి షర్మిల, విజయలక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులు సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. బెంగళూరు నుంచి షర్మిల ఏ సమయానికి వస్తుందో తెలుసుకున్న జగన్‌ రెడ్డి ఆ సమయంలో తాను ఇడుపులపాయలో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతపురం పర్యటనను అప్పటికప్పుడు ఏర్పాటుచేయించుకొని, షర్మిల అండ్‌ కో హైదరాబాద్‌ వెళ్లారన్నాకే ఇడుపులపాయకు వెళ్లారు. సోదరికి ఎదురుపడే పరిస్థితి కూడా లేనందున సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో మాత్రమే వైఎస్‌ఆర్‌ సమాధిని సతీసమేతంగా జగన్‌ రెడ్డి సందర్శించారు. అప్పుడు ఆయనతో పాటు మంత్రులు, పార్టీ నాయకులు మాత్రమే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కుటుంబం మాత్రమే జగన్‌ వెంట ఉంది. రాజశేఖర రెడ్డి తరఫు బంధువులు మాత్రం లేరు. హత్యకు గురైన వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతా రెడ్డి కూడా షర్మిలతో పాటే ఇడుపులపాయ వెళ్లి వచ్చారు. క్లుప్తంగా చెప్పాలంటే దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇప్పుడు జగన్‌ రెడ్డి ఒంటరి వాడయ్యారు. ఇదంతా ఒక ఎత్తయితే అదే రోజు హైదరాబాద్‌లో షర్మిల ప్రారంభించబోతున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ సభలో పాల్గొనవద్దని జగన్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తల్లి విజయలక్ష్మి పెడచెవిన పెట్టారు. ఆమె కుమార్తెతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తన ఇద్దరు బిడ్డలూ విభిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాల్సి రావడం విధి నిర్ణయమని శ్రీమతి విజయలక్ష్మి చెప్పుకొచ్చారు. అంటే తన బిడ్డల మధ్య విభేదాలు ఉన్నాయని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నారు. నిజానికి శ్రీమతి విజయలక్ష్మి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. అయినా ఆమెను జగన్‌ రెడ్డి కట్టడి చేయలేకపోయారు. అన్నాచెల్లెళ్ల మధ్య మొదలైన పోరులో శ్రీమతి విజయలక్ష్మి తన కుమార్తె షర్మిలతోనే ఉన్నారని భావించాలి. అయితే అదే సమయంలో ఆమె తన కుమారుడైన జగన్మోహన్‌ రెడ్డిని వదులుకునే పరిస్థితి కూడా లేదు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన విజయలక్ష్మి మధ్యలో జగన్‌ బాబు అంటూ ప్రస్తావించారు. దీనిపై ఆ తర్వాత షర్మిల అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. ఇద్దరు బిడ్డల మధ్య మొదలైన పోరు కారణంగా శ్రీమతి విజయలక్ష్మి నలిగిపోతున్నారు. అయితే, ఆమె కుమార్తె షర్మిల వైపే మొగ్గు చూపుతున్నారు. 


జైలుకెళ్తే ఎవరు?

ఇక అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులలో తాను జైలుకు వెళ్లవలసి రావచ్చని జగన్‌ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. తనకు శిక్ష పడితే ముఖ్యమంత్రిగా తన స్థానంలో  భార్య శ్రీమతి భారతీ రెడ్డి ఉంటారని ఆయన పార్టీ ముఖ్యులకు చెబుతున్నారు. ఈ నిర్ణయం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంలో గొడవలు పెరగడానికి కారణం కావొచ్చునని చెబుతున్నారు. జగన్‌ రెడ్డికి శిక్షపడి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే సీఎం కుర్చీలో తల్లి శ్రీమతి విజయలక్ష్మిని కూర్చోబెట్టాలని షర్మిల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. శ్రీమతి విజయలక్ష్మి కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు. అదే జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటన్నది దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబ సన్నిహితులలో చర్చనీయాంశమైంది. దివంగత వైఎస్‌ఆర్‌ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌ రెడ్డిని ప్రజలు కూడా ఆ కారణంగానే ఆదరించారని, ఏ కారణంవల్లనైనా జగన్‌ రెడ్డి పదవిని వదులుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి వారసురాలిగా ఆయన భార్య శ్రీమతి విజయలక్ష్మి మాత్రమే ఉండటం సరైనదని, విజయలక్ష్మి ఉండగా ఆ కుటుంబం కోడలు శ్రీమతి భారతీ రెడ్డి వారసురాలు ఎలా అవుతారని బంధువర్గం ప్రశ్నిస్తోంది. దీన్నిబట్టి సీబీఐ కేసులు ఒక కొలిక్కి వచ్చి జగన్‌ రెడ్డికి శిక్ష పడితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ముఖ్యుడొకరు విశ్లేషించారు. ఆ పరిస్థితి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఏ వైఖరి తీసుకుంటుందన్నది కీలకం అవుతుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పెద్దల మద్దతు ఉన్నవారే ముఖ్యమంత్రి అవుతారని వారు విశ్వసిస్తున్నారు. తమిళనాడులో జయలలిత మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. బీజేపీ పెద్దల అండ లభించడంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పదవి ఖాళీ అయితే ఆ పదవికి శ్రీమతి విజయలక్ష్మి, భారతీ రెడ్డి పోటీ పడితే బీజేపీ ఏ వైఖరి తీసుకోబోతోందన్నది కీలకం అవుతుంది. నిజానికి ఇప్పటికిప్పుడు జగన్‌ రెడ్డి అధికారానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే తనకు శిక్ష పడితే అని జగన్‌ రెడ్డి స్వయంగా అంటున్నందున అధికార పార్టీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు, ఇతర ముఖ్యులు షర్మిలను కలిసి మంతనాలు జరుపుతున్నారు. జగన్‌ రెడ్డి వ్యవహార శైలి కారణంగా తాము ఉక్కపోతకు గురవుతున్నామని, తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆమెను కోరుతున్నారు. శ్రీమతి విజయలక్ష్మి అభిప్రాయపడినట్టుగా రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే అధికారం అనేది రక్తసంబంధీకులను సైతం విడదీస్తుంది. శత్రువులను మిత్రులుగా, మిత్రులను శత్రువులుగా మారుస్తుంది. ఏదిఏమైనా జగన్‌ రెడ్డికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసిందనే చెప్పవచ్చు. ఒకవైపు కుటుంబంలో అంతఃకలహాలు, మరోవైపు ప్రభుత్వంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురుకావడంతో ఆయన పలు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. మధ్యలో తన శ్రేయోభిలాషి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వచ్చిపడిన పేచీ ఒకటి. వీటన్నింటి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాధితులుగా మారే ప్రమాదం లేకపోలేదు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల రాజకీయ ప్రయాణం ఇప్పుడే మొదలైంది కనుక మున్ముందు ఆమెకు లభించే మద్దతును బట్టి కేసీఆర్‌ వైఖరి ఆధారపడి ఉంటుంది. షర్మిల వల్ల తనకు రాజకీయంగా నష్టం తప్పదని కేసీఆర్‌ నిర్ధారణకు వస్తే జగన్‌ రెడ్డిని మరింత ఇబ్బందిపెట్టడానికి ఆయన ప్రయత్నిస్తారు. సోదరుడి కోసం ఎండనకా వాననకా కష్టపడిన తనను అధికారంలోకి రాగానే పక్కనపెట్టడాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య లడాయి ముదిరితే మిగతా వారికంటే ఆమె ఎక్కువగా సంతోషిస్తారు. ప్రస్తుతానికి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలనూ ప్రత్యర్థులుగానే పరిగణిస్తున్న షర్మిల, తెలంగాణలో తన బలంపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత మరింత స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆమె అడుగులు కాంగ్రెస్‌ వైపు పడే అవకాశం ఉందని కొందరు, బీజేపీ వైపు పడే అవకాశం ఉందని మరికొందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మున్ముందు చోటుచేసుకోబోయే పరిణామాలను బట్టి ఆమె వైఖరి ఉంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తన సోదరుడైన జగన్‌ రెడ్డిపై కేసీఆర్‌కు ఆగ్రహం కలిగేలా చేయడంలో ప్రస్తుతానికి షర్మిల సక్సెస్‌ అయ్యారు కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఏ మేరకు సక్సెస్‌ అవుతారో తేలాలంటే మరికొంత సమయం పడుతుందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ముఖ్యుడు ఒకరు చెప్పుకొచ్చారు. వైఎస్‌ఆర్‌ కుటుంబంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను బీజేపీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు తాము తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. షర్మిల ప్రస్తుతానికి కుటుంబంలో మెజారిటీ సభ్యులను తన వైపునకు తిప్పుకోగలిగారు. ఇక తెలంగాణ ప్రజల మనసులను ఏ మేరకు గెలుచుకుంటారో వేచిచూద్దాం!


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-07-11T05:57:13+05:30 IST